ఐదో విడత...ఆ సీట్లలో పోరు ఆసక్తిదాయకం!

Update: 2019-05-05 06:24 GMT
సార్వత్రిక ఎన్నికలు ఐదో విడతలో భాగంగా జాతీయ నాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈమేరకు ఉత్తరప్రదేశ్‌ లోని ఉత్తర భాగంలోని అవద్‌ ప్రదేశ్‌ నుంచి దక్షిణ భాగంలోని బుందేల్‌ ఖండ్‌ వరకు 14 ఎంపీ స్థానాలకు ఐదోవిడతలో ఈనెల 6వ తేదీ ఎన్నికలు నిర్వహిస్తారు. అన్ని స్థానాల్లోనూ బీజేపీకి గట్టి పోటీ ఉందని చెప్పవచ్చు.

2014 ఎన్నికల్లో యూపీలోని ఈ 14 లోక్‌ సభ స్థానాలకు బీజేపీ 12 చోట్ల విజయం సాధించింది. కేవలం రాయ్‌ బరేలీ (సోనియాగాంధీ) - అమేథీ (రాహుల్‌ గాంధీ)లో మాత్రమే కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలిచారు. కాగా అయోధ్యలో ఈసారి బీజేపీ గెలుస్తుందా? లేదా? అనేది చర్చనీయంగా మారింది. ఈ 14 ఎంపీ స్థానాలకు గానూ లక్నో - అయోధ్య - రాయ్‌ బరేలీ - అమేథీ - బాంధా - ఫతేపుర స్థానాలు ప్రతిష్టాత్మకతను సంతరించుకున్నాయి.

లక్నో ఎంపీ - జాతీయ రాజకీయాల్లో కీలకం

లక్నో నుంచి ఎంపీగా గెలిచిన వాళ్లు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని సెంటిమెంట్‌. 1991 – 2009 వరకు అటల్‌ బిహరి వాజ్‌పేయి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లక్నో నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.

అదేవిధంగా సమాజ్‌వాదీ పార్టీ నుంచి నటుడు శతృఘ్నసిన్హా సతీమణి పూనమ్‌ సిన్హా పోటీ చేస్తున్నారు. అయితే నియోజకవర్గంలో 4.45 లక్షల ముస్లిం ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా కాయస్త కుల ఓటర్లు 3 లక్షలు ఉన్నాయి. ఈ రెండువర్గాల నుంచి పూనమ్‌ సిన్హాకు పూర్తి మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు. అదేవిధంగా దళితులు కూడా పూనమ్‌ వైపు ఉండటంతో రాజనాథ్‌సింగ్‌ గెలుపు అంత ఈజీ కాదని తెలుస్తోంది. అయితే బ్రాహ్మణ ఓటర్లు 4.50 లక్షలు, ఠాకూర్, పంజాబీ 4 లక్షల ఓటర్లు బీజేపీ అభ్యర్థికి ప్లస్‌ కానున్నాయి. దీంతో ఇరుపక్షాల అభ్యర్థుల మధ్య భారీ పోటీ నెలకొంది.

అయోధ్యలో బీజేపీకే బలం...

రామ జన్మభూమిగా ప్రసిద్ధి చెందిన అయోధ్య బీజేపీ కంచుకోటగా ఉంది. బీజేపీ నుంచి సిట్టింగ్‌ ఎంపీ లల్లుసింగ్, కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎంపీ నిర్మల్‌ ఖత్రి, సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఆనందసేనాయాదవ్‌ బరిలో ఉన్నారు. రామ జన్మభూమి, జాతీయ కారణాల రీత్యా బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు.

బాంధాలో దళితులదే కీలక నిర్ణయం

 బాంధా పార్లమెంటు నియోజకవర్గంలో దళిత సముదాయానికి చెందిన ఓట్లే కీలకంగా చెప్పవచ్చు. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన భైరోమిశ్రాకు ఈసారి చెక్‌ పెట్టారు. గత ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆర్‌కే సింగ్‌ పటేల్‌ కు బీజేపీ టికెట్‌ ఇచ్చింది. కాగా గత ఎన్నికల్లో అలహాబాద్‌ నుంచి పోటీ చేసి గెలిచిన బీజేపీ ఎంపీ శ్యామ్‌ చరణ్‌ గుప్తా పార్టీకి రాజీనామా చేసి సమాజ్‌ వాదీ పార్టీ తరఫున బాంధా నుంచి బరిలో దిగారు. గత 2004 ఎన్నికల్లో ఆయన సమాజ్‌ వాదీ పార్టీ నుంచి ఎంపీగా గెలిచారు. బ్రాహ్మణ సముదాయం నుంచి బీజేపీకి మద్దతు ఉండగా.. ముస్లింలు - దళితులు కాంగ్రెస్ - ఎస్పీకి బలంగా ఉన్నారు.

ఫతేపుర నుంచి కేంద్రమంత్రి

ఫతేపుర నుంచి బీజేపీ తరఫున కేంద్రమంత్రి సాధ్వి నిరంజన జ్యోతి బరిలో దిగారు. టికెట్‌ ఆశించి భంగపడ్డ ఎస్పీ నేత రాకేశ్‌ సాచన్‌కు కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చింది. అదేవిధంగా బీఎస్పీ నుంచి సుఖదేవ్‌ప్రసాద్‌వర్మ పోటీ చేస్తున్నారు. ముస్లిం - దళితులు కాంగ్రెస్ - బీఎస్పీ వైపు ఉన్నారు. అలాగే 1.5 లక్షల బ్రాహ్మణ ఓటర్లు బీజేపీకి కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు.
Tags:    

Similar News