ఖమ్మం సభ ఏపీనే టార్గెట్.. బీఆర్ఎస్ బలప్రదర్శన

Update: 2023-01-14 11:33 GMT
టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన తరువాత కేసీఆర్ ఖమ్మంలో మొదటి సారి బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఢిల్లీ కేంద్రంగా తొలి సభను నిర్వహించాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఖమ్మంలో అనివార్యంగా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు తెలంగాణలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలే అని చెప్పవచ్చు. మరోవైపు పొరుగు రాష్ట్రం ఏపీలో బీఆర్ఎస్ బలం పెంచుకునేందుకే కేసీఆర్ ఖమ్మం జిల్లాను ఎంపిక చేసుకున్నట్లు వినిపిస్తోంది. ఈ సభకు 5 లక్షల మందిని రప్పించే ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ఏపీకి చెందిన వారు కూడా హాజరవుతున్నట్లు సమాచారం. ఇక ఈ సభ బాధ్యతలను కొంత మంది మంత్రులకు అప్పగించారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత టీఆర్ఎస్ అన్నిజిల్లాలను కైవసం చేసుకుంది. కానీ ఖమ్మం జిల్లా మాత్రం పూర్తి స్థాయిలో గులాబీ పార్టీకి చిక్కడం లేదు. దీంతో ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని కేసీఆర్ పలు ఆఫర్లు ప్రకటించి చేర్చుకున్నారు. అయితే ఇటీవల ఈ జిల్లాలో ఏర్పడిన కొన్ని గ్రూపు విభేదాలు రచ్చకెక్కాయి. దీంతో ఈ అవకాశాన్ని బీజేపీ ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ కు చెందిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బీజేపీలో చేర్చుకునేందుకు సిద్ధమైంది. ఆయనతో పాటు మరికొందరికి గాలం వేస్తోంది.

ఇంతలో అప్రమత్తమైన కేసీఆర్ బీఆర్ఎస్ తొలి సభను ఖమ్మంలో నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడ నిర్వహించే సభతో జిల్లాలో నెలకొన్న అసంతృప్తిని తుంచేయాలని చూస్తున్నారు. ఇప్పటికే రెండు వర్గాలుగా ఏర్పడిన తుమ్మల, పొంగులేటీల్లో తుమ్మల నాగేశ్వర్ రావును చేరదీస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సెక్యూరిటీ తగ్గించడం చూస్తే ఆయనను పక్కనబెట్టినట్లు తెలుస్తోంది. అయితే తుమ్మలను ఆదరించడంతో పాటు ఇక్కడ సభను నిర్వహిస్తే పార్టీకి లాభం చేకూరుతుందని భావిస్తున్నారు.

ఈ సభ సక్సెస్ కావడానికి నలుగురు మంత్రులు పనిచేయనున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన పువ్వాడ నాగేశ్వర్ రావుతో పాటు హరీశ్ రావు ఇప్పటికే అక్కడ మకాం వేశారు. సభ నిర్వహణ కోసం అన్నీ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. మరో ఇద్దరు మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, శ్రీనివాస గౌడ్ లు కూడా సభ నిర్వహణ బాధ్యతనుచూసుకోనున్నారు. అయితే ఈ సభకు 5 లక్షల మందిని తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సభ కోసం తెలంగాణ నుంచే కాకుండా ఏపీ నుంచి కూడా ప్రజలను తీసుకొచ్చి బీఆర్ఎస్ సభ సక్సెస్ అయిందని తెలపాలని చూస్తున్నారు.

ఇప్పటికే ఏపీకి కమిటీ వేసిన ఆయన వారికి ఈ బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉన్న ఈ జిల్లాలో సభ సక్సెస్ అయితే రెండు రాష్ట్రాలకు ప్రయోజనం కలగనుందని ఆశిస్తున్నారు. ఇందుకోసం తెలంగాణకు చెందిన మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఏర్పాటు సమయంలో తలసాని శ్రీనివాసయాదవ్ విజయవాడ కనకదుర్గా మాతను దర్శించుకున్నారు. పనిలో పనిగా అక్కడ కొందరు నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు కొన్ని పరిచయాలు పెరిగాయి. అందుకే ఆయనను రంగలోకి దించినట్లు తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News