మేకిన్ ఏపీ 'కియా' కొత్త రికార్డుతో ఇరగదీసింది

Update: 2022-02-23 04:43 GMT
పరిశ్రమల్ని రాష్ట్రానికి తీసుకురావటం ఒక ఎత్తు. వాటి కారణంగా రాష్ట్ర ఇమేజ్ మరింత పెరిగేలా చేయటం కొన్ని కంపెనీలతోనే సాధ్యమవుతుంది. తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించి.. ఏపీ ఇమేజ్ ను పెంచేలా చేస్తోందిన ప్రముఖ కొరియన్ కంపెనీ కియా. ఏపీలోని కరవు జిల్లాగా పేరున్న అనంతపురంలో తన ప్లాంట్ ను ఏర్పాటు చేసిన ఈ సంస్థ.. తన అద్భుతమైన పని తీరుతో ఇరగదీస్తోంది.

ఆసక్తికరమైన అంశం ఏమంటే.. కేవలం రెండున్నరేళ్లలో 5 లక్షల కార్లను ఉత్పత్తి చేసిన రికార్డును సొంతం చేసుకుంది.  ఇప్పటికే తాము ఉత్పత్తి చేసిన ఐదు లక్షల కార్లలో నాలుగు లక్షల కార్లను దేశీయంగా అమ్మకాలు జరిపితే.. మరో లక్ష కార్లను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. నిజానికి.. దేశ వ్యాప్తంగా కియా కార్లకున్న డిమాండ్.. వెయిటింగ్ లిస్టును లెక్కలోకి తీసుకుంటే.. ఈ అంకెలు మరింత ఆకర్షణీయంగా ఉంటాయని చెప్పక తప్పదు.

చంద్రబాబు హయాంలో కియా ఏపీలోకి ఎంట్రీ ఇవ్వటం తెలిసిందే. ఈ కార్ల కంపెనీ పుణ్యమా అని అనంతపురం జిల్లాలోని భూములకు భారీ డిమాండ్ పెరగటమే కాదు.. అనంతపురం జిల్లా ఇమేజ్ మారిన పరిస్థితి. గతానికి భిన్నంగా ఇప్పుడు జిల్లాకు చెందిన భూముల ధరలు భారీగా పెరిగినట్లుగా చెబుతున్నారు.

2019లో తమ ఫ్లాగ్ షిప్ సెల్టాస్ కారును విడుదల చేయటం.. అది కాస్తా మార్కెట్లో సక్సెస్ కావటం తెలిసిందే. అది మొదలు ఒకటి తర్వాత ఒకటి చొప్పున కార్లను విడుదల చేస్తున్న కియాకు.. దేశ ప్రజల ఆదరణ ఎక్కువగానే ఉంది. గత ఏడాది దేశీయంగా జరిగిన కార్ల ఎగుమతుల్లో 25 శాతం వాటా కియా కార్లదే కావటం గమనార్హం.  

కేవలం రెండున్నరేళ్ల కాలంలో ఐదు లక్షల కార్లను అమ్మటం విశేషంగా అభివర్ణిస్తున్నారు. ఇదో రికార్డుగా కియో వర్గాలు చెబుతున్నాయి. ఏమైనా.. మేకిన్ ఏపీ కార్ల కంపెనీ మార్కెట్లో తన అధిక్యతను పెంచుకోవటంలో మాత్రం సక్సెస్ అయ్యిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News