ఆస్ట్రేలియా ఓపెన్ విజేత తెలుగు కుర్రాడు

Update: 2017-06-25 07:49 GMT
కేవ‌లం వారం వ్య‌వ‌ధిలో రెండు అంత‌ర్జాతీయ టైటిళ్లు సొంతం చేసుకోవ‌టం అంత సులువైన విష‌యం కాదు. అందులోనూ.. ప్ర‌పంచ నెంబ‌ర్ వ‌న్‌కు షాకివ్వ‌టం ఒక ఎత్తు అయితే.. ఫైన‌ల్ మ్యాచ్‌ ను చాలా సింఫుల్ గా ముప్పావు గంట వ్య‌వ‌ధిలో ముగించిన వైనం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఇంత‌టి ఘ‌న‌త‌ను సాధించింది ఒక తెలుగు కుర్రాడు కావ‌టం తెలుగు వారంద‌రికి సంతోషాన్ని క‌లిగించేదిగా చెప్పాలి.

క్రితం వారం (ఆదివారం రోజునే) ఇండోనేషియా ఓపెన్ సూప‌ర్ సిరీస్ లో విజేత‌గా నిలిచిన  గుంటూరు అబ్బాయ్ కిడాంబి శ్రీకాంత్ తాజాగా మ‌రో టైటిల్‌ ను సొంతం చేసుకున్నారు. ఆస్ట్రేలియా ఓపెన్ సూప‌ర్ సిరీస్ బ్యాడ్మింట‌న్ టోర్న‌మెంట్‌లో 22-20, 21-16 తేడాతో చెన్ లాంగ్‌ను ఓడించి.. టైటిల్ సొంతం చేసుకున్నాడు. ముప్పావు గంట వ్య‌వ‌ధిలోనే ఫైన‌ల్ మ్యాచ్ పూర్తి అయ్యింది. తీవ్ర‌మైన పోటీ జ‌రిగిన‌ప్ప‌టికీ చ‌క్క‌టి ఫాంలో ఉన్న శ్రీకాంత్ త‌న అధిక్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ టైటిల్ సొంతం చేసుకున్నారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఫైన‌ల్ లో ఓడిన లాంగ్ ఇప్ప‌టికే ఐదుసార్లు శ్రీకాంత్ మీద గెలిచి ఉన్నాడు. అలాంటి లాంగ్‌పై పూర్తి అధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శించిన శ్రీకాంత్ తాజాగా అత‌న్ని ఓడించాడు. మ‌రో విష‌యం ఏమిటంటే.. ఆస్ట్రేలియా ఓపెన్ సూప‌ర్ సిరీస్ శ్రీకాంత్‌ కు తొలి టైటిల్ కాగా.. సైనా నెహ్వాల్ త‌ర్వాత ఈ టైటిల్‌ను సాధించిన తొలి భార‌తీయ ఆట‌గాడిగా శ్రీకాంత్ రికార్డు సృష్టించారు.

ఈ విజ‌యం శ్రీకాంత్‌ కు ఎంత పెద్ద‌దంటే.. ఫైన‌ల్లో ఓడిన చెన్ లాంగ్ ఒలింపిక్ ఛాంపియ‌న్‌. అలాంటి అత్యుత్త‌మ ఆట‌గాడిని ఓడించి టోర్నీని సొంతం చేసుకోవ‌టం ఒక ఎత్తు అయితే.. కేవ‌లం వారం వ్య‌వ‌ధిలో రెండు టోర్నీలు సొంతం కావ‌టం క్రీడాభిమానుల్ని సంతోషంలో ముంచెత్తుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News