తిండి కోసం కిడ్నీలు అమ్మేసుకుంటున్నారు

Update: 2022-01-14 05:44 GMT
ఆఫ్ఘనిస్థాన్ లో ప్రజల పరిస్థితి రోజు రోజుకు దుర్భరంగా మారిపోతోంది. చేయటానికి సరైన పనుల్లేక, చేతిలో చాలినంత డబ్బులేకపోవటంతో తినడానికి కడుపునిండా తిండి కూడా దొరకడం లేదు. దాంతో రోజుల తరబడి పస్తులు ఉండాల్సొస్తోంది. ఈ పరిస్దితిని అధిగమించేందుకు చాలామంది పెద్దవాళ్ళు తమ కిడ్నీలను అమ్మేసుకుంటున్నారు. తిండి కోసం కిడ్నీలను అమ్మేసుకుంటున్న ఘటనలు పెరిగిపోతుండటం నిజంగా దురదృష్టకరమనే చెప్పాలి.

పనిచేయటానికి చాలామంది సిద్ధంగానే ఉన్నా చేతినిండా పని దొరకడం లేదు. ఒకవేళ పని దొరికినా సరిపడా కూలీ డబ్బులు అందటం లేదు. చేతిలో ఉన్న కొద్ది డబ్బుతో ఇంటిల్లిపాదికి మూడు పూటలా కాదు కనీసం రెండు పూటల కూడా తిండి పెట్టడం కష్టమైపోతోంది.  దాంతో చేసేది లేక ఇంట్లోని మగవాళ్ళు తమ కిడ్నీలను అమ్మేసుకోవటానికి సిద్ధపడ్డారు. హెరాత్ ప్రావిన్స్ లో కొద్ది రోజులుగా కిడ్నీ ఆపరేషన్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

ఒక్కసారిగా వేలాది కిడ్నీ ఆపరేషన్లు ఎందుకు పెరిగిపోయాయని ఓ స్వచ్చంధ సంస్థ ఆరాతీసింది. దాంతో అసలు విషయం బయటపడింది. తమ కిడ్నీ అమ్ముకుని కుటుంబానికి మూడు పూటలా తిండి పెట్టాలని నిర్ణయించినట్లు ఇళ్ళల్లోని పెద్దలు చెబుతున్నారు. ఇదే విషయమై గులాం హజత్రత్ అనే వ్యక్తి మాట్లాడుతూ, ఈ వయసులో బయటకెళ్ళి అడుక్కోలేనని చెప్పారు. అందుకనే తన కిడ్నీ అమ్మేస్తే వచ్చే డబ్బుతో కొంతకాలమైనా తన కుటుంబానికి మూడు పూటలా తిండి పెట్టాలని డిసైడ్ అయినట్లు చెప్పారు. తన కిడ్నీ అమ్మేస్తే రు. 1.69 లక్షలు వచ్చినట్లు చెప్పారు.

కిడ్నీ ఆపరేషన్  జరిగిన తర్వాత కనీసం ఏడాది పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అయితే ఆపరేషన్ అయిన రెండు నెలలకే చాలామంది పనుల్లోకి వెళ్ళిపోతున్నారు. కారణం ఏమిటంటే విశ్రాంతిగా కూర్చుంటే చేతిలోని డబ్బు అయిపోతే తర్వాత ఏమి చేయాలనేది వీళ్ళ ప్రశ్న. దాతలకు తమ శరీరంలోని ఏ అవయవం అవసరమైతే వాటిని డబ్బుల కోసం అమ్మేసుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లు వేలాదిమంది ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు.

తాలిబన్ల పాలన మొదలైన తర్వాతే ఇలాంటి దుర్భర పరిస్థితులు తలెత్తాయి. మరి ఇలాంటి పరిస్దితులను అంతర్జాతీయ సమాజం ఎప్పటికి అడ్డుకుంటుందో ఏమో. ఎందుకంటే తాలిబన్ల మీద వ్యతిరేకతతోనే ప్రపంచం ఆప్ఘన్ పైన ఆంక్షలు విధించింది. ఆ ఆంక్షలే ఇపుడు దేశంలోనే వేలాది మందిని కిడ్నీలతో పాటు ఇతర శరీర భాగాలను అమ్ముకునేట్లు చేస్తోంది. ముందు ముందు ఇంకెన్ని ఘోరాలను చూడాల్సొస్తుందో.
Tags:    

Similar News