అందుకే అమెరికాను టార్గెట్ చేశాడు

Update: 2017-07-30 05:54 GMT
ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికాను చిన్న దేశమైన ఉత్తరకొరియా కవ్విస్తోంది.. ఢీ అంటే ఢీ అంటోంది. ఉత్తరకొరియా పరిపాలకుడు కిమ్ జోంగ్ ఉన్ అమెరికాను అసలు లెక్కేచేయడం లేదు.. ఈ తెగింపునకు కారణాలేమిటి? ఏ ధైర్యంతో ఆయన అగ్రరాజ్యాన్ని ఎదురిస్తున్నారు? ఈ విషయాల్ని నిపుణులు పలురకాలుగా విశ్లేషిస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన దేశపాలనా బాధ్యతలను 2011లో చేపట్టినపుడు ఏమాత్రం పాలనా అనుభవం లేని జోంగ్ ఉన్ దేశానికి ఏం మేలు చేస్తారన్న ప్రశ్న ఉదయించింది. అయితే ఆయన ఆరేళ్ల‌ పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని కొందరంటారు. అయితే అణ్వస్త్ర సముపార్జన విషయంలో మాత్రం ఆయన రాజీలేని, సాహసోపేతమైన వైఖరి అవలంబిస్తున్నాడని చాలామంది చెప్తారు.

ఉత్తరకొరియాను 1994 నుంచి 2011 వరకు పాలించిన ఆయన తండ్రి కిమ్ జోంగ్-2 ఈ విషయంలో ఇంత కఠిన వైఖరితో ఉండేవారు కాదు. అమెరికాను ప్రసన్నం చేసుకోవడానికి తరచు చర్చలు జరిపేవారు. కానీ, కిమ్ జోంగ్ ఉన్ అమెరికాను ఏ మాత్రం లెక్క చేయడం లేదు. ఇప్పటికి ఐదుసార్లు అణు పరీక్షలు జరిపించారు. వాటిలో మూడింటిని స్వయంగా దగ్గరుండి చేయించారు. ఇతర దేశాల నుంచి తమ దేశానికి అణుదాడి ముప్పు ఉన్నందున ఇటువంటి క్షిపణి పరీక్షల విషయంలో రాజీ పడేది లేదని జోంగ్ ఉన్ చెప్పారు.

కిమ్ జోంగ్ ఉన్ ఇంత సాహసం ఎలా చేయగలుగుతున్నారు? ఆయన ధైర్యానికి కారణమేమిటీ?.. అంటే అమెరికా తమను ఏమీ చేయదని ఆయన భావించడమేనన్న జవాబు వస్తుంది. అమెరికా ఒకవేళ ఉత్తరకొరియాపై దాడికి దిగితే, ఉత్తరకొరియా.. దక్షిణకొరియాను దారుణంగా దెబ్బతీస్తుంది. అందువల్ల పెను విధ్వంసం తప్పదు. దక్షిణ కొరియా తీవ్రంగా నష్ట పోతుంది. అలా జరుగడం ఇష్టం లేదు కాబట్టి అమెరికా తమపై కాలు దువ్వే సాహసం చేయదన్నది ఉన్ అంచనా.

కాగా, విడిపోయిన రెండు కొరియా దేశాలను తిరిగి ఒక్కటిగా చేయాలన్నదే కిమ్ జోంగ్ ఉన్ ఆశయం. అలా చేస్తానని పలుమార్లు ప్రజలకు హామీలు ఇచ్చారు. ఈ ప్రయత్నాలకు అమెరికా అడ్డుపడకుండా ఉండటానికే ఆయన దేశ అణ్వస్త్ర, సైనిక సామర్థ్యాలను పెంచుతున్నారని దక్షిణకొరియాలోని సిజోంగ్ సంస్థకు చెందిన విశ్లేషకుడు చియాంగ్ సియాంగ్ చాంగ్ అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News