అమెరికాపై కిమ్‌..హ‌రికేన్‌ ను మించిపోయాడుగా!

Update: 2017-09-11 13:48 GMT
నిన్న మొన్న‌టి వ‌రకు త‌న క్షిప‌ణి ప్ర‌యోగాల‌తో అమెరికాను హ‌డ‌లెత్తించిన కిమ్‌ను దారికి తెచ్చుకోవ‌డం అగ్ర‌రాజ్యానికి ఇప్ప‌ట్లో సాధ్య‌మ‌య్యేలా క‌నిపించ‌డం లేదు.  ఐక్య రాజ్య‌స‌మితిని హుటాహుటిన స‌మావేశ ప‌రిచి ఉత్త‌ర‌కొరియా పీచ‌మ‌ణిచేలా మ‌రిన్ని ఆంక్ష‌లు పెట్టాల‌ని, ఆ దేశానికి ఎగుమ‌తులు నిషేధించాల‌ని, ఆ దేశ పాల‌కుడు కిమ్ ఆస్తులు స్తంభింప జేయాల‌ని ఇలా అనేక విధాలుగా అమెరికా ఐక్య‌రాజ్య‌స‌మితిపై ఒత్తిడి తెచ్చింది. ఈ క్ర‌మంలో హాజ‌రైన భ‌ద్ర‌తా మండ‌లి.. కిమ్‌ పై క‌ఠిన ఆంక్ష‌లు విధించేందుకు క‌స‌ర‌త్తు చేస్తోంది. అయితే, ఈ చ‌ర్య‌ల‌ను ర‌ష్యా - చైనాలు పూర్తిగా వ్య‌తిరేకిస్తున్నాయి.

అయితే, మ‌రోప‌క్క‌, ఇలాంటి హెచ్చ‌రిక‌ల‌ను కిమ్ ఎడం చేత్తో తోసిపుచ్చేస్తున్నారు. త‌మ‌ను ఎవ‌రూ ఏమీ చేయ‌లేర‌ని ఆయ‌న కుండ‌బ‌ద్ద‌లు కొడుతున్నారు. అంతేకాదు, అమెరికాకు మ‌రిన్ని బ‌హుమ‌తులు ఇస్తామ‌ని ఆయ‌న చెబుతుండ‌డం మ‌రింత ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. తాజాగా తమ దేశంపై మరిన్ని ఆంక్షలు విధించేలా ఒత్తిడి తెస్తున్న అమెరికా తగిన మూల్యం చెల్లించుకుంటుందని  ఉత్తరకొరియా విదేశాంగ శాఖ   సోమవారం హెచ్చరించారు. ఉత్తరకొరియా నుంచి ఆయిల్‌ - టెక్స్‌టైల్స్‌ దిగుమతులు నిలిపేయాలని - కిమ్‌ జాంగ్‌ ఉన్‌ పై ట్రావెల్‌ బ్యాన్‌ విధించాలని అమెరికా ఐక్యరాజ్యసమితికి సమర్పించిన ఓ డ్రాఫ్ట్‌ లో పేర్కొన్నట్లు తెలిసింద‌ని పేర్కొన్న విదేశాంగ శాఖ‌.. దీనిని తీవ్రంగా భావిస్తున్న‌ట్టు పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

ఉత్త‌ర‌కొరియాతో నేరుగా త‌ల‌ప‌డే ధైర్యం లేక‌నే.. అమెరికా ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డింద‌ని ఉత్త‌ర కొరియా ఎద్దేవా చేసింది. అందుకే ఐక్యరాజ్యసమితిలో ఉత్త‌ర కొరియాకి వ్యతిరేకంగా అమెరికా ఒత్తిడి తెస్తోందని విమ‌ర్శించింది. ఒక వేళ అమెరికా ఒత్తిడికి త‌లొగ్గి.. ఐక్యరాజ్యసమితి కఠిన నిర్ణయాలు తీసుకుంటే అమెరికా మూల్యం చెల్లించుకోక తప్పదని ఉత్త‌ర‌కొరియా విదేశాంగ శాఖ తీవ్రంగా హెచ్చరించింది. అమెరికాను ముంచెత్తేది హరికేన్లు కాదని - వరుస చర్యలతో అంతకు పదింతలు శక్తిమంతమైన తామేన‌ని చెప్పింది. మ‌రి ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.


Tags:    

Similar News