వేలానికి కింగ్‌ఫిష‌ర్ లోగో

Update: 2016-03-30 06:18 GMT
అప్పులు ఇచ్చినంత తేలిక కాదు వ‌సూలు చేసుకోవ‌టం. నిజానికి ఈ విష‌యం వ్యాపారుల‌కు.. ముఖ్యంగా బ్యాకింగ్ రంగంలో ఉన్న వారికి మించి బాగా తెలిసినోళ్లు మ‌రొక‌రు ఉండ‌రు. కానీ.. వీవీఐపీలు నోరు తెరిచి అప్పు అడ‌గ‌కున్నా.. ఇంటికి వెళ్లి మ‌రీ వేలాది కోట్లు ఇచ్చేసే బ్యాంకులు దేశంలో కోకోల్లొలు. ఇలాంటి బ్యాంకుల కోస‌మే మాల్యా లాంటివాళ్లు వెయిట్ చేస్తుంటారు. అలాంటోళ్ల ప‌ర‌ప‌తికి ఫిదా అయిపోయి.. కోరినంత అప్పులు ఇచ్చేయ‌టం.. ఆ త‌ర్వాత వాటిని వెన‌క్కి తీసుకోలేక కిందామీదా ప‌డిపోవ‌టం మామూలే.

తాజాగా మాల్యా ఇష్యూలో ఎస్‌బీఐ అడ్డంగా బుక్ కావ‌టం తెలిసిందే. వంద‌లాది కోట్ల రూపాయిల్ని మాల్యాకి ఇచ్చేసి అడ్డంగా బుక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఇప్పుడా అప్పుల్ని తిరిగి రాబ‌ట్టుకోవ‌టం కోసం మాల్యా ఆస్తుల్ని ఒక్కొక్క‌టికి వేలం వేసే ప్ర‌య‌త్నాల్ని ముమ్మ‌రం చేసింది. మొన్న‌టికి మొన్న ముంబ‌యిలోని కింగ్ ఫిష‌ర్ హెడ్డాఫీసును వేలం వేయ‌టానికి ఎస్‌బీఐ ట్రై చేస్తే కొనేందుకు ఒక్క‌రుకూడా ముందుకు రాని ప‌రిస్థితి. దీంతో.. వేలంపాట ఎవ‌రూ రాకుండానే  క్లోజ్ అయిన ప‌రిస్థితి.

తాజాగా.. కింగ్‌ఫిష‌ర్ ట్రేడ్ మార్క్‌.. లోగోను వేలం వేసేందుకు ఎస్‌బీఐ రెఢీ అయ్యింది. ఈ రెండింటి విలువ క‌నీస ధ‌ర‌గా రూ.367 కోట్లు నిర్ణ‌యించింది. అంటే.. కింగ్‌పిష‌ర్ లోగోను.. ట్రేడ్ మార్క్‌ను సొంతం చేసుకోవాల‌నుకునేవారు క‌నీసం రూ.367 కోట్లు అయితే చెల్లించేందుకు రెఢీ అవ్వాలి. మునిగిపోయిన ఓడ‌లాంటి కంపెనీకి చెందిన బ్రాండ్‌ను ఇన్నేసి వంద‌ల కోట్లు పెట్టి కొనుక్కునే క‌న్నా.. అందుకు పెట్టే కోట్ల‌ల్లో కొంత పెట్టినా కొంగొత్త ఇమేజ్ ను సొంతం చేసుకోలేరా? ఈ త‌ర‌హా వాద‌న‌లు ఎన్ని ఉన్నా.. ఎస్‌బీఐ తాజా వేలంపాట‌కు ఎలాంటి రెస్పాన్స్ వ‌స్తుందో చూడాలి.
Tags:    

Similar News