అర్ధ‌రాత్రి మహిళా గ‌వ‌ర్న‌ర్ సాహ‌సం ఇది!

Update: 2017-08-20 04:29 GMT
అది పుదుచ్చేరి ప్ర‌ధాన ర‌హ‌దారి! స‌మ‌యం.. అర్ధ‌రాత్రి! ర‌హ‌దారుల‌న్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి! ఇంత‌లో ఇద్ద‌రు మ‌హిళ‌లు బైక్‌ పై దూసుకు వెళుతున్నారు!! అందులో వెనుక‌వైపు ఉన్న మ‌హిళ త‌న ముఖం క‌నిపించ‌కుండా చున్నీ క‌ట్టుకుంది. ఒక‌టి కాదు రెండు కాదు వీలైన‌న్ని ర‌హ‌దారుల్లో వీళ్లు ధైర్యంగానే తిరుగుతూనే ఉన్నారు. అంతేగాక అక్క‌డ క‌నిపించిన వారిని ప‌ల‌క‌రిస్తూ.. స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. మ‌హిళ‌లు అర్ధ‌రాత్రి ఒంట‌రిగా వీధుల్లో తిర‌గాలంటేనే ఎంతో ఆలోచించాల్సిన స‌మ‌యంలో.. వీరిద్ద‌రూ అసామాన్య ధైర్య సాహ‌సాలు ప్ర‌ద‌ర్శించి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేశారు.

ఇంత‌కీ వీళ్లు ఎవ‌రంటే.. దేశంలో తొలి మ‌హిళా ఐపీఎస్ అధికారి - పుదుచ్చేరి గ‌వ‌ర్న‌ర్ కిర‌ణ్ బేడీ - ఆమె స‌హాయకురాలు! మ‌హిళా భద్ర‌త గురించి తెలుసుకునేందుకు వీరు ఇలాంటి సాహ‌సానికి తెగించారు. సమాజంలో మహిళలపై దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. స‌భ‌ల్లోనూ, కార్యాల‌యాల్లోనూ..ఇంటా - బయటా - ఇలా లైంగిక వేధింపుల‌కు గుర‌వుతూనే ఉన్నారు. ముఖ్యంగా రాత్రివేళ‌ల్లో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ దాదాపు శూన్య‌మ‌నే చెప్పుకోవాలి. ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్నామ‌ని ఎంత అధికారులు చెబుతున్నా.. అవ‌న్నీ నీటిమూట‌లే!!

మ‌రి అంద‌రిలా వీటిని మౌనంగా వింటూ ఉంటే ఏముంది అనుకున్నారో ఏమో.. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కిర‌ణ్ బేడీ ఈ సాహ‌సం చేశారు. ఒక‌ అజ్ఞాత వ్యక్తిలా న‌గ‌రంలో ప‌ర్య‌టించాల‌ని నిర్ణ‌యించారు. శుక్రవారం రాత్రి సహాయకురాలితో కలిసి ఆమె బైక్‌ పై పుదుచ్చేరిలోని ర‌హ‌దారుల్లో తిరిగారు. అయినా పోలీసు అధికారిణిగా ఉన్న స‌మ‌యంలో కిర‌ణ్ బేడీ అంటే నేర‌స్తుల‌కు గుండెల్లో రైళ్లు ప‌రుగెట్టేవే. ఆ ఖాకీ యూనిఫాం వేసుకుని ప‌నిచేసిన బేడీ... రిటైర్ అయిన త‌ర్వాత గ‌వ‌ర్న‌ర్ గిరీలో కూర్చున్నా కూడా ఆ వాస‌న‌ల‌ను ఇంకా వ‌దిలిపెట్టిన‌ట్టు లేర‌న్న మాట‌.
Tags:    

Similar News