మౌనమేల నల్లారి..? సోనియాకు తేల్చి చెప్పేశారా?

Update: 2022-06-17 02:30 GMT
సీఎం హోదాలో.. ఉమ్మడి ఏపీ విభజనను చివరి క్షణం వరకు అడ్డుకున్నారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. తనను ఏరి కోరి సీఎంను చేసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయాన్ని సైతం తీవ్రంగా వ్యతిరేకించారు. అదే సమయంలో 2014 ఎన్నికలకు జై సమైక్యాంధ్ర పేరిట పార్టీని స్థాపించి.. అభ్యర్థులను పోటీకి దింపారు. ఆ పార్టీ వారు.. కాంగ్రెస్ పై కోపంతో చివరకు అప్పటి ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతిచ్చారనే ఆరోపణలు వచ్చాయి. కిరణ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. ఆయన తమ్ముడు కిశోర్ కుమార్ రెడ్డి టీడీపీకి మద్దతు పలికారు. కాగా, ఇటీవల కిరణ్ కుమార్ రెడ్డి మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి వస్తున్నా అంటూ హడావుడి చేశారు. ఇప్పుడు మౌనంగా ఉన్నారు.

ఢిల్లీ వెళ్లారు.. వచ్చారు..

రాజకీయ పునరాగమనం నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి ఆ మధ్య ఢిల్లీ వెళ్లారు. ఇంకేం..? ఆయన నుంచి కీలక ప్రకటన రావొచ్చని భావించారు. ఏపీలో నామమాత్రమైన కాంగ్రెస్ ను కిరణ్ చేతుల్లో పెట్టి పునరుత్తేజితం చేస్తారని అనుకున్నారు. ఎలాగూ.. విభజనను వ్యతిరేకించినందున కిరణ్ కుమార్ రెడ్డి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది. అసలు నాడు కాంగ్రెస్ ఏ పరిస్థితుల్లో విభజన చేసినది? తాను ఏ విధంగా ఆపేందుకు ప్రయత్నించినది? తదనంతర పరిణామాలు ఎలా ఉన్నా.. అయిదేందో అయిపోయింది.. మళ్లీ కాంగ్రెస్ ను ఆదరించండి అని కిరణ్ కుమార్ చెప్పేందుకు అవకాశం ఉండేది. అధిష్ఠానం కూడా ఆ దిశగానే ఆలోచన చేసింది. ఢిల్లీ వెళ్లొచ్చిన నల్లారి కూడా పార్టీలోకి పునరాగమనంపై కీల‌క ప్ర‌క‌ట‌న చేస్తార‌ని అంద‌రూ భావించారు. అంతేకాక ఏపీలో కాంగ్రెస్ ప‌గ్గాలు ఆయనకు ఇవ్వ‌బోతున్నార‌నే ప్ర‌చారం జోరుగా సాగింది. అయితే కిర‌ణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు కానీ ఆయ‌న వ‌చ్చిన త‌రువాత అంద‌రూ ఊహించిన‌ట్లు ఎటువంటి ప్ర‌క‌ట‌న లేదు.

గట్టెక్కించలేనని చెప్పేశారా?

విశేష అనుభవం ఉన్న రాజకీయ కుటుంబానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి.. ఏపీ పీసీసీ చీఫ్ అయితే పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చి ఉండేది. అయితే, ఈ బాధ్యతలపై ఆయన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియా, రాహుల్ గాంధీ వద్ద అశక్తత వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్ర‌స్తుతం పరిస్థితుల్లో ఏపీలో కాంగ్రెస్ ను తాను గ‌ట్టెక్కించలేన‌ని స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఏపీలో కాంగ్రెస్ కు కార్యకర్తలు ఉన్నా నేత‌లు లేర‌ని.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో కాంగ్రెస్ లో చేరేందుకు ఒక్క‌రు కూడా ముందుకు రార‌ని ఆయ‌న కుండబద్దలు కొట్టినట్లు కథనం. వాస్తవానికి ప్ర‌శాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరుతున్నట్లు రెండు నెలల కిందట వార్తలు వచ్చిన సమయంలో ఏపీలో జ‌గ‌న్ పార్టీని కూడా ఆయ‌న కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొమ‌ని స‌ల‌హా ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది.

ఏపీలో ప్ర‌స్తుతం అధికార‌ పార్టీపైకి అన్ని పార్టీలు ఒక్క తాటిపైకి వ‌స్తున్న నేప‌థ్యంలో కాంగ్రెస్ తో వెళ్లెత్తే కాస్త‌యిన ఓట్లను చీల్చొచ్చ‌నే స‌ల‌హాను ఆయ‌న జ‌గ‌న్ కు ఇచ్చిన‌ట్లు స‌మాచారం. అయితే ఈ ప్ర‌చారం నేప‌థ్యంలో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో చివ‌రి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించిన కిర‌ణ్ కుమార్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. కిర‌ణ్  కూడా జ‌గ‌న్ ను క‌లుపుకొని ఏపీలో కాంగ్రెస్ కు మ‌ళ్లీ పూర్వ‌వైభ‌వం తీసుకోస్తే బాగుంటుంద‌ని సోనియా, రాహుల్ కు చెబుతారాని అంద‌రు భావించారు.

ఏపీని వదిలేయండి.. తెలంగాణలో ఆశ ఉంది.. ప్రయత్నించండి

వైసీపీతో పొత్తు విష‌యమై కూడా కిరణ్ కుమార్ రెడ్డి సోనియాకు తేల్చిచెప్పినట్లు స‌మ‌చారం. కాంగ్రెస్ తో పోత్తు పెట్టుకోవ‌డానికి వైసీసీ సిద్ధంగా లేద‌ని.. అలాంటి వ్యూహమేదీ వ‌ర్క్ అవుట్ కాద‌ని చెప్పినట్లు తెలుస్తోంది. త‌న‌పై న‌మ్మ‌కంతో త‌న‌ను పిలిచి బాధ్య‌త తీసుకొమ్మనందుకు కృత‌జ్ఞ‌త‌లు కానీ ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో తానే కాదు ఎవ‌రు కూడా ఏపీలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకురాలేనని ఆయన సూటిగా సోనియాకే చెప్పినట్లు తెలుస్తోంది. అంతేగాక తెలంగాణ‌లో కాంగ్రెస్ కు కాస్త పాజిటివ్ వేవ్ ఉందని.. అక్క‌డ దృష్టిపెడితే బాగుంటుంద‌ని కూడా  స‌ల‌హా ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

కిర‌ణ్ కుమార్ రెడ్డి డిల్లీ వెళ్లారు కానీ అంద‌రూ ఉహించిన‌ట్లు ఆయ‌న వ‌చ్చిన త‌రువాత ఏపీలో కాంగ్రెస్ కు సంబంధించి ఒక్క ప్ర‌క‌ట‌న కూడా లేదు. దీంతో అసలు సోనియా గాంధీ.. కిర‌ణ్ కుమార్ రెడ్డిని ఎందుకు హుట‌హుటిన ఢిల్లీకి ర‌మ్మ‌న్నారు..? ఏపీ కాంగ్రెస్ కు పూర్వ వైభ‌వం తీసుకొని రావ‌డానికి ఇద్ద‌రి మధ్య ఎలాంటి చ‌ర్చ జ‌రిగింది..?
అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఢిల్లీ వెళ్లిన కిర‌ణ్ కుమార్ రెడ్డి సోనియా, రాహుల్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీలో ప్ర‌స్తుతం కాంగ్రెస్ ఉన్న ప‌రిస్థితిని పూర్తిగా కిర‌ణ్
కుమార్ రెడ్డి ఇద్ద‌రికి వివ‌రించిన‌ట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News