విమాన ప్రయాణీకులకు చుక్కలు చూపిస్తున్న మంత్రులు

Update: 2015-07-03 04:57 GMT
పాలన ఎవరిదైనా.. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారి వైఖరి ఒకేలా ఉంటుందన్నది మరోసారి రుజువైంది. యూపీఏ హయాంలో వీవీఐపీలుగా ఉన్న రాజకీయ నేతలు ఎలా వ్యవహరిస్తున్నారో.. అచ్చుగుద్దినట్లుగా ఎన్డీయే సర్కారులోనూ అదే తీరు కనిపిస్తోంది.

తాజాగా చోటు చేసుకున్న ఉదంతాల్ని చూస్తే ఇది నిజం అనిపించక మానదు. ముఖ్యమంత్రి.. మంత్రుల కోసం విమానాలు ఆలస్యంగా బయలుదేరటం ఒకటైతే.. అప్పటికే విమానంలో కూర్చున్న వారిని కిందకు దించేసి మరీ మంత్రుల్ని ఎక్కించుకునే దారుణానికి ఎయిర్‌ఇండియా సిబ్బంది పాల్పడ్డారు. దీనికి కేంద్రమంత్రి క్షమాపణలు చెబితే సరిపోుందా..? ఆ కుటుంబానికి కలిగిన వేదనను ఎవరు మాత్రం పూడ్చగలరు.

జమ్మూకాశ్మీర్‌కు వెళ్లిన కేంద్రసహాయమంత్రి కిరణ్‌ రిజీజుతో కూడిన ముగ్గురు బృందం తిరిగి ఢిల్లీ చేరుకోవటానికి శ్రీనగర్‌లో బయలుదేరారు. అయితే.. అప్పటికే విమానం పూర్తిగా నిండిపోయింది. అదే చివరి ఫ్లైట్‌. దీంతో.. అప్పటికే విమానంలో కూర్చున్న ఒక ఐఏఎస్‌ అధికారి కుటుంబాన్ని కిందకు దించేసి మరీ మంత్రిని ఎక్కించారు.

ఈ సందర్భంగా విమాన ప్రయాణికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. పైలెట్‌కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. జరిగిన ఉదంతంపై కేంద్రమంత్రి తాను అందరి తరఫున క్షమాపణ చెబుతున్నట్లు పేర్కొనగా.. ప్రయాణికుల్ని కిందకు దించేసి మరీ.. తమను విమానంలో ఎక్కించుకున్నారన్న విషయం తనకు తెలీదని.. నిజంగా ఈ విషయంలో బాధ పడుతున్నానని కేంద్రమంత్రి పేర్కొన్నారు.

మరో ఉదంతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఎక్కాల్సిన విమానంలో ఆయన పాస్‌పోర్ట్‌ మర్చిపోయారు. దీంతో తిరిగి ఇంటికి వెళ్లి.. తెచ్చుకునే సరికి దాదాపు గంట ఆలస్యం అయ్యింది. ఈ కారణంగా ఆయన ప్రయాణం చేయాల్సిన అంతర్జాతీయ విమానాన్ని నిలిపివేశారు.ఈ ఆలస్యంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తన పాస్‌పోర్ట్‌ మర్చిపోవటం ఏమిటి? దీనికి ఉతుత్తి సారీల కారణంగా ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయం మర్చిపోకూడదు.

Tags:    

Similar News