అరుణ్ జైట్లీని అంతమాటనేశారేంటి ఎంపీ జీ!

Update: 2016-12-26 08:47 GMT
పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీకి ఇతర పార్టీలకు మధ్య వార్ నడుస్తున్న నేపథ్యంలో.. తాజాగా బీజేపీ నేతలు కూడా కేంద్రమంత్రులపైన విమర్శలు చేయడం మొదలుపెట్టేశారు. నిన్నకాకమొన్న బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి తనదైన మార్కు విమర్శలు ప్రభుత్వంపై చేయగా - ఇంకా చెదురుమదురు గా బీజేపీ నేతలే ఈ వ్యవహారంపై విమర్శలు చేయడం జరుగుతూనే ఉంది. ఇలా కేంద్రప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న బీజేపీ నేతల లిస్ట్ లో తాజాగా చేరారు బీజేపీ నుంచి సస్పెండయిన నాయకుడు - మాజీ క్రికెటర్ కూడా అయిన ఎంపీ కీర్తి ఆజాద్. ఈయన పూర్తిగా కేంద్రప్రభుత్వం పైనా - మోడీపైనా విమర్శలు చేయకుండా.. నేరుగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని టార్గెట్ చేశారు.

పెద్ద నోట్ల రద్ధు విషయంలో సామాన్యులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, దీకికి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అసమర్థతే కారణం అని అన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్య మానవులు ఎదుర్కొంటున్న సమస్యలకు అసమర్ధుడైన అరుణ్ జైట్లీ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో ఇదేదో జైట్లీ తీసుకున్న నిర్ణయంగా మాట్లాడటం మొదలుపెట్టిన ఆయన... కేంద్ర ప్రభుత్వానికి అరుణ్ జైట్లీ చెడ్డపేరు తెస్తున్నారని అంటున్నారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే అరుణ్ జైట్లీ అసలు ఆర్థికవేత్తే కాదని, ఈ ఇబ్బందులకు బాధ్యత వహిస్తూ ఆయన వెంటనే రాజీనామా చేయాలని అన్నారు.

ఇంతవరకూ బాగానే ఉంది కానీ... బ్యాంకులు నల్లధనాన్ని తెల్లగా మార్చడంలో నిమగ్నమైపోయాయని, దీంతో బ్యాంకులు కూడా ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలోకే వస్తాయి కాబట్టి, వాటిలో జరిగే అక్రమాలకు బాధ్యత వహిస్తూ జైట్లీ తప్పుకోవాలని అన్నారు. అయితే ఈ విషయంలో ప్రత్యక్షంగా జైట్లీని తప్పుపట్టిన ఆజాద్... పరోక్షంగా మోడీకి చెప్పాలనుకున్న విషయం చెప్పేసినట్లేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. నోట్ల రద్దు వల్ల ప్రధాని మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని బీజేపీ నేతలంతా చెబుతుంటే... ఈ విషయానికి బాధ్యత వహిస్తూ ఆర్ధిక మంత్రి రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీ డిమాండ్ చేయడం అనేది... ఈ నోట్ల రద్దు వ్యవహారం పూర్తిగా ఫెయిల్ అయ్యిందని చెప్పడం కాక మరేమిటి!?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News