హైదరాబాద్ కు మరో మణిని తెచ్చే ప్రయత్నంలో కిషన్ రెడ్డి

Update: 2021-12-30 04:34 GMT
దేశంలోని మహా నగరాలకు ఏ మాత్రం తీసిపోని సత్తా హైదరాబాద్ సొంతం. భాగ్యనగరి మణిహారంలో మరో మంచి పూసలా ఇమిడే ఒక ప్రతిష్ఠాత్మక ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణకు ఇది తీసుకురా.. అది తీసుకురా.. తెలంగాణకు ఏమిచ్చారంటూ తరచూ మాట్లాడే కేసీఆర్ అండ్ కోకు చేతినిండా పని పెట్టే ప్రతిపాదన ఒకటి రాష్ట్రానికి వచ్చింది.

హైదరాబాద్ మహానగరంలో సైన్స్ సిటీ ఏర్పాటు ప్రతిపాదనను రాష్ట్రానికి పంపారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర సాంకేతిక.. పర్యాటక అభివ్రద్ధి శాఖ ఆధ్వర్యంలో సైన్స్ మ్యూజియాల జాతీయ మండలి దేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పలు నగరాల్లో సైన్స్ సిటీలు.. సైన్స్ సెంటర్లు.. ఇన్నోవేషన్ హబ్ లు.. డిజిటల్ ప్లానటోరియాల్ని ఏర్పాటు చేస్తున్నారు.

ఇందులో భాగగా హైదరాబాద్ మహానగరంలో సైన్స్ సిటీని ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ.. తెలంగాణ రాష్ట్రానికి లేఖ రాశారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టు వివరాల్ని తెలంగాణ ప్రభుత్వానికి పంపారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ సైన్స్ సిటీలో భాగంగా ఇంటరాక్టివ్ సెషన్ ఎగ్జిబిషన్ హాళ్లు.. డిజిటల్ థియేటర్లు.. త్రీడీ షోలు.. స్పేస్ సైన్స్ ఎగ్జివిషన్ కేంద్రాలు.. అవుట్ డోర్ సైన్స్ పార్కులు.. ఆడిటోరియం.. వర్క్ షాపులు ఏర్పాటవుతాయి. దీనికి సంబంధించిన మార్గదర్శకాల్ని రాష్ట్రానికి పంపి.. సమగ్ర ప్రాజెక్టు నివేదికను రాష్ట్రం కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. అనంతరం కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది.

రాష్ట్రాల్లో ఏర్పాటు చేసే సైన్స్ సిటీలను సాధారణంగా రాష్ట్ర రాజధాని నగరాల్లోనే నిర్మిస్తుంటారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల్ని కేంద్రం.. రాష్ట్రం ఉమ్మడి భాగస్వామ్యంతో నిర్మించాల్సి ఉంటుంది. ఇందుకోసం 25 -30 ఎకరాల భూమి అవసరమవుతుంది. దీన్ని రాష్ట్రం కేటాయించాల్సి ఉంటుంది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.232 కోట్లుగా చెబుతున్నారు. పెట్టుబడి వ్యయం రూ.179 కోట్లు అయితే.. కార్పస్ ఫండ్ రూ.53.7 కోట్లు. కేంద్రం వాటా 60 శాతం రాష్ట్రం వాటా 40 శాతం ఉంటుంది.

సైన్స్ సిటీ ఏర్పాటుతో శాస్త్ర సాంకేతిక రంగాలపై యువతలో ఆసక్తిని పెంచటంలో కీలకభూమిక పోషిస్తుంది. ఇంజనీరింగ్.. మ్యాథ్స్.. పరిశోధనలపై అవగాహన కల్పిస్తుంది. ప్రత్యేక పర్యాటక కేంద్రంగా గుర్తింపు ఉంటుంది. సామాన్యులకు సైన్స్ పట్ల ఆసక్తి పెంచేలా ప్రదర్శనలు.. చర్చలు.. వర్కు షాపుల నిర్వహణతో పాటు.. ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయి.

కొత్త పరికరాల తయారీతో సహా వివిధ అంశాలపై అవగాహన పెంచుతారు. సైన్స్ టీచర్లు.. విద్యార్థులు.. ఎంటర్ ప్రెన్యూర్ లతో సహా వివిధ వర్గాలకు ప్రత్యేక శిక్షణను ఇస్తారు. మరి.. ఈ ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఎంత వేగంగా స్పందిస్తుందో చూడాలి.


Tags:    

Similar News