హెలికాఫ్టర్ మనీ అమలు సాధ్యపడదు : కిషన్ రెడ్డి!

Update: 2020-04-24 11:10 GMT
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ ను విధించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా జన జీవనం స్తంభించిపోయింది. అలాగే కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర కూడా నిధులు అయిపోతున్నాయి. ఈ నేపథ్యంలో లాక్‌ డౌన్ కారణంగా వివిధ రంగాలకు జరిగిన నష్టం కారణంగా రిజర్వ్ బ్యాంక్ ముందుకు వచ్చి ‘హెలికాఫ్టర్ ఫండ్’ సప్తై చేయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రతిపాదన పై తాజాగా కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.

ప్రస్తుత సమయంలో సీఎం కేసీఆర్ కోరినట్టు హెలికాఫ్టర్ ఫండ్ సాధ్యమయ్యే విషయం కాదని స్పష్టం చేశారు. ఒక రాష్ట్రం కోరినంత మాత్రాన హెలికాఫ్టర్ ఫండ్ ఇవ్వడం సాధ్యం కాదని.... అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి హెలికాఫ్టర్ ఫండ్ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి వల్ల హెల్త్ ఎమర్జెన్సీ మాత్రమే ఉందని - ఆర్థిక ఎమర్జెన్సీ ఎంత మాత్రమూ లేదని ఆయన తేల్చి చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పులు ఇచ్చే అవకాశాలే ముఖ్యమని - కరోనాను ఏరకంగా కట్టడి చేయాలన్నదే ప్రధాన అంశమని అన్నారు.

అలాగే మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ..కేంద్ర ప్రభుత్వం వలస కార్మికుల రక్షణ కొరకు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ప్రజలు ఇతర రాష్ట్రాల నుంచి తమ రాష్ట్రంలోకి ప్రజలను ఆహ్వానించే పరిస్థితిలో లేరని చెప్పారు. ఏ రాష్ట్రంలో ఉన్నవారు అక్కడే ఉండాలని - అక్కడే తగిన ఏర్పాట్లు చేసుకొని కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం వలస కార్మికుల కోసం 12,000 కోట్ల రూపాయలు విడుదల చేసిందని అన్నారు.
Tags:    

Similar News