కేసీఆర్‌ పై కేసు పెట్టాల‌ట‌!... షీ టీమ్స్‌ దే బాధ్య‌తంట‌!

Update: 2019-02-20 14:49 GMT
ఎవ‌రేమ‌నుకున్నా టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు త‌న‌దైన స్టైల్లోనే ముందుకెళ‌తారు. ఈ విష‌యంలో కేసీఆర్ వైరి వ‌ర్గాల మాట‌ల‌నే కాదు త‌న వాళ్ల మాట కూడా విన‌రంతే. ఇది ఇప్పుడే కాదు... ఆది నుంచి కూడా కేసీఆర్ వైఖ‌రి అదే. కేసీఆర్‌ కు అల‌వ‌డ్డ ఈ వైఖ‌రి ఆధారంగా ఇప్పుడు బీజేపీ సీనియ‌ర్ నేత‌ - మాజీ ఎమ్మెల్యే జి.కిష‌న్ రెడ్డి ఆస‌క్తిక‌ర దాడికి దిగారు. వినేందుకు కాస్తంత విడ్డూరంగానే ఉన్నా... ఈ దాడికి కిష‌న్ రెడ్డి చెప్పిన నేప‌థ్యం చూస్తే... ఆయ‌న చేసిన వాద‌న నిజ‌మేనేమోన‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. అయినా కిష‌న్ రెడ్డి చేసిన వాద‌న ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే... ఉన్న‌ ప‌ళంగా సీఎం కేసీఆర్‌ పై కేసు న‌మోదు చేయాల‌ట‌. అది కూడా మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం తెలంగాణ స‌ర్కారు ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన షీ టీమ్స్ ఈ బాధ్య‌త తీసుకోవాల‌ట‌. మ‌హిళ‌ల హ‌క్కుల‌ను కాల‌రాస్తున్నార‌న్న కోణంలోనే షీ టీమ్స్... కేసీఆర్‌పై కేసు న‌మోదు చేయాల‌ట‌. ఇదీ మొత్తంగా కిష‌న్ రెడ్డి వాద‌న‌. త‌న వాద‌న‌కు కార‌ణం కూడా చెప్పిన కిష‌న్ రెడ్డి... అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశార‌ని చెప్పాలి.

కొత్త రాష్ట్రంగా ఏర్ప‌డ్డ తెలంగాణ‌లో తొలి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్‌... నాలుగున్న‌రేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించినా... త‌న కేబినెట్ లో ఒక్క‌రంటే ఒక్క మ‌హిళ‌కు కూడా మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదు. స‌రే తొలి ప్ర‌భుత్వం గ‌డువు తీర‌క‌ముందే కాడి కింద ప‌డేసింద‌నుకున్నా... రెండో ద‌ఫా ఎన్నిక‌ల్లోనూ బంప‌ర్ మెజారిటీతో టీఆర్ ఎస్ విజ‌యం సాధించ‌గా... తెలంగాణ‌కు రెండో సీఎంగానూ కేసీఆరే ప‌ద‌వీ బాధ్య‌తలు స్వీక‌రించారు. త‌న‌తో పాటు డిప్యూటీ సీఎంగా మ‌హ‌మూద్ అలీతో ప్ర‌మాణం చేయించిన కేసీఆర్... పూర్తి స్థాయి కేబినెట్ లేకుండానే ఏకంగా 66 రోజుల పాటు పాల‌న‌ను నెట్టుకొచ్చేశారు. తీరా నిన్న త‌న కేబినెట్ ను ప్ర‌క‌టించిన కేసీఆర్‌... ఓ ప‌ది మంది ఎమ్మెల్యేల‌ను త‌న మంత్రివ‌ర్గంలోకి తీసుకున్నారు. ఈ ప‌ది మందిలో కూడా ఒక్క‌రంటే ఒక్క మ‌హిళ కూడా లేరు. మహిళల‌పై లెక్క‌లేన‌న్ని ఆంక్ష‌లు విధించే అర‌బ్ దేశాలు కూడా త‌మ ప్ర‌భుత్వాల్లో మ‌హిళ‌ల‌కు ప్రాతినిధ్యం క‌ల్పిస్తున్న త‌రుణంలో కేసీఆర్ మాత్రం త‌న కేబినెట్ లోకి మ‌హిళ‌ల‌కు ఎంట్రీ ఇవ్వ‌డం లేదు.

ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించిన కిష‌న్ రెడ్డి... మ‌హిళ‌ల‌ను అవ‌మాన‌ప‌రిచేలా వ్య‌వ‌హరిస్తున్న కేసీఆర్‌పై షీ టీమ్స్ కేసులు న‌మోదు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఇక ప‌నిలో ప‌నిగా కేసీఆర్ కేబినెట్ లో గిరిజ‌నుల‌కు స్థానం లేక‌పోవ‌డాన్ని కూడా కిష‌న్ రెడ్డి ప్రస్తావించారు. 66 రోజుల పాటు కేబినెట్ లేకుండానే పాల‌న సాగించిన కేసీఆర్‌... రెండు నెల‌ల స‌మ‌యం తీసుకుని కూడా త‌న పార్టీ త‌ర‌ఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో ఆర్థిక‌ - రెవెన్యూ వంటి కీల‌క శాఖ‌ల బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌గ‌లిగిన నేత‌ల‌ను గుర్తించ‌లేక‌పోయార‌ని కూడా కిష‌న్ రెడ్డి మ‌రో సెటైర్ వేశారు. మొత్తంగా కేసీఆర్ తీసుకుంటున్న ప‌లు నిర్ణ‌యాల‌పై కిష‌న్ రెడ్డి త‌న‌దైన శైలిలో సెటైర్లు వేశార‌ని చెప్పాలి.


Tags:    

Similar News