ఓట్ల కోసమే కానీ.. నిజాం అంటే సారుకు ఇష్టం లేదట

Update: 2015-01-20 07:45 GMT
అవకాశాలు ఇచ్చిన వినియోగించుకోకుండా ఉండటం రాజకీయ పార్టీల్లో చాలా అరుదుగా జరుగుతుంటుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సహజంగా ఉండే బలాన్ని వినియోగించుకోకుండా ఉండటం తెలంగాణ బీజేపీ నేతలకు మాత్రమే చెల్లింది.

తెలంగాణవాదుల సుదీర్ఘ తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేయటంలో కాంగ్రెస్‌తో పాటు.. బీజేపీ కూడా పూర్తిస్థాయిలో సహకరించిందనే చెప్పాలి. నిజానికి కాంగ్రెస్‌పై ఒత్తిడి పెరిగేందుకు బీజేపీ వ్యవహరించిన వైఖరి కూడా ఒక కారణమని చెబుతారు.

తెలంగాణ రాష్ట్ర సాకారంతో తమ పార్టీ పడిన కష్టాన్ని చెప్పకోవటంలోనూ.. ప్రచారం చేసుకోవటంలోనూ బీజేపీ నేతలు ఫెయిల్‌ అయ్యారనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితే కాంగ్రెస్‌ పార్టీలోనూ కనిపిస్తుంది.

ఇలా బలమైన రాజకీయ పక్షాలు తప్పులు మీద తప్పులు చేస్తున్న నేపథ్యంలో.. తెలంగాణ అధికారపక్షమైన టీఆర్‌ఎస్‌ చెలరేగిపోవటం తెలిసిందే. ఒకటి తర్వాత ఒకటిగా తమ పట్టును పెంచుకునే ప్రయత్నంలో తాజాగా టీఆర్‌ఎస్‌ అధినేత కన్ను జీహెచ్‌ఎంసీ మీద పడింది. ఎలా అయినా సరే.. జీహెచ్‌ఎంసీ మీద గులాబీ జెండా ఎగరాలన్న లక్ష్యంతో పని చేయటం తెలిసిందే.

ఈ వ్యూహంలో భాగంగా నిజాం ప్రభువు పాలనను కీర్తించటం కేసీఆర్‌కే చెల్లింది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ అధికారపక్షంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడేందుకు తెలంగాణ బీజేపీకి అవకాశంఉంది. అయినప్పటికీ.. వారు తమకున్న అవకాశాల్ని వినియోగించుకోలేదని చెప్పాలి.

తాజాగా ఆ కొరతను కాస్త తీరుస్తూ బీజేపీ నేత కిషన్‌రెడ్డి గళం విప్పారు. నిజాం చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని ప్రయత్నిస్తున్న తీరుపై కిషన్‌రెడ్డి విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది నిజాం దౌర్జన్యాలను.. ఆరాచకాలను.. దోపిడీని సమర్థించేందుకేనా? అని సర్కారును సూటిగా ప్రశ్నించారు.

నిజానికి కేసీఆర్‌కు.. నిజాంపై ఎలాంటి ప్రేమ కానీ అభిమానం కానీ లేదని.. కేవలం జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్‌తో కలిసి ఓట్లు పొందేందుకే ఇలాంటి దివాళకోరు విధానానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అయినా కేసీఆర్‌ మనసులోని మాటను కిషన్‌రెడ్డి ఎలా చెప్పగలుగుతున్నారో దూ..?
Tags:    

Similar News