కిషన్ రెడ్డి కీలకం : బీజేపీతో బాబుకు బంధం...?

Update: 2022-07-13 02:30 GMT
ఒకనాడు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రస్తుత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు బీజేపీలో కీలకమైన పాత్ర పోషించేవారు. ఆయన యావత్తు తెలుగు రాజకీయాలను చూసేవారు. ఆనాడు పొత్తులు ఎత్తులు అన్నీ కూడా ఆయన కనుసన్నలలోనే సాగేవి. వెంకయ్యనాయుడు అయిదేళ్ల క్రితం రాజ్యాంగ బద్ధ పదవిలోకి వెళ్ళిపోయారు. దాంతో ఆ లోటు అలాగే ఉండిపోయింది.

బీజేపీకి టీడీపీకి మధ్య సరైన అనుసంధానం లేకపోవడం వల్లనే కొన్ని తొందరపాటు నిర్ణయాలు అటూ ఇటూ జరిగాయని కూడా విశ్లేషణలు ఉన్నాయి. నిజానికి వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఉండి ఉంటే 2018 మార్చిలో అంత సులువుగా బీజేపీ స్నేహాన్ని, ఎన్డీయే బంధాన్ని టీడీపీ తెంచుకునేది కాదు అని కూడా చెబుతారు. సరే జరిగింది జరిగిపోయింది. తిరిగి బీజేపీతో చెలిమి కోసం ఇపుడు టీడీపీ ఎదురుచూస్తోంది.

ఆ విధంగా చూస్తే బీజేపీ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంలేదు అంటున్నారు. దానికంటే ముందు అటూ ఇటూ అనుసంధానం చేసే కీలకమైన పాత్రధారి లేకుండా పోయారన్న మాటా ఉంది. ఇపుడు ఆ లోటు తీరినట్లే కనిపిస్తోంది. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి చంద్రబాబుతో మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తారు. ఆయన వెంకయ్యనాయుడుకు ప్రియ శిష్యుడు అని చెబుతారు. వెంకయ్యనాయుడు అడుగుజాడలలోనే ఆయన నడిచారు. ఆయన తరువాత తెలుగు రాష్ట్రాలలో  పార్టీ పదవులు ఈయన స్వీకరించారు.

ఇక కిషన్ రెడ్డి ఫస్ట్ టైమ్ కేంద్రంలో సహాయ మంత్రి అయినపుడు చంద్రబాబు ఆయన్ని ప్రత్యేకంగా గ్రీట్ చేసిన సంగతిని కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి.  గత ఏడాది విస్తరణలో క్యాబినేట్ ర్యాంక్ మినిస్టర్ గా కిషన్ రెడ్డి అయ్యారు. ఈ మధ్యనే భీమవరంలో జరిగిన అల్లూరి 125వ జయంతి వేడుకలకు చంద్రబాబును స్వయంగా ఆహ్వానించినదీ కిషన్ రెడ్డే అన్నది గుర్తెరగాలి. అయితే ఆయన శాఖ కావడం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉన్నా రెండు తెలుగు రాష్ట్రాలకు ఏకైక కేంద్ర మంత్రిగా ప్రత్యేకించి అమిత్ షా తో మోడీతో సన్నిహిత సంబంధాలు ఉన్న నాయకుడిగా కిషన్ రెడ్డి ఇపుడు టీడీపీకి అతి ముఖ్యమైన వారుగా కనిపిస్తున్నారు అంటున్నారు.

ఇక బీజేపీ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము ఏపీకి వస్తున్నారు అన్నది మూడు రోజుల క్రితమే బయటకు వచ్చిన వార్త. ఆ సమయానికి టీడీపీ మద్దతు కూడా ఆమెకు ఇవ్వలేదు. కానీ జస్ట్ ఇరవై నాలుగు గంటలలో పరిణామాలు టోటల్ గా  మారాయి. దీని వెనక చాలానే తతంగం నడిచింది అని అంటున్నారు. కిషన్  రెడ్డి కూడా టీడీపీ వారి మద్దతు కోసం రాష్ట్రపతి అభ్యర్ధిని నేరుగా వారి వద్దకే  తీసుకురావడం, అలాగే చంద్రబాబుని ఆయన థాంక్స్ చెబుతూ పొగడడం వంటివి చూస్తే రానున్న రోజుల్లో పొత్తుల ఎత్తుల కధకు కిషన్ రెడ్డి అసలైన  సూత్రధారి అవుతారా అన్న చర్చ మొదలవుతోంది.

ఇక  ముర్ము ఉన్న వేదిక మీదనే టీడీపీ అధినేత కూడా ఒక భారీ పుష్పగుచ్చాన్ని కిషన్ రెడ్డికి ఇచ్చి గౌరవించడం జరిగింది. ఏది ఏమైనా అన్ని రోజులూ ఒకలా ఉండవు, రాజకీయం కూడా మారుతుంది. జగన్ తో కిషన్ రెడ్డికి మంచి రిలేషన్స్ ఉన్నాయని చెబుతారు. అదే టైమ్ లో బాబుతోనూ ఆయన బాగానే ఉంటున్నారు. ఏపీలో బీజేపీని పటిష్టం చేయాల్సిన బాధ్యత కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి మీద ఉంది కాబట్టి ఆయన వచ్చే ఎన్నికల కోసం టీడీపీని దగ్గరకు తీసేలా కేంద్ర నాయకత్వాన్ని ఒప్పిస్తారు అని అంటున్నారు. దాంతో కిషన్ రెడ్డి ద్వారానే బీజేపీతో మళ్లీ చెలిమి కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Tags:    

Similar News