కేసీఆర్ ముఖ్యమంత్రా? సిద్ధపేట దుబాయ్ శేఖరా?

Update: 2021-12-01 07:30 GMT
కీలక ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చారు తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్ అర్వింద్. సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో పాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎంత తీవ్రస్థాయిలో తిట్లు తిట్టేశారో తెలిసిందే. రైతుల ధాన్యాన్ని కేంద్రం కొనని తీరుపై ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా అడ్డూ ఆపూ లేని రీతిలో తిట్ల దండకాన్ని వినిపించిన వైనంపై తెలంగాణ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర మంత్రి అంటే మర్యాద లేదా? అని ప్రశ్నిస్తున్నారు. అప్పుడప్పుడు తనపై ఘాటు వ్యాఖ్యలు చేసే వారి తీరును తీవ్రంగా తప్పు పడుతూ..ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని అన్నేసి మాటలు అంటారా? అని ప్రశ్నిస్తుంటారు. మరి.. ప్రజలు ఎన్నుకొన్న తర్వాతే కేంద్రమంత్రి అయిన వారి విషయంలో గులాబీ బాస్ వ్యాఖ్యలు సరైనవేనా? అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ తాజా తిట్ల దండకంపై ఎంపీ అర్వింద్ ఒకింత ఘాటుగా రియాక్టు అయ్యారు.

కేసీఆర్ ముఖ్యమంత్రా? లేదంటే ఇంకా సిద్దిపేటలో లారీలు ఆపి పైసలు వసూలు చేసే దుబాయ్ శేఖరా? అంటూ మండిపడ్డారు. ‘‘కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి.. పీయూష్ గోయల్ పై సీఎం కేసీఆర్ ఉపయోగించిన భాష ముఖ్యమంత్రి భాష కాదు. దుబాయ్ శేఖర్ భాష. రోడ్డు పక్కన చిల్లరగాళ్లు కూడా ఇటువంటి భాష మాట్లాడరు. కేసీఆర్ విలేకరుల సమావేశాలకు సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికేట్ ఇవ్వాలి’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన కుమారుడు కేటీఆర్ పై ఆయన తీవ్ర ఆరోపణ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి కేటీఆర్ లు ఇద్దరూ బియ్యం స్మగ్లింగ్ చేస్తున్నారన్నారు. ‘తండ్రికొడుకులు ఇద్దరూ స్మగ్లర్లు. రైస్ మిల్లర్లతో కలిసి రైతుల పంటను స్మగ్లింగ్ చేస్తూ వేల కోట్ల రూపాయిలు సంపాదించుకుంటున్నారు. కర్ణాటక నుంచి నాణ్యత లేని బియ్యాన్ని తీసుకొస్తారు. రీసైకిల్ చేసి ఎఫ్ సీఐకు అమ్ముతారు. తెలంగాణలో పండే సన్న బియ్యాన్ని కిలో రూ.40 చొప్పున ప్రైవేటులో అమ్ముకుంటున్నారు. ప్రభుత్వమే స్మగ్లింగ్ చేస్తే రైతులు ఎక్కడికి వెళ్లాలి’ అని మండిపడ్డారు.

రైసు మిల్లర్లు తరుగు తీస్తుంటే ముఖ్యమంత్రి మాట్లాడటం లేదని.. ఈ అంశంపై ఎవరికి లేఖ రాయాలో వారికి లేఖ రాస్తానని.. మొత్తం దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలుపై ఎఫ్ సీఐతో జరిగిన ఒప్పందంపై సంతకం పెట్టి.. ఇప్పుడు ఎంత కొంటారో చెప్పాలని సీఎం కేసీఆర్ అడగటంలో పస లేదన్నారు. ఇప్పటివరకుపలు విమర్శలు.. ఆరోపణలు కేసీఆర్.. కేటీఆర్ మీద వెల్లువెత్తినా.. బియ్యం స్మగ్లింగ్ అంటూ సంచలన ఆరోపణ చేసిన ఎంపీ అర్వింద్ మాటలకు తండ్రి కొడుకులు ఇద్దరు ఎలా రియాక్టు అవుతారో చూడాలి.




Tags:    

Similar News