హైదరాబాద్ లో కివీస్.. రాత్రి పాక్ లో ఏం చేసిందంటే? అంతా గంటల్లోనే

Update: 2023-01-17 17:30 GMT
"బిజీ బిజీ షెడ్యూల్".. వ్యాపార వర్గాల్లో, క్రీడా లోకంలో ఎక్కువగా వినిపించే మాట ఇది. ఇక ఆటల్లో మారిన పరిస్థితుల ప్రకారం చూస్తే క్రికెటర్లది మరీ మరీ బిజీ షెడ్యూల్. అలసట లేని సిరీస్ లు, టోర్నీల కారణంగా తీవ్ర పని ఒత్తిడి ఎదుర్కొన్న ఆటగాళ్లు ఎందరో? ఇక సున్నిత మనస్కులైన క్రికెటర్లు కొందరైతే బాబోయ్ ఈ ఒత్తిడిని తట్టుకోలేం అంటూ చేతులెత్తేసిన సందర్భాలున్నాయి. ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ మార్కస్ ట్రెస్కోథిక్ ఇలానే ఓసారి సిరీస్ నుంచి వైదొలగాడు.

ఆస్ట్రేలియాకు చెందిన ఓ యువ ఆటగాడు కూడా ఒత్తిడిని తాళలేక మానసిక కౌన్సెలింగ్ కు వెళ్లాడు. అసలు క్రికెటర్ల షెడ్యూల్ ఎంత బిజీగా ఉంటుందో చాటేలా తాజా ఉదంతం ఒకటి చోటుచేసుకుంది. ఇందులో భారత్ కూ సంబంధం ఉండడం విశేషం.

అన్నీ సర్దుకుని మైదానంలోకి


మూడు టి20లు, మూడు వన్డేల సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్ చేరుకుంది. తొలి వన్డేను బుధవారం హైదరాబాద్ ఉప్పల్ లో ఆడనుంది. కాగా, న్యూజిలాండ్ జట్టు నిన్నటివరకు పాకిస్థాన్ టూర్ లో ఉంది. అక్కడ మూడు వన్డేలు ఆడింది. శుక్రవారం చివరి వన్డేలో నెగ్గి సిరీస్ ను 2-1తో సొంతం చేసుకుంది.

అయితే ఈ మ్యాచ్ డే అండ్ నైట్. రాత్రి 10.30 వరకు సాగింది. ఇక దీని తర్వాత ఆ జట్టు భారత్ కు వచ్చేయాలి. టీమ్‌ఇండియాతో ఆడేందుకు శనివారం ఉదయం హైదరాబాద్‌ చేరుకుంది. దీనికి ముందుగా అన్నీ సర్దుకుని పాక్ లోని కరాచీ మైదానంలో చివరి మ్యాచ్ ఆడిన కివీస్ క్రికెటర్లు అక్కడినుంచి నేరుగా విమానాశ్రయానికి వెళ్లడం గమనార్హం. ఇలా బిజీ షెడ్యూల్‌లో ఆటగాళ్లు, సహాయ సిబ్బంది ప్రయాణాల గురించి సవివరంగా చూపించిన ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది.

వారి ప్రయాణం వైరల్

పాక్‌ నుంచి భారత్‌లో అడుగుపెట్టే వరకు కివీస్‌ ఆటగాళ్ల ప్రయాణం వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. అదెలాగంటే.. శుక్రవారం రాత్రి 10.30: కరాచీ జాతీయ స్టేడియంలో పాకిస్థాన్ తో న్యూజిలాండ్ మ్యాచ్ ముగిసింది. రాత్రి 10.55: ట్రోఫీ బహూకరణ, సంబరాలు పూర్తయ్యాయి. మ్యాచ్‌కు వచ్చేటప్పుడే లగేజీని వెంట తెచ్చుకుంది కివీస్‌ బృందం. రాత్రి 12.10: కరాచీ స్టేడియం నుంచి విమానాశ్రయానికి బయల్దేరింది కివీస్ జట్టు.

రాత్రి 12.25 : కరాచీ విమానాశ్రయం చేరుకుంది. రాతి: పొద్దుపోయాక ఆటగాళ్లు, సహాయక సిబ్బంది 2.20 గంటలకు ప్రత్యేక విమానంలోకి ఎక్కారు. శనివారం తెల్లవారు జామున 3.10: కివీస్ ఆటగాళ్ల విమానం టేకాఫ్‌ అయింది. ఉదయం 5.45: కివీస్‌ ఆటగాళ్ల విమానం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంది. ఉదయం 6.30 : విమానాశ్రయం బయట బస్సులో ఎక్కిన కివీస్‌ బృందం ఉదయం : 6.55 గంటలకు హైదరాబాద్‌లోని హోటల్‌కు చేరుకుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News