కేరళలో చరిత్ర తిరగేసిన టీచర్ కేకే శైలజ !

Update: 2021-05-03 16:30 GMT
పినరయి విజయన్‌ నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్‌ కేరళ లో వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలోని మొత్తం 140 సీట్లకు గాను, 99 సీట్లను ఎల్డీఎఫ్‌ కైవసం చేసుకుంది. ప్రతిపక్ష యూడీఎఫ్‌ 41 స్థానాల్లో గెలుపొందింది. సీఎం పినరయి విజయన్, ఆయన కేబినెట్‌ సహచరులు కేకే శైలజ, ఎంఎం మణి, ఏసీ మొయిదీన్, సురేంద్రన్, రామచంద్రన్, క్రిష్ణ కుట్టీ, టీపీ రామకృష్ణన్, చంద్రశేఖరన్‌ తదితరులు గెలుపొందారు.

పినరయి విజయన్ కేబినెట్‌ లో ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సేవలు అందిస్తున్న కేకే శైలజ మత్తన్నూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి అయిన బీజేపి అభ్యర్థి బిజు ఎలెక్కుయిపై ఆమె విజయం సాధించారు.  ఆమె 61,035  ఓట్ల మెజారిటీ తో విజయం సాధించారు.  కాగా కేరళలో ఇంత పెద్ద భారీ మెజారిటీతో గెలిచిన అతి కొద్ది మందిలో శైలజ ఒకరు అని అంటున్నారు. కాగా, ఆరోగ్య మంత్రిగా ఆమె పనితీరు పట్ల ప్రజలు ఇచ్చిన తీర్పని మరికొందరు అంటున్నారు. చివరిసారిగా కేరళ అత్యధిక ఓట్ల తేడాతో 2006 లో ఎం చంద్రన్ 47,000 ఓట్లతో విజయం సాధించారు. ఇక సీఎం విజయన్ కూడా 50 వేల ఓట్ల మెజారిటీ తో గెలిచినప్పటికీ , కేకే శైలజ 60 వేల పైచిలుకు మెజారిటీ తో విజయం సాధించారు. దీనికి ప్రధాన కారణం ఆమె కరోనా సమయంలో చేసిన సేవలే. ఆమె పేరు శైలజ అయినప్పటికీ అందరూ శైలజ టీచర్ అని పిలుస్తుంటారు.

కరోనా సమయం లో దేశం మొత్తం అల్లాడిపోతున్న సమయంలో అత్యుత్తమ వైద్యం అందిస్తూ , కరోనా బాధితుల్ని కాపాడుకోగలిగారు. ప్రభుత్వాస్పత్రుల్లోనూ ఆక్సిజన్‌ ఉత్పాదక ప్లాంట్లను ఏర్పాటు చేసింది. రోజుకు 140 టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించింది. కరోనాపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి.. అవగాహన పెంపొందించారు. ఫలితంగా.. కేసులు భారీగానే ఉంటున్నా.. రోజువారీ ఆక్సిజన్‌ అవసరం 54 టన్నులుగా ఉంది. కొవిడ్‌ నియంత్రణలో గత ఏడాది కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజకు ఐక్యరాజ్య సమితి గుర్తింపు దక్కడాన్ని బట్టి.. అక్కడ కొవిడ్‌ కేర్‌ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కొవిడ్‌ బారిన పడి చనిపోయిన వారి కుటుంబాలకు.. ఏడాది నుంచి ఉచితంగా 15 సరుకులతో కూడిన కిట్లను అందజేస్తున్నారు. ఈ పథకం ఇప్పటికీ కొనసాగుతోంది. కేవలం ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యం తో మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే ప్రభుత్వం అహర్నిశలు కష్టపడటం తో చరిత్ర తిరగరాసే అరుదైన అవకాశాన్ని కేరళ ప్రజలు ఎల్డీఎఫ్‌ కి ఇచ్చారు.
Tags:    

Similar News