‘రాహులో’రాహులా.. నీ నిర్ణయాలే ఓడించాయిలా?

Update: 2022-05-26 15:30 GMT
వెస్టిండీస్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్ ను తుది జట్టులోకి ఎందుకు తీసుకోలేదు..? బుధవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్ కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కు యాంకర్ ప్రశ్న ఇది. దీనికి రాహుల్ ఇచ్చిన సమాధానం.. "8వ స్థానం వరకు మాకు బ్యాటింగ్ చేసేవారు అవసరం లేదు. అందుకే హోల్డర్ స్థానంలో.. 145 కి.మీ. వేగంతో బంతులేయగల పేసర్ దుష్మంత చమీర (శ్రీలంక)ను తీసుకున్నాం". కానీ, రాహుల్ నిర్ణయం ఎంత తప్పో మ్యాచ్ సాగే కొద్దీ తెలిసిపోయింది. దుష్మంత చమీర నాలుగు ఓవర్లలో ఏకంగా 54 పరుగులిచ్చాడు.

టాస్ వరించినా..ఎలిమినేటర్ వంటి కీలక మ్యాచ్ ల్లో టాస్ నెగ్గాలని కోరుకుంటారు. తద్వారా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం లభిస్తుంది. పైగా నిన్నటి మ్యాచ్ జరిగింది ఈడెన్‌ గార్డెన్స్‌ లో. అది బ్యాట్స్‌మెన్‌కు పరుగుల స్వర్గధామం. ఇక్కడ ఎవరు టాస్‌ గెలిచినా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంటారు. కానీ,రాహుల్‌ బౌలింగ్‌ తీసుకొన్నాడు. బ్యాటింగ్‌ అనుకూల పిచ్ పై ఇదే తొలి తప్పటడుగు. దీంతో బెంగళూరు 208 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్నో దాన్ని అందుకోలేకపోయింది. లక్నో గత 10 మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్‌ చేసినప్పుడే 6 సార్లు విజయం సాధించింది. రెండోసారి బ్యాటింగ్‌ చేసిన 4 సార్లూ ఓటమిపాలైంది.

విధ్వంసక ఎవిన్ లూయీస్ ను విస్మరిస్తారా?ఎవిన్ లూయిస్‌ వంటి విధ్వంసక ఓపెనర్‌ను ఈ మ్యాచ్ లో ఎక్కడో కింద 6వ స్థానంలో దింపారు. అది కూడా మనన్‌ వోహ్రాను మూడో నంబర్‌ ఆటగాడిగా తీసుకొచ్చి లూయిస్‌ను వెనక్కినెట్టారు. దీపక్‌ హూడా నంబర్ 4లో వచ్చాడు. స్టొయినిస్‌ వైఫల్యం మరింత దెబ్బతీసింది. లూయిస్‌ క్రీజులో కుదురుకునేసరికే రన్‌రేట్‌ కొండంత అయింది. చివరికి లూయిస్ (6 బంతుల్లో 2)‌, స్టొయినిస్‌ (9 బంతుల్ల 9) తుస్ మనిపించారు. వాస్తవానికి లక్నో బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఈ సీజన్‌లో గందరగోళంగా ఉంది. బౌలింగ్ ఆల్ రౌండర్ కృష్ణప్ప గౌతమ్‌ను ఓసారి మూడో స్థానంలో దింపారు. మరో బౌలింగ్ ఆల్ రౌండర్ కృనాల్‌ పాండ్యను ఒక్కోసారి మిడిల్‌ ఆర్డర్‌లో, ఒక్కోసారి

లోయర్‌ మిడిల్‌ ఆర్డర్‌లో పంపారు.డెత్‌ ఓవర్లలో పరుగుల వరద మ్యాచ్‌లో రజత్‌ పటీదార్‌ (112) మూడుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోగా.. దినేశ్‌ కార్తీక్‌ (37 నాటౌట్‌) క్రీజులోకి వచ్చిన వెంటనే క్యాచ్‌ ఔట్‌ అయ్యే ప్రమాదం నుంచి బతికిపోయాడు. రజత్‌ 59 పరుగుల వద్ద ఉండగా, 72 పరుగుల వద్ద ఉండగా సులువైన క్యాచ్‌లను వదిలేశారు. అలాగే మోసిన్‌ ఖాన్‌ బౌలింగ్‌లో కార్తీక్‌ 2 పరుగుల వద్ద ఉండగానే మిడాఫ్‌లో రాహుల్‌ చేతికి  చిక్కాడు. కానీ, ఆ బంతి కూడా నేలపాలైంది. లఖ్‌నవూ ఓటమికి మరో ప్రధాన కారణం డెత్‌ ఓవర్లలో అధికంగా పరుగులివ్వడం. అది కేవలం ఈ మ్యాచ్‌లో పరుగులిచ్చారని చెప్పడం లేదు. ఈ సీజన్‌లో ఇంతకుముందు కోల్‌కతా, చెన్నై జట్లతో ఆడిన సందర్భాల్లోనూ ఇలాగే చివరి ఓవర్లలో విపరీతంగా పరుగులిచ్చింది.

ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ చివరి ఐదు ఓవర్లలో 84 పరుగులు ఇవ్వడం గమనార్హం. దీంతో ఈ సీజన్‌ డెత్‌ ఓవర్లలో రెండో సారి కూడా అత్యధిక పరుగులిచ్చిన జట్టుగా నిలిచింది. తొలుత 15 ఓవర్ల దాకా బెంగళూరును బాగా కట్టడి చేసినా.. ఆ తర్వాత చేతులెత్తేసింది. బౌలర్లు ఎలా వేసినా పటీదార్‌, కార్తీక్‌ రెచ్చిపోయారు. బంతిని బౌండరీకి తరలించడమే లక్ష్యంగా పెట్టుకొన్నారు. దీంతో బెంగళూరు 15 ఓవర్లకు 123/4 స్కోర్‌తో ఉండగా.. ఇన్నింగ్స్‌ పూర్తయ్యేసరికి 207/4 స్కోర్‌తో నిలిచింది.

అంటే చివరి ఐదు ఓవర్లలో సగటున 16.8 పరుగులిచ్చింది. అంతకుముందు కోల్‌కతాతో ఆడిన మ్యాచ్‌లోనూ చివరి ఐదు ఓవర్లలో 74 పరుగులిచ్చింది. ఇక్కడ ఓవర్‌కు సగటున 14.8 పరుగులిచ్చింది. అలాగే చెన్నైతో ఆడిన మ్యాచ్‌లోనూ ఆఖరి ఐదు ఓవర్లలో 63 పరుగులిచ్చింది. అంటే సగటున 12.6 పరుగులు సమర్పించుకొంది. దీన్ని బట్టి లఖ్‌నవూ డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌ ఎలా గాడి తప్పిందో పోల్చి చూసుకోవచ్చు.
Tags:    

Similar News