కొడాలి నాని ఫుల్ కాన్ఫిడెన్స్ గా.. సాధ్య‌మేనా?

Update: 2020-02-16 13:38 GMT
ఇప్పుడు కాక‌పోయినా.. రానున్న కాలంలో రాజ్య‌స‌భ‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ‌లం మ‌రింత పెరుగుతుంద‌ని, అప్పుడు బీజేపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అవ‌స‌రం ఏర్ప‌డుతుంద‌ని అంటున్నారు ఏపీ మంత్రి కొడాలి నాని. ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ‌లం రెండు సీట్లు మాత్ర‌మే. అయితే త్వ‌ర‌లోనే ఏపీ కోటాలో నాలుగు సీట్లు ఖాళీ అవుతాయి. ఏపీ శాస‌న‌స‌భ‌లో అత్యంత భారీ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నాలుగు సీట్ల‌నూ సొంతం చేసుకుంటుంది. అంతే కాదు.. ఆ త‌ర్వాత రెండేళ్ల‌కు మ‌రో నాలుగు ఖాళీ అవుతాయి. అప్పుడు ఆ నాలుగు కూడా వైసీపీకే సొంతం అవుతాయి.

స్థూలంగా రానున్న మూడేళ్ల‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్య‌స‌భ‌లో బ‌లం ప‌ది సీట్ల వ‌ర‌కూ చేరే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో... బీజేపీకి త‌మ అవ‌స‌రం ఏర్ప‌డుతుంద‌న్న‌ట్టుగా కొడాలి నాని చెబుతున్నారు. రాజ్య‌స‌భ‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీకి పూర్తి మెజారిటీ లేని సంగ‌తి తెలిసిందే.

అందులోనూ వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీకి ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి. దీంతో రాజ్య‌స‌భ‌లో ఆ పార్టీ సీట్ల సంఖ్య‌ను పెంచుకోవ‌డం క‌ష్టంగానే క‌నిపిస్తూ ఉంది. కొద్ది మేర రాజ్య‌స‌భ‌లో ఆ పార్టీ బ‌లం పెరిగినా.. బిల్లుల‌ను ఏక ప‌క్షంగా ఆమోదించేసుకునే ప‌రిస్థితి మాత్రం ఉండ‌క‌పోవ‌చ్చు. దాని కోసం త‌టస్థ పార్టీల మ‌ద్ద‌తు అవ‌స‌రం అవుతూ ఉండ‌వ‌చ్చు. ఈ ప‌రిస్థితే త‌మ ప్రాధాన్య‌త‌ను ఢిల్లీలో మ‌రింత పెంచుతుంద‌ని కొడాలి నాని చెబుతున్నారు.

అంత వ‌ర‌కూ ఏపీకి ప్ర‌త్యేక‌హోదా అంశాన్ని లైవ్ లో ఉంచుతూనే ఉంటామంటూ, అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు ఆ విష‌యంలో బీజేపీపై మ‌రింత ఒత్తిడి పెంచుతామంటూ ఈ మంత్రిగారు చెప్పారు. విన‌డానికి బాగానే ఉంది. రాష్ట్రానికి ఏదోలా హోదా సాధించుకువ‌స్తే అదెవ‌రైనా మంచిదే. మ‌రి సాధ్యం అవుతుందా?
Tags:    

Similar News