మంత్రి గారి మాట.. విశాఖ కూడా కమ్మ రాజధానే

Update: 2020-01-21 05:16 GMT
తెలుగుదేశం అధినేత - మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లు అమరావతి ప్రజా రాజధానిగా పేరు తెచ్చుకోకపోవడానికి కారణమేంటన్నది బహిరంగ రహస్యం. చంద్రబాబు సహా తెలుగుదేశం ముఖ్య నాయకుల సామాజిక వర్గానికి చెందిన వాళ్లు పెద్ద ఎత్తున ఉన్న.. ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్లు పెద్ద సంఖ్యలో భూములు కొన్న ప్రాంతంలో రాజధానిని పెట్టడం పట్ల జనాల్లో సానుకూల అభిప్రాయం లేకపోయిందన్నది విశ్లేషకుల మాట. జగన్ సర్కారు - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో తీవ్ర ఆరోపణలే చేస్తోంది. ఐతే ఇప్పుడు కేవలం శాసన సభను మాత్రం అమరావతిలో పెట్టి కార్యనిర్వాహక వ్యవస్థలన్నింటినీ విశాఖ పట్నానికి తరలిస్తున్న సంగతి తెలిసిందే. ఆ ప్రాంతానికి రాజధానిని తరలించడం పట్ల తెలుగుదేశం వాళ్లు బాధ పడాల్సిందేమీ లేదని.. అది కూడా కమ్మ వారి రాజధానే అని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించడం విశేషం.

కమ్మ సామాజిక వర్గానికే చెందిన నాని.. విశాఖలోనూ తమ వాళ్లదే ఆధిపత్యం అంటూ అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్న వాళ్లలో 80 శాతం కమ్మవారేనని అన్నారు. డాల్ఫిన్ - నోవాటెల్ - దస్ పల్లా లాంటి పెద్ద పెద్ద హోటళ్లు కమ్మవారివేనని.. అలాగే అక్కడి థియేటర్లలో మెజారిటీ ఈ సామాజిక వర్గానికి చెందిన వాళ్ల చేతుల్లోనే ఉన్నాయని అన్నారు. దీంతో పాటు ఇక్కడి నుంచి ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన వాళ్లలో కూడా చాలామంది కమ్మవారు ఉన్నారని నాని అన్నారు. ఈ లెక్కన చూస్తే అమరావతితో పాటు విశాఖ కూడా కమ్మవాళ్లదే అని.. వారికి రెండు రాజధానులున్నట్లని నాని పేర్కొనడం విశేషం. మరి విశాఖను తెలుగుదేశం వాళ్లు ఎందుకు రాజధానిగా వద్దంటున్నారని నాని ప్రశ్నించారు. జగన్‌ కు తన కులం మీద మమకారం ఉన్నట్లయితే రాజధానిని రాయలసీమకు పట్టుకెళ్లేవారని.. అలా కాకుండా విశాఖకు తీసుకెళ్లడాన్ని బట్టి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నది ఆయన ఉద్దేశమని నాని స్పష్టం చేశారు.



Tags:    

Similar News