అవును.. ఆయన కొడాలి నాని.. ఏమైనా మాట్లాడతారంతే

Update: 2022-01-23 11:30 GMT
నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం.. హద్దు ఆపు లేకుండా వ్యాఖ్యలు చేయటం.. మోకాలికి బోడిగుండుకు ముడి పెట్టేసే విషయంలో ఏపీ మంత్రి కొడాలి నానికి మించినోళ్లు ఉండరనే చెప్పాలి.


ఏపీ విపక్ష నేత చంద్రబాబు ఆయన కుమారుడు లోకేశ్ మీద ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేయటం.. మధ్య మధ్యలో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాక్రిష్ణను.. టీవీ 5 ఎండీ నాయుడ్ని తన మాటల మధ్యలోకి తీసుకొచ్చి నోరు పారేసుకోవటంలో ఆయన తర్వాతే ఎవరైనా అన్న మాట ఇటీవల కాలంలో తరచూ వినిపిస్తోంది.


సంక్రాంతి సందర్భంగా మూడు రోజుల పాటు గుడివాడలోని ఆయనకు చెందిన రెండున్నర ఎకరాల కే కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన కేసినో పెను దుమారమే రేపుతోంది. ఆన్ లైన్ లో వెబ్ సైట్ ఏర్పాటు చేసి.. అందులో బుకింగులు చేసుకోవచ్చని చెప్పటమేకాదు.. దానికి సంబంధించి వీడియో క్లిప్పులు బయటకు వచ్చి వైరల్ అవుతున్నా.. అవన్నీ మార్ఫింగ్ చేసినట్లుగా వాదించటం కొడాలి నానికే చెల్లింది.


అసలు కాసినో జరిగిందే లేదని చెబుతున్న కొడాలి నాని.. మరి వెబ్ సైట్లలో జరిగిన బుకింగ్ ల మాటేమిటంటే.. దానికి 420 చంద్రబాబు.. ఆయన బ్యాచ్ చేసిన కుట్రగా చెబుతున్నారు. ఒకవేళ అదే నిజంగా జరిగితే.. తన కన్వెన్షన్ సెంటర్ లో జరిగినట్లుగా తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిని.. తన కన్వెన్షన్ సెంటర్ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు కంప్లైంట్ ఇవ్వొచ్చు కదా? అన్న సందేహం పలువురికి కలుగుతోంది. అంతేకాదు.. యాప్ లలోనూ.. వెబ్ సైట్లలోనూ చేసిన ప్రచారంలో తప్పుడు వివరాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించారంటూ కేసు నమోదు చేసి.. చట్టబద్దంగా చర్యలు తీసుకునేలా కొడాలి నాని చేయొచ్చు కదా? అన్న మాట వినిపిస్తోంది.


మీ కన్వెన్షన్ సెంటర్లో అసలేం జరిగిందంటే.. దానికి మంత్రి కొడాలి నాని ఇస్తున్న సమాధానం.. ‘పెళ్లిళ్లు జరుగుతాయి. పుట్టినరోజువేడుకలు జరుగుతాయి’ అని బదులిస్తున్నారు. తాజాగా ఒక చానల్ కు చెందిన ప్రతినిధితో మాట్లాడిన ఆయన.. తన కన్వెన్షన్ సెంటర్ లో ఏం జరిగిందన్న విషయాన్ని తెలుసుకునేందుకు విపక్ష నేతచంద్రబాబు వేసిన నిజ నిర్దారణ కమిటీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన కమిటీ వేయటం ఏమిటంటూ మండిపడిన కొడాలి నాని.. చంద్రబాబు ఇంట్లో వ్యభిచారం జరిగిందని చెబితే.. తనను వారింట్లో చెక్ చేసేందుకు అనుమతి ఇస్తారా? అని ప్రశ్నించటం సంచలనంగా మారింది.


తన కన్వెన్షన్ సెంటర్లో కేసినో నిర్వహిస్తారని చెప్పి.. ఎవరో కమిటీ వేస్తే.. అనుమతించాలా? రోజుకో వ్యక్తి చంద్రబాబు ఇంట్లో వ్యభిచారం జరుగుతుందని చెబితే చూసేందుకు ఒప్పుకుంటారా? నేను వ్యభిచారం జరుగుతుందని ఆరోపిస్తే.. నన్ను.. నిన్ను (ఇంటర్వ్యూ చేస్తున్న రిపోర్టర్ ను) బాబు ఇంటికి అనుమతిస్తారా? అని ప్రశ్నించటం చూస్తే.. విస్తుపోవాల్సిందే. ఇదంతా చూసినప్పుడు.. ఆయన పేరు కొడాలి నాని.. తను ఏమైనా మాట్లాడతారున్న భావన కలుగక మానదు. ఒక వాణిజ్య సంస్థలో చట్ట విరుద్ధంగా కేసినో నిర్వహిస్తున్నట్లుగా పేర్కొంటూ.. అందుకు సంబంధించి ఇప్పటికే పలు వీడియోలు బయటకు వచ్చిన వేళ.. అందుకు ఏ మాత్రం సంబంధం లేని ఒక విపక్ష నేత ఇంట్లో వ్యభిచారం అంటే నోరు పారేసుకోవటం కొడాలి నానికే చెల్లుతుందేమో?
Tags:    

Similar News