కొడాలి నాని తలచుకుంటే ఏ ఛానెల్ కూడా రాదట

Update: 2016-06-14 11:37 GMT
విజయవాడలో జరుగుతున్న వైసీపీ సమావేశంలో  ఆ పార్టీ నేతలు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఒక్కో నేత ఒక్కో తరహాలో చంద్రబాబుపై మాటల ఈటెలు విసిరారు.  చంద్రబాబు నాయుడు మీడియాను భయపెట్టి సొంత డబ్బా కొట్టించుకుంటున్నారని  ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. చంద్రబాబు చేస్తున్న అవినీతి - ఆయన చిల్లర రాజకీయాలను ప్రజలకు చెబుతున్నారన్న కారణంతో సాక్షి టీవీ ప్రసారాలను ఆపేశారని కొడాలి నాని ఆరోపించారు. రాష్ట్రం ఏమైనా మీ జాగీరా? మీ బావమరిది - మీ తమ్ముడి కొడుకు సినిమాలనే టీవీలో చూడాలా? మాకు నచ్చిన చానెల్ ను చూడనివ్వరా? అంటూ చంద్రబాబును నిలదీశారు. తాము తలచుకుంటే రాష్ట్రంలో ఏ చానెల్ కూడా రాదని హెచ్చరించారు.  మరో నేత  వంగవీటి రాధాకృష్ణ కూడా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. తన తండ్రి వంగవీటి మోహన రంగా - దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిల ఫొటోలతో కట్టించిన బ్యానర్లను కూడా ముఖ్యమంత్రి తీయించేశారని ఆయన మండిపడ్డారు. తన తండ్రిని చంపించిన వాళ్లతో బ్యానర్లు కట్టించుకుంటున్నారని విమర్శించారు.  ‘‘నువ్వొక నాయకుడివి - నువ్వొక ముఖ్యమంత్రివా.. సిగ్గు - శరం ఉన్నాయా’’ అని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. నాలుగు రోజులు ఆగితే విజయవాడలో వైఎస్ ఆర్‌ సీపీ జెండా ఎగురుతూ ఉంటుందని, తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామని.. దమ్ముంటే రావాలని సవాలు చేశారు.

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే చంద్రబాబును అఘోరాలతో పోల్చారు.  చంద్రబాబు విధానాలను ఎండగట్టేందుకు వైసీపీ కార్యకర్తలు - అభిమానులు అందరూ సోషల్ మీడియాను బ్రహ్మాస్త్రంగా మార్చుకోవాలని ఆయన సూచించారు. సోషల్ మీడియా గొంతు నొక్కడం చంద్రబాబు కాదు కదా ఆయన బాబు వల్ల కూడా కాదని కోటంరెడ్డి మండిపడ్డారు.  తాను అన్నా హజారే కొడుకునని, కేజ్రీవాల్ బావమరిదినని చెప్పుకొనే చంద్రబాబు.. దేనికైనా సై అంటారు గానీ రెండింటికి మాత్రం నై అంటారన్నారు. రాజధాని భూదందాపై విచారణకు, ఏపీలో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోళ్లపై సీబీఐ విచారణకు మాత్రం ఆయన ఒప్పుకోరన్నారు.  వైసీపీ నేతలు ధర్మాన ప్రసాదరావు, భూమన కరుణాకరరెడ్డి వంటివారు కూడా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.
Tags:    

Similar News