టీఆర్ ఎస్ నేత‌లంతా దందాలో మునిగిపోయారట‌

Update: 2017-06-30 10:23 GMT
టీఆర్ ఎస్ ప్ర‌జాప్ర‌తినిధుల‌పై తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం త‌న మాట‌ల దాడిని పెంచారు. మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ సిరిసిల్లలో విలేక‌రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యమించి సాధించుకున్న తెలంగాణలో అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారని, వీరిని ప్రజాప్రతినిధులు పట్టించుకోకుండా స్వంత దందాలకే పరిమితమయ్యారని కోదండ‌రాం ఆరోపించారు. ఫలితంగా ప్రజలకు, పాలకులకు మధ్య అఘాతం పెరిగిందని, ఇది పూడ్చలేకుండా మారిపోయిందని కోదండరాం అన్నారు. ఎన్నో సమస్యలతో నలిగిపోతున్న ప్రజల గురించి పట్టించుకునే నాయకులు లేకుండా పోయారని - ఇసుక దందాలు - ప్లాట్లు - భూముల ఆక్రమణల్లో మునిగిపోయారని ఆరోపించారు. ప్రజా సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయడం లేదని, అందుకే ప్రజలు - పాలకుల మధ్య తీరని అఘాతం పెరిగిపోయిందన్నారు.

నీళ్లు-నిధులు-నియామకాలు టాగ్ లైన్‌ గా తెలంగాణ ఉద్యమం సాధించుకున్నప్పటికీ యువతకు ఉపాధి కరువైందని, వ్యవసాయంపై ఎక్కడా సమగ్ర విధానం లేకుండా పోయిందని, తెలంగాణ ఆకాంక్ష నెరవేరడం లేదని కోదండ‌రాం అన్నారు. ఇప్పటి వరకు నాలుగవ విడత రుణ మాఫీ రైతులకు అందలేదని, కనీసం రైతులు అమ్మిన ధాన్యంకు కూడా ప్రభుత్వం డబ్బులు చెల్లించడం లేదని, ఈ స్థితిలో వ్యవసాయం ఎలా చేయడమా అని రైతులు వాపోతున్నారని కోదండరాం అన్నారు. వ్యవసాయంపై సమగ్ర విధానం ప్రకటిస్తే తప్ప రైతులు వ్యవసాయం ముందుకు సాగించలేని పరిస్థితి ఉందని, ఆశించిన రీతిలో అడుగులు వేయడం లేదని, కాంట్రాక్టర్ల లాభాలపై దృష్టి పెట్టిన పాలకులు ప్రజలపై చూపడం లేదన్నారు. తమ పరిస్థితులు చెప్పుకునేందుకు దారి లేదని, రాష్ట్రంలో గాడి తప్పిన పాలనను దారిలోకి తేవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చే యత్నం సాగడం లేదని అమర వీరుల స్ఫూర్తితో రెండో విడత అమరుల స్ఫూర్తి యాత్ర చేపడుతున్నట్టు తెలిపారు.

మొదటి విడత అమరుల స్ఫూర్తి యాత్రలో అనేక ప్రజా సమస్యలు ముందుకు వచ్చాయన్నారు. చాలా చోట్ల రైతులు సమస్యలు తెలిపారని, రుణ మాఫీ అందలేదని, గిట్టు బాటు ధర రాలేదని, పంటలు నిలువ చేసుకునేందుకు గోదాములు, కోల్డ్ స్టోరేజీలు లేవన్నారు. యువతకు ప్రభుత్వ ఉద్యోగాలలో ఖాళీలను భర్తీ చేయడం లేదని, నేత వృత్తి వారికి నూలు సరఫరా లేదని, ఉత్పత్తులకు ధర, మార్కెట్ సౌకర్యం లేదని, విద్యార్థుల నుండి అనేక సమస్యలు ముందుకు వచ్చాయన్నారు. కుకునూర్‌ పల్లి శిరీష ఉదంతంలో నిష్పక్షపాతంగా ధర్యాప్తు జరగడం లేదన్నారు. ఈ స్థితిలో ఎక్కడికక్కడ సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించామన్నారు. విచ్చలవిడిగా భూసేకరణ చేస్తున్నారని, రైతులకు న్యాయం చేయాలన్న డిమాండ్‌తో ముందుకు వెళ్ళాలని నిర్ణయించామని న్యాయం జరిగే వరకు తిరిగిన ప్రాంతాలకే మళ్ళీ మళ్ళీ వెళ్తామని కోదండరాం స్పష్టం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News