కేసీఆర్‌...ఇక కాచుకోవాల్సిందే అంటున్నాడు

Update: 2017-03-20 08:09 GMT
తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం రాష్ట్ర ప్ర‌భుత్వం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జాగీర్దార్ల తరహాలో పాలన చేస్తున్నారని కోదండరాం విమర్శించారు. ముఖ్యమంత్రి అయిన త‌ర్వాత కేసీఆర్‌లో అసహనం పెరిగిందని, ప్రజల పట్ల బాధ్యతగా ఉండడం లేదని ఆరోపించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ త‌న చిత్రపటాలకు పాలాభిషేకం చేయాలే తప్ప ప్రశ్నించకూడదన్నట్లు వ్యవహరిస్తున్నారని కోదండ‌రాం మండిపడ్డారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టలేదని, ఉద్యోగ నియామకాలకు సంబంధించిన క్యాలెండర్ విడుదల చేయలేదని విమర్శించారు. హైద‌రాబాద్ నగర శివారులోని ఒక ఫంక్షన్ హాలులో  అధ్యక్షతన విస్తృత స్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉద్యమ కార్యాచరణ-జేఏసీ బలోపేతం-ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడంవంటి కీలకమైన అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. నాలుగు కార్యాచరణ ప్రణాళికలు, 65 తీర్మానాలు చేశారు. సమావేశానంతరం ప్రొఫెసర్ కోదండరాం మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగ నిరసన ర్యాలీని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకున్నందున, ఇక జనంలోకి వెళ్లి ప్రభుత్వ దమననీతిని ఎండగట్టాలని తెలంగాణ జేఏసీ నిర్ణయించిందని తెలిపారు. మేలోగా జేఏసీ గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకుని ప్రజా సమస్యలపై ఉద్యమించాలని ఖరారు చేసిన‌ట్లు తెలిపారు.

తాము గత నెల 22న నిర్వహించాలనుకున్న నిరుద్యోగ నిరసన ర్యాలీని ప్రభుత్వం నిరంకుశంగా అడ్డుకున్నందున, ఇక తామే ప్రజల్లోకి వెళ్ళి వారిని చైతన్యపరచాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ కోసం-ప్రభుత్వ విద్యా సంస్ధల బలోపేతం కోసం కేజీ టు పీజీఉచిత విద్యను డిమాండ్ చేస్తూ వచ్చే నెలలో జిల్లాల్లో సదస్సులు, ధర్నాలు నిర్వహించనున్నట్లు కోదండరాం తెలిపారు. నేటి తెలంగాణలో నీళ్ళు, నిధులు, నియామకాలు-నిజాలు అంశంపై మేలో రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. మేలో గ్రామ స్థాయినుంచి కమిటీలను ఏర్పాటు చేసుకుని, జూన్ 21న ప్రొఫెసర్ జయశంకర్ జయంతి నుంచి బతుకు తెలంగాణ సాధనకై జయశంకర్ స్పూర్తి యాత్ర నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని కోదండ‌రా తెలిపారు. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయలేదని, నిరుద్యోగ యువతకు భృతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్తు సంస్ధలపై ఆర్థిక భారం పెరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్ కేటాయింపుల్లో అన్ని ప్రధాన రంగాలకూ అన్యాయం జరిగిందని కోదండ‌రాం ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని, ఆ కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం- పెన్షన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో చిత్ర పరిశ్రమను గుర్తించి, ప్రోత్సహించాలని ఆయన డిమాండ్ చేశారు. భూపాల్‌పల్లి జిల్లా కలెక్టర్ తన కుమార్తెను ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళడాన్ని ఆయన అభినందించారు. ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో శవాలను వేరే దేశాలకు తరలించడంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలాఉండగా కర్మన్‌ఘాట్‌లో మెగా ఫంక్షన్ హాలులో నిర్వహించాలనుకున్న ఈ సమావేశానికి పోలీసుల అనుమతి ఇచ్చే విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయని కోదండరాం తెలిపారు. స్థానిక ఏసీపీ అనుమతి ఇచ్చేందుకు నిరాకరించారని, ఇది ఎన్నికల సమయం కాదని చెప్పి అనుమతి తీసుకున్నామని అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News