మహాకూటమికి షాకిస్తున్న పెద్దాయన..

Update: 2018-09-17 06:32 GMT
తెలంగాణలో తిరుగులేకుండా ఉన్న టీఆర్ ఎస్ ను ఎలాగైనా గద్దెదించాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలొద్దని మహాకూటిమికి స్కెచ్ గీసింది. దీనికి టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. సీపీఐ సై అంది. అయితే చేరుతాడో లేదోనని మీమాంస మధ్య తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం కూడా కూటమికి జై కొట్టారు. అయితే అంతా బాగానే ఉన్నా ఇప్పుడు మహాకూటమి సీట్ల సర్దుబాటు సమస్య కోదండరాం వల్లే జాప్యం అవుతోందని మిగతా పక్షాలన్నీ గుర్రుగా ఉన్నాయి.

ఓవైపు కేసీఆర్ ఎన్నికలకు తెరదీసి 105 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రచారపర్వాన్ని కూడా మొదలెట్టేశాడు. టీఆర్ఎస్ అభ్యర్థులు నియోజకవర్గాలను కూడా చుట్టేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇంకా సీట్ల సర్దుబాటు మధ్యే కొట్టుమిట్టాడుతోంది. దీనికి ప్రధానం కారణం కోదండరాం పెద్దన్న పాత్ర పోషించడమే అనే టాక్ నడుస్తోంది.

కాంగ్రెస్ ఏర్పాటు చేసిన మహాకూటమిలో టీడీపీ అదిపెద్ద పార్టీ. ఆ తర్వాత సీపీఐ, తెలంగాణ జనసమితి ఉంటాయి. టీడీపీకి గత ఎన్నికల్లో గెలిచిన 15 సీట్లతోపాటు బీజేపీ గెలిచిన 5 సీట్లను ఇచ్చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. సీపీఐకి మూడు నుంచి 5 సీట్లు కేటాయించాలని చూస్తోంది. తెలంగాణ జనసమితికి ఓ 10 సీట్లకు వరకూ అనుకుంది. కానీ కోదండరాం మాత్రం ఏకంగా 30 నుంచి 35 సీట్లు అడుగుతుండడంతో జాప్యం కొనసాగుతోందనే ప్రచారం నడుస్తోంది. కోదండ పెట్టే డిమాండ్లు కూడా కూటమి సీట్ల సర్ధుబాటుకు శరాఘాతంగా మారాయట..

కోదండ డిమాండ్ చేస్తున్నదాన్ని బట్టి మహకూటమి ఒక ఉమ్మడి మేనిఫెస్టో ప్రణాళికను రూపొందించాలని.. దానికి చట్టబద్దత తీసుకురావాలని.. దాన్ని అమలు చేస్తామని ప్రజల్లోకి వెళ్లాలని కోరుతున్నారట.. ఈ పరిణామం కాంగ్రెస్ కు ఇరకాటంగా మారింది. ముందు సీట్ల సర్దుబాటు అయితే ఆ తర్వాత ప్రణాళికకు వెళదామని భావిస్తున్నా కోదండ మాట వినడం లేదని సమాచారం. ఇక 30 సీట్లు ఇస్తే కాంగ్రెస్ కు పెద్ద దెబ్బే అని భావిస్తున్నారు. కనీసం 90 సీట్లలో పోటీచేసి 30 సీట్లను కూటమిలోని టీడీపీ - సీపీఐ - టీజేఎస్ కు ఇద్దామని కాంగ్రెస్ భావించింది. కానీ కోదండ అభ్యుదయ వాదాలు ఇప్పుడు కూటమి మనుగడకే దెబ్బ పడేలా ఉన్నాయట.. ఒకవేళ కోదండను వదులుకుంటే ఆయన బీజేపీతో జట్టుకట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలుస్తాడేమోన్న ఆందోళన కూడా కాంగ్రెస్ ను వెంటాడుతోందట.. ఇలా కోదండనే కూటమికి కొరకరాని కొయ్యగా మారాడని కాంగ్రెస్ సహా టీడీపీ,సీపీఐ నాయకులు ఆందోళన చెందుతున్నారట..
Tags:    

Similar News