కోదండం మాష్టారు చెల‌రేగిపోయారుగా!

Update: 2018-09-21 05:52 GMT
కోదండం మాష్టారు నిప్పులు చెరిగారు. ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై విరుచుకుప‌డ్డారు. గ‌తంలో తాను మాట్లాడితే చాలు మొద‌టి పేజీలో ప్ర‌యారిటీ ఇచ్చే మీడియా.. గ‌డిచిన కొంత‌కాలంగా త‌న వాయిస్ కు ఏ మాత్రం ప్ర‌యారిటీ ఇవ్టం లేద‌న్న అసంతృప్తిలో ఆయ‌న‌లో చాలా ఎక్కువ‌గా ఉంది.

తాను తూల‌నాడిన ఆంధ్రా మీడియాలో ఒక‌ప్పుడు పెద్ద ఎత్తున త‌న వార్త‌ల్ని ప్ర‌చురించిన సంస్థ‌లే.. తాము కోట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అదే ఆంధ్రా మీడియా ఆయ‌న వార్త‌ల్ని క‌నిపించ‌ని రీతిలో అచ్చేస్తున్నా.. ఒక్క మాట కూడా అన‌లేని ప‌రిస్థితి.

ఒక‌ప్పుడు త‌న మెంటార్ అయిన కేసీఆర్ కు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిగా మారిన కోదండం మాష్టారు త‌న‌దైన రాజ‌కీయ పార్టీని స్టార్ట్ చేయ‌టం.. ఆ వేదిక త‌ర‌ఫున మాట్లాడినా ప‌ట్టన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న మీడియా తీరుపై ఆయ‌నలో అసంతృప్తి ఉంది. అలా అని వాటిపై విరుచుకుప‌డ‌లేని ప‌రిస్థితి. ఇలాంటి వేళ‌.. ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయ అధినేత‌ల ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూల‌ను వ‌రుస‌గా ప్ర‌చురిస్తున్నాయి ప్ర‌ముఖ మీడియా సంస్థ‌లు.

అందులో భాగంగా తాజాగా తెలంగాణ జ‌న‌స‌మితి అధ్య‌క్షుడు కోదండరాం ఇంట‌ర్వ్యూను భారీగా అచ్చేశారు. ఈ మ‌ధ్య‌న కోదండం మాష్టారికి భారీగా ప్ర‌యారిటీ ల‌భించిన సంద‌ర్భంగా దీన్ని చెప్పాలి. త‌న‌కు ల‌భించిన అవ‌కాశాన్ని పూర్తిగా స‌ద్వినియోగం చేసుకున్న ఆయ‌న‌.. కేసీఆర్ అండ్ కో మీద తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ప‌లు సందేహాల‌కు స‌మాధానాలు ఇవ్వ‌ట‌మే కాదు.. త‌న రాజ‌కీయ దృక్ప‌దాన్ని వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు.

స‌ద‌రు ఇంట‌ర్వ్యూలోని ముఖ్యాంశాల్ని య‌థాత‌ధంగా ఇస్తే..

+ పంక్చరైన టైర్లతో కూడిన కారు కాదు మాది.. సమష్టిగా నిర్మించుకున్న ఒక వ్యవస్థ ప్రయాణమిది. అనేక దశలను దాటుకుంటూ పోవాల్సి వస్తుంది. నలుగురితో కలిసి పోవాల్సి వస్తుంది. అలా పోవడానికి మేము సిగ్గుపడం. తెలంగాణ కోసం అందరం కలిసి పనిచేయలేదా?  టీఆర్ ఎస్‌ ఒక్కటే చేసిందా? సర్వశక్తులు కలిసి ఐకాసగా మారితే కదా తెలంగాణ వచ్చింది. కలవవలసిన సందర్భమొస్తే ఇతర పార్టీలతో కలుస్తాం. అంతమాత్రాన మాకు ఎదిగే శక్తే లేదనే కాదు. మాకు ఇవాళ బలమే లేదు అనుకుంటే అది మూర్ఖపు ఆలోచన.

+ తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం విఫల ప్రయోగమే. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి అవకాశాల్లేకుండా పోయాయనీ - ప్రజల మొర ఆలకించడానికి గడీల ధర్వాజలు బంద్‌ అయ్యాయి.

+  కుటుంబ పెత్తనం.. గుత్తాధిపత్యంలో తెరాస ప్రభుత్వం నడుస్తోంది. ప్రజలకు రాజకీయాల్లో భాగస్వామ్యం, సంబంధాలు తెగిపోయాయి. ప్రజల్లో అసంతృప్తి వచ్చింది. ఇంత అవినీతి ఎన్నడూ చూసి ఉండలేదు. ప్రభుత్వం బలహీనమైపోయి ప్రజల్లో ఆదరణ కోల్పోయింది. ఇది వరకు ఉద్యమకారులకు ఉన్నట్లు టీఆర్ ఎస్ పట్ల ఆదరణ కాని, గౌరవంగానీ లేదు. ఇది తెలంగాణ ద్రోహుల నిలయంగా మారిపోయిందన్న భావన వచ్చింది.

+ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం మనం ప్రయత్నం చేయకపోతే ఏవి ఆశించి తెలంగాణ తెచ్చినమో దాని ఫలితాలు దక్కకపోతే.. ప్రయోజనం ఏందీ అన్నదే తెలంగాణ ప్రజల ఆలోచన. సాధారణ ప్రజల భాషలో చెప్పాలంటే మాకు ఇంకా తెలంగాణ రాలేదు. ఒక్క కేసీఆర్‌కే వచ్చిందన్న భావన చాలా బలంగా ఉంది’. ‘మా పార్టీలో కొత్తదనం ఉంది. బృంద స్ఫూర్తిని సాధించాం. లక్ష్యం పట్ల స్పష్టత ఏర్పడింది. ఉద్యమకారులను రమ్మని ఆహ్వానిస్తున్నాం. ఇది మన వేదిక. గట్టిగా నిలబడి పోరాటం చేద్దాం’

+ తెలంగాణ రావడం వల్ల కేసీఆర్‌కు, ఆయన కుటుంబానికే మేలు జరిగిందన్న భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. తెలంగాణ జ‌న స‌మితి  ఏర్పడి కొద్ది నెలలే అయినా.. బలంగా నిలదొక్కుకుంది. మాది పంక్చరైన టైర్లతో కూడిన కారు కాదనీ, కొసదాకా గమ్యాన్ని ముద్దాడే వరకూ సమష్ఠిగా ముందుకు సాగే నిర్మాణం కూడిన బలమైన వ్యవస్థ.

+ తమకు ఏదో రూపంలో పైసలిచ్చేటోడు కాదూ.. తమ సమస్యలను పరిష్కరించే పనిమంతుడు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఉద్యమ ఆకాంక్షల సాధన దిశగా పొత్తులు ప్రధానమే అయినా.. ఆ పొత్తుల కారణంగా తమ పార్టీ బతుకును దెబ్బతీసే విధంగా నడచుకోలేం. 

+ పార్టీకి మండల - గ్రామ స్థాయిలో నిర్మాణం ఉంది. రాష్ట్ర స్థాయిలో కమిటీ ఉంది. దానికి మార్గదర్శకత్వం వహించడానికి కోర్‌ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఇది రాష్ట్ర కమిటీ నిర్ణయాలను పర్యవేక్షిస్తుంది. సమావేశ ఎజెండాను తయారు చేస్తుంది. ఎప్పటికప్పుడు జిల్లా కమిటీ - రాష్ట్ర కమిటీలు సమావేశాలు కాకుండా ఎలాంటి నిర్ణయాలు చేయొద్దని నిర్ణయించాం. ఉన్న నిర్మాణాలన్నీ క్రియాశీలంగా ఉన్నాయి. కాకపోతే వేగంగా ఇంకా చాలా ప్రాంతాల్లోకి, చాలా రంగాల్లోకి విస్తరించాల్సి ఉంది. అనుకున్నదానికంటే ఎన్నికలు ముందు రావడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. ఈ ఎన్నికలు రాకముందే 25 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిలను నియమించి నిర్మాణం, ప్రచారం మొదలు పెట్టాం. అక్కడ నిర్మాణం చాలా వేగంగా ఉంది. దసరా నాటికి 50 చోట్ల బలంగా నిలదొక్కుకోడానికి అవకాశం ఉంది.

+ ఇప్పటికున్న పరిస్థితుల్లో ఒక్కళ్లమే ఉద్యమ సాధన చేయలేమని అనుకున్నప్పుడు.. ఆ ఉద్యమ ఆకాంక్షల అజెండాకు అంగీకరించి కలిసొచ్చే శక్తులను కలుపుకొనిపోవాలి. ఉద్యమ ఆకాంక్షల అజెండాను అంగీకరిస్తారా లేదా అనేదే ఏకైక ప్రాతిపదిక. అన్నింటికీ నేనెందుకుపోతాను? పార్టీ ఉంది.. నాయకులున్నారు. ఆలోచనపరులు, వ్యూహకర్తలు ఉన్నారు. ఎవరికి వాళ్లు ప్రయత్నం చేస్తున్నారు.
 
+ టీఆర్ ఎస్‌ ఉద్యమాల నుంచి వచ్చిన పార్టీ అయినప్పటికీ - తెలంగాణ సాధన ఉద్యమంలో కొంత క్రియాశీలకంగా పాల్గొన్నప్పటికీ.. రాష్ట్రం రాగానే ఆ పార్టీ తనను తాను మార్చుకుంది. మాది ఉద్యమ పార్టీ కాదు ఫక్తు రాజకీయ పార్టీ అని చెప్పింది. ఎట్లన్నా చేసి అధికారంలో నిలబడాలి. అధికారాన్ని సొంత అవసరాలకు వాడుకోవాలనే ఆలోచనలోకి వచ్చింది.

+ కేవలం ఒక పార్టీని దించడానికో.. ఒక పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లన్నింటినీ ఒకచోట కూడగట్టడానికో జరిగే ఐక్యతకాదిది. కొన్నిపార్టీలు కలిసినంత మాత్రాన ఓట్లు ఐక్యమవుతాయని నేననుకోవడం లేదు. చాలా కీలకమేందంటే.. ఒక లక్ష్య సాధన కోసం ఉమ్మడిగా ప్రయత్నం చేసినప్పుడే ప్రజలు సంఘటితంగా నిలబడే అవకాశముంది. ఆ లక్ష్య సాధన కోసం ప్రయాణమే కీలకమవుతుంది. దాన్నే ప్రధానం చేసుకున్నప్పుడు ఐక్యత సాధించడానికి వీలవుతుందని  నమ్ముతున్నాను.

+ ఒక్క టీఆర్ ఎస్‌ అధినాయకత్వమే కాదు. అందరం కలిసి కొట్లాడితే తెలంగాణ వచ్చింది. మంచో చెడో చెప్పుకోడానికి ఈ ప్రభుత్వంలో అవకాశం ఉంటుందని ప్రజలు అనుకున్నారు. కానీ నేడు అన్ని దర్వాజలు బంద్‌ అయ్యాయి. ఏం చెప్పుకుందామన్నా వినే వారెవరూ లేరు.


Tags:    

Similar News