కేసీఆర్‌ వి రాచ‌రిక పోక‌డ‌లు...ఢిల్లీలో ధ‌ర్నా

Update: 2017-07-06 16:28 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పై మ‌రోమారు ప‌లు ప‌క్షాల నేత‌లు మండిప‌డ్డారు. హైద‌రాబాద్ ఇందిరాపార్క్ నుంచి ధ‌ర్నా చౌక్‌ ను తొల‌గించిన నేప‌థ్యంలో కేసీఆర్ తీరును త‌ప్పుప‌డుతున్న విప‌క్షాలు ఈ విష‌యమై ఆందోళ‌న‌లు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ సీఎం కేసీఆర్ వెన‌క్కు త‌గ్గ‌లేదు. దీంతో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ను ఆయ‌న నివాసంలో క‌లిసేందుకు సిద్ధ‌మ‌య్యారు. 10 వామపక్ష పార్టీలు - ప్రజాసంఘాల నేతల వేదిక‌లో తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం - సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి త‌దిత‌రులు ఇందులో ఉన్నారు. అయితే ప్ర‌గ‌తిభ‌వ‌న్‌ కు చేరడానికి ముందే వీరిని సీపీఐ కార్యాల‌యంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. అనంత‌రం ప‌లు పోలీస్ స్టేష‌న్ల‌కు త‌ర‌లించారు.

సొంత పూచిక‌త్తుపై స‌ద‌రు నేత‌ల‌ను విడుద‌ల చేసిన త‌ర్వాత తిరిగి ఆయా నేత‌లు సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఐకాస చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ ధర్నాచౌక్ ఎత్తేసిన తర్వాత ప్రగతిభవన్ ధర్నాభవన్ గా మారిందని అన్నారు. 22న ధర్నాచౌక్ పరిరక్షణ కోసం ఢిల్లీ జంతర్ మంతర్ లో ధర్నా చేపడుతామ‌ని ప్ర‌క‌టించారు. ప్రతిపక్ష పార్టీల నేతలనూ ఈ ధర్నాకు ఆహ్వానించామ‌ని తెలిపారు. ముఖ్యమంత్రే అన్నిశాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారని, మంత్రుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డం లేద‌ని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాచరిక పోకడలు మంచివి కావని కోదండ‌రాం అన్నారు. సీఎం తీరుపై త‌మ నిరసనల‌ను ప్రజల వద్దకు తీసుకువెళ‌తామ‌ని ప్ర‌క‌టించారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి త‌మ్మినేని వీరభ‌ద్రం మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా ఉద్యమాల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం అసమర్థంగా ఉందన్నారు. సమస్యలపై చర్చించాల్సిన ప్రభుత్వం పోలీసులతో అణచివేస్తోందని మండిప‌డ్డారు. ధర్నాచౌక్ మార్చడానికి కారణాలు చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆక్షేపించారు. ధ‌ర్నాచౌక్ ఎత్తివేస్తే ప్రజల అసంతృప్తి చల్లారి పోతుందనుకోవడం భ్రమ మాత్రమేన‌ని అన్నారు. ధర్నాచౌక్ సమస్యపై ప్రతిపక్షాలతో ప్రభుత్వం చర్చించి మెప్పించాలని లేదంటే ధర్నాచౌక్ ఇందిరాపార్క్ లోనే ఎందుకు పెట్టాలో మేం ప్రభుత్వాన్ని మెప్పిస్తామ‌ని వ్యాఖ్యానించారు. 17వ తేదీన జరిగే మేధావుల సదస్సులో బుద్ధిజీవులు, మేధావులందరినీ ఏకం చేస్తామ‌ని ఈ సమస్యపై దేశమంతా ప్రచారం నిర్వహిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ధర్నాచౌక్ పరిరక్షణ కోసం వినతిపత్రం సమర్పించేందుకు కూడా సీఎం అవకాశం ఇవ్వడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి  చాడ వెంకట్ రెడ్డి మండిప‌డ్డారు. రాష్ట్రంలో సేవ్ ధర్నాచౌక్ నినాదం పేరుతో సేవ్ డెమోక్రసీ ఉద్యమం బలపడుతోంద‌ని అన్నారు. వినతిపత్రం ఇచ్చేందుకు ప్రగతిభవన్ కు వెళతామంటే సీపీఎం, ఆమ్ ఆద్మీ నేతలను అరెస్టు చేయడం సరికాదని అన్నారు. ఇది అప్రజాస్వామిక చర్య అని కేసీఆర్ తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. కలిసి వచ్చే ప్రజాసంఘాలు, సామాజిక సంఘాలతో బలమైన ఉద్యమం నిర్మిస్తామ‌న్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత పీఎల్ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ సీఎం సచివాలయంకు రాడని, త‌మ‌ను ప్రగతిభవన్ కు రానివ్వడని మండిప‌డ్డారు.
Tags:    

Similar News