కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి అయ్యే మాట అన్న మాస్టారు

Update: 2016-10-13 10:47 GMT
తెలంగాణ ఉద్యమ సమయంలోనే కాదు.. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత కూడా వాడిగా వేడిగా.. అంతకుమించి సూటిగా ప్రశ్నలు అడిగే అతి కొద్ది మందిలో ప్రొపెసర్ కోదండరాం మాష్టారు ఒకరు. అధికారాన్ని అందిపుచ్చుకునే అవకాశం ఉన్నా.. ఉన్నత పదవుల్లో కూర్చునే అవకాశం ఉన్నా..  వాటన్నింటికి దూరంగా ఉంటున్న కోదండరాం మాష్టారిలో కనిపించే మరో కోణం.. మొహమాటం లేకుండా మాట్లాడటం. ఇతరుల మాదిరి అధికారానికి బంధీ అయ్యి పొగడ్తల పంచన చేరకుండా.. విమర్శల కత్తులు పట్టుకొని.. తెలంగాణ శ్రేయస్సు కోసం తపిస్తున్నారాయన.

కేసీఆర్ ప్రభుత్వం మీద విమర్శలు చేసేందుకు ఎవరికి వారు వెనకాడుతున్న వేళ.. నిర్మాణాత్మక విమర్శలతో ముఖ్యమంత్రిని ఉక్కిరిబిక్కిరి చేసేలా మాట్లాడటం కోందండం మాష్టారికి మాత్రమే చెల్లుతుందనటంలో సందేహం లేదు. తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించిన తెలంగాణ రాజకీయ జేఏసీ నిర్వహించాల్సిన తదుపరి కార్యాచరణపై కోదండం మాష్టారి అధ్యక్షతన నాంపల్లిలోని భేటీని నిర్వహించారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రిపై కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్ర సర్కారు తీరును తప్పు పట్టిన ఆయన.. కొన్ని సూటి ప్రశ్నలు వేశారు. ధనిక రాష్ట్రమని చెప్పే కేసీఆర్.. ఫీజు రీయింబర్స్ మెంట్ ను ఎందుకు చెల్లింపులు జరపలేదని ప్రశ్నించారు. ‘‘ఫీజు రీయింబర్స్ మెంట్.. ఆరోగ్య శ్రీ లాంటి బకాయిలు ఇంకా ఎందుకు పెండింగ్ లో ఉన్నాయి. నిధులు తగ్గాయా? దారి మళ్లుతున్నాయా? రాష్ట్రంలో నిధుల చెల్లింపుల తీరు చూస్తుంటే కొత్త అనుమానాలు వస్తున్నాయి. రాష్ట్రంలో విద్య.. వైద్యం ప్రైవేటీకరణ జరుగుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అని డిమాండ్ చేశారు. మరి.. కోదండం మాష్టారు అడుగుతున్న ప్రశ్నలకు కేసీఆర్ అంతే సూటిగా.. స్పష్టంగా బదులు ఇవ్వగలరా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News