ఆ రెడ్డిగారి కోరిక తీరడం డౌటే!

Update: 2017-08-15 13:43 GMT
తెలంగాణ లో తెరాస వ్యతిరేక ఉద్యమాలలో తనకంటూ సొంత గుర్తింపును తయారుచేసుకున్న తటస్థ నాయకుడు ఐకాస ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామిరెడ్డి. ఇందిరా పార్కు వద్ద.. ధర్నా చౌక్ తొలగింపు అనే వ్యవహారం ఎన్నడో పాతబడిపోయినప్పటికీ.. ఇంకా  ఆ అంశం మీద ఆయన తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా.. రాష్ట్రప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఢిల్లీకి వెళ్లి... కేంద్రం జోక్యాన్ని కోరుతూ.. అక్కడ దీక్ష చేయడానికి కూడా ప్రొఫెసర్ సాబ్ రెడీ అవుతున్నారు. అయితే.. అటు డిమాండును సాధించుకునే విషయంలో గానీ, ఢిల్లీలో కేంద్రానికి నివేదించే విషయంలో గానీ.. ప్రొఫెసర్ సాబ్ కోరిక తీరకపోవచ్చుననే వాదన పలువురిలో వినిపిస్తోంది.

ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ ఉన్నంతకాలమూ నిత్యమూ ఇక్కడ ఎవరో ఒకరు దీక్షలు చేసే షామియానాలు, టెంట్లు కనిపిస్తూ ఉండేవి. అయితే తెరాస సర్కారు ఈ ప్రదేశం నుంచి ధర్నా చౌక్ ను తరలించేసింది. నగర శివార్లలో ఏర్పాటుచేసింది. అంటే ఆందోళన కారులు ఎవరైనా ధర్నాలు చేయదలచుకుంటే.. శివార్లకు వెళ్లి అక్కడ ధర్నాలు చేయాలన్నమాట. నిజానికి ఏదో సచివాలయానికి దగ్గర్లో ఉండేలా ధర్నాలు చేయాలని ఆందోళన కారులు అనుకుంటారు గానీ.. అందుకోసం నగరం వెలుపల మైదానాలకు వెళ్లడానికి ఎవరు సిద్ధంగా ఉంటారు. అయితే తెరాస సర్కారు విపక్షాల అభ్యంతరాలను పట్టించుకోకుండా.. మార్నింగ్ వాకర్స్ కు ఇబ్బంది అనే తేలికైన కారణంతో కొట్టి పారేసింది. అప్పటినుంచి విపక్షాలు ఎన్ని రకాలుగా గొడవ చేసినా.. వారు మాత్రం పట్టించుకోలేదు.

తాజాగా కోదండరాం ధర్నాచౌక్ ను అదే స్థలంలో పునరుద్ధరించడానికి సంబంధించి.. ఆయన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయాలనుకుంటున్నారు. ఇందకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఢిల్లీ వెళ్లినప్పుడు ఈ విషయాన్ని నివేదించడానికి హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ అపాయింట్ మెంట్ ఇప్పించాలంటూ ఆయన దత్తాత్రేయను కూడా కోరారు. అలాగే ఈ దీక్షకు భాజపా మద్దతు కూడా అడిగారు. ఇదే దీక్ష హైదరాబాదులో జరిగితే భాజపా మద్దతు దక్కేదేమో గానీ.. ఢిల్లీ సర్కార్ తో తెరాసకు ఉన్న సంబంధాలను బట్టి.. అక్కడ ప్రొఫెసర్ సాబ్ కోరిక కుదరదని అంతా అనుకుంటున్నారు. మద్దతు కాదు కదా.. రాజ్ నాధ్ అపాయింట్మెంట్ కూడా అనుమానమే అని.. పైగా.. తమకు రాష్ట్ర సర్కారుతో సత్సంబంధాలు ఉన్నప్పుడు.. వారు తీసుకున్న నిర్ణయంలో వేలుపెట్టి కొత్త తలనొప్పులు తెచ్చుకోవడానికి కేంద్రం మొగ్గు చూపకపోవచ్చునని పలువురు అనుకుంటున్నారు.
Tags:    

Similar News