త‌ప్పు చేయ‌బోర‌ట‌..కోదండ‌రాంకు జ్ఞానోదయం

Update: 2018-12-13 10:42 GMT
తెలంగాణ జ‌న‌స‌మితి వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ప్రొఫెస‌ర్ కోదండ‌రాంకు ఆల‌స్యంగా `రాజ‌కీయ జ్ఞానోదయం` అయింద‌నే ప్ర‌చారం జరుగుతోంది. `క్లీన్ ఇమేజ్‌`తో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన కోదండ‌రాం స్వ‌ల్ప‌కాలంలోనే `క్లీన్ బౌల్డ్‌` అయిపోయారు. గులాబీ ద‌ళ‌ప‌తి - తెలంగాణ అప‌ద్ధ‌ర్మ సీఎం కేసీఆర్ వేసిన పాచిక‌ల‌కు అగ్గిపెట్టె పార్టీ గుర్తు నాయ‌కుడి అడ్ర‌స్ వెతుక్కోవాల్సి వ‌చ్చింది! కోదండ‌రాంకు స్వ‌యంగా మంచి గుర్తింపే ఉన్న‌ప్ప‌టికీ...ఆయ‌న దోస్తీ క‌ట్ట‌డం న‌చ్చ‌ని విధానం వ‌ల్లే ఈ ఫలితం వ‌చ్చింద‌నే వారు లేక‌పోలేదు. అయితే, ఈ విష‌యాన్ని పొలిటిక‌ల్ మాస్టారు ఆల‌స్యంగా తెలుసుకొని అమ‌ల్లో పెట్ట‌నున్నారు.

వివ‌రాల్లోకి వెళితే...గతంలో వాయిదా పడిన పంచాయితీ ఎన్నికలకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వ‌డంతో తెలంగాణ‌ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల సంద‌డి కొన‌సాగ‌నుంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమిలో భాగస్వామిగా ఉన్న  టీజేఎస్ పార్టీ  త‌న‌కు త‌గిలిన షాక్ నుంచి పాఠం నేర్చుకొని పంచాయితీ ఎన్నికల్లో స్వతంత్ర్యం గానే పోటీకి సిద్ధపడుతోంది.  ఈ మేరకు ఆ పార్టీ అధినేత కోదండరాం సంకేతాలు ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం ద్వారా క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకునే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వుందని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమి ఏర్పడిందని... సైద్ధాంతికంగా కూటమి కొనసాగుతుందని కోదండరాం తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను టీఆర్ ఎస్ నెరవేర్చేలా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఇదిలాఉండ‌గా - పంచాయతీ ఎన్నికలను ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో బుధవారం బీసీ ఓటరు జాబితా విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 76.51 లక్షల మంది గ్రామీణ బీసీ ఓటర్లున్నట్టు తేల్చారు. పంచాయతీ ఎన్నికలను వేగవంతం చేస్తామని - వారం రోజుల్లో నోటిఫై చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన దరిమిలా పంచాయతీ రాజ్ శాఖ వేగం పెంచింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి - కార్యదర్శి అశోక్ కుమార్ అన్ని జిల్లాల డీపీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లపై సమీక్షించారు. ఎన్నికల సందర్భంగా బదిలీపై వచ్చిన అధికారులకు బాధ్యతలు అప్పగించాలని నాగిరెడ్డి జిల్లా ల అధికారులను ఆదేశించారు. గతంలో ఆదేశించిన బ్యాలెట్ పత్రాల ముద్రణ వివరాలను సరి చూసుకోవాలని తెలిపారు. పంచాయతీ ఎన్నికలను మూడు విడుతల్లో పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నామని ఎస్ ఈసీ పేర్కొంది.

Kodandaram
Tags:    

Similar News