కోదండం మాష్టారి నోట‌.. పార్టీ మాట‌

Update: 2017-11-11 11:17 GMT
తెలంగాణ రాష్ట్రం కోసం కోట్లాడిన వారిలో అత్యంత విశ్వ‌స‌నీయమైన వ్య‌క్తి ఎవ‌రంటే.. కోదండం మాష్టారి పేరు ముందు వ‌రుస‌లో ఉంటుంది. తెలంగాణ ఉద్య‌మానికి కేసీఆర్ నేతృత్వం వ‌హించినా.. ఆయ‌న మీద తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అప్ప‌ట్లో స‌ద‌భిప్రాయం ఉండేది కాదు. తెలంగాణ వ‌చ్చేస్తుందంటూ ఏళ్ల‌కు ఏళ్ల త‌ర‌బ‌డి ఆయ‌న చెబుతున్న వైనంపై  తెలంగాణ స‌మాజంలో చాలానే సందేహాలు ఉండేవి.

ఇప్పుడు అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి. కేసీఆర్ తిరుగులేని అధినేత‌గా అవిర్భ‌వించ‌ట‌మే కాదు.. ఆయ‌న నోటి మాట శిలా శాస‌నంగా మారిపోయిన పరిస్థితి. ఉద్య‌మ వేళ‌లో త‌న వెంట ఉండేవారిలో అత్య‌ధికుల్ని త‌న పార్టీలోకి తీసేసుకోవ‌టం.. కోరుకున్న పోస్టుల‌ను ఇచ్చారు. అలా కుద‌ర‌ని వారికి నామ‌మాత్ర‌పు పోస్టులు ఇచ్చి.. ఫ్యూచ‌ర్లో బాగా చూసుకుంటాన‌ని చెప్పారు.

అలా కేసీఆర్ మాట‌కు నో చెప్పిన నేత‌ల్లో ముఖ్యుడు కోదండ‌రాం. ప‌ద‌వుల ఆశ లేక‌పోవ‌ట‌మే కాదు.. ఉద్య‌మ నేత‌గా ఉందామ‌న్న నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. అందుకు త‌గ్గ‌ట్లే దాదాపు రెండేళ్ల పాటు తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు మీద ఎలాంటి విమ‌ర్శ చేయ‌కుండా సంయ‌మ‌నం పాటించారు. అలాంటి కోదండం మాష్టారు త‌ర్వాతి రోజుల్లో ప్ర‌భుత్వం మీద విమ‌ర్శ‌లు మొద‌లెట్టారు.

మ‌లిద‌శ ఉద్య‌మం మొద‌లు ఇప్ప‌టివ‌ర‌కూ తెలంగాణ రాజ‌కీయ జేఏసీకి ఛైర్మ‌న్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న కోదండ‌రాంను రాజ‌కీయ పార్టీ పెట్టాల‌న్న ఒత్తిళ్లు గ‌డిచిన కొద్దికాలంగా వస్తూనే ఉన్నాయి. ఆయ‌న కాంగ్రెస్ ఏజెంటుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని టీఆర్ ఎస్ నేత‌లు అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తిసారీ ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా.. ఇటీవ‌ల కాలంలో కోదండం మాష్టారి మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర వ్యాఖ్య‌లు చేసి షాకిచ్చారు.

దీంతో.. కేసీఆర్ మాట‌ల‌కు ధీటుగా రియాక్ట్ కాని మాష్టారు.. రాజ‌కీయం ద్వారానే త‌గిన స‌మాధానం ఇవ్వాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతారు. ఉద్య‌మ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కోదండం ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో రాజ‌కీయ పార్టీని ఏర్పాటు చేస్తే తెలంగాణ పాలిటిక్స్ లో ఉన్న వాక్యూమ్ ను క‌వ‌ర్ చేస్తార‌ని చెబుతున్నారు. ఇలాంటి వేళ‌.. కోదండ‌రాం రియాక్ట్ అయ్యారు.

రాజ‌కీయ పార్టీ ఏర్పాటు అంశంపై త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటాన‌ని చెప్పారు. మ‌రి.. జేఏసీనే రాజ‌కీయ పార్టీగా మారుస్తారా?  లేక‌.. జేఏసీని క్లోజ్ చేసి కొత్త పార్టీ పెడ‌తారా?  మొద‌టినుంచి చెబుతున్న‌ట్లు కాంగ్రెస్ పార్టీలో చేర‌తారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌లుగా మారాయి. ఏమైనా ఇంత‌కాలం రాజ‌కీయ పార్టీ పెట్టే విష‌యం మీద స్పందించ‌ని కోదండ‌రాం ఇప్పుడు అందుకు భిన్నంగా పార్టీ ఏర్పాటుపై కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన‌ట్లే.
Tags:    

Similar News