కోదండ‌రాం ఇపుడేం చేస్తారు?

Update: 2016-01-04 07:20 GMT
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ముందు వరసలో ఉన్న తెలంగాణ‌ పొలిటికల్ జేఏసీ...రాష్ట్ర విభజన పూర్తిగా జరగలేదని, సంపూర్ణ తెలంగాణ కోసం క్రియాశీలంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌ని ఇటీవ‌లి కాలంలో చేసిన ప్రకటనలతో టీఆర్‌ ఎస్ పార్టీ ముందుగానే మేల్కొందా? కేంద్రంపై కాలుదువ్వడం ఇందులో భాగ‌మేనా? తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌ను కాపాడ‌టంలో తామే ముందున్నామ‌ని చెప్పుకోవ‌డాని టీఆర్ ఎస్ ఆతృత ప‌డుతోందా? అంటే అవున‌నే అంటున్నారు పరిశీలకులు.

ఇటీవ‌లి ప‌రిణామాలు చూస్తే కేంద్ర ప్రభుత్వంపై అధికార టీఆర్‌ ఎస్ తన వ్యూహాన్ని మార్చినట్లు స్ప‌ష్టంగా కనిపిస్తోంది. గత నెలలో జ‌రిగిన‌ పార్లమెంట్ శీతాకాల‌ సమావేశాల్లో ఆ పార్టీ అనుసరించిన తీరును పరిశీలిస్తున్న వారు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమావేశాలకు టీఆర్‌ ఎస్ ఎంపీలు తయారైన విధానం, పార్టీ అధినేత కేసీఆర్‌ తో వారు జరిపిన భేటీలు, ముందస్తు వ్యూహం వంటి అంశాలను గమనిస్తే రూటు మార్చిన టీఆర్‌ ఎస్ కేంద్రంతో ఢీ అంటే ఢీ అనడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు భావిస్తున్నారు.

రాష్ట్ర పునర్విభజన చట్టం అమలులో కేంద్రానికి పట్టింపులేదంటూ గళమెత్తుతున్న టీఆర్‌ ఎస్ వివిధ అంశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. మ‌రోవైపు ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన టీడీపీ అధినేత చంద్రబాబును దోషిగా నిలబెట్టే ప్రయత్నాలను విజయవంతంగా చేస్తోంది. తెలంగాణకు ప్రత్యేక హోదా - ప‌్ర‌త్యేక‌ ప‌్యాకేజీ - హైకోర్టు విభజన - ఉద్యోగుల పంపిణీలో జరుగుతున్న జాప్యం - కమలనాథన్ కమిటీ పనితీరు - తదితర అంశాలపై పార్టీ నేత‌లు గ‌ట్టిగానే పట్టుబడుతున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ త‌న‌యుడు - మంత్రి కేటీఆర్ సైతం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ల‌క్ష్యంగా త‌మ వాగ్భాణాల‌ను సంధించ‌డం ఇందుకు స‌రైన ఉదాహ‌ర‌ణ‌గా చెప్తున్నారు. మోడీ ల‌క్ష్యంగా తెలంగాణ‌కు ఏం చేశార‌నే రీతిలో ప్ర‌శ్నించ‌డం వెన‌క రెండు అజెండాలు ఉన్నాయంటున్నారు.

ఇటు తెలంగాణ కోసం తామే పోరాడుతున్నామ‌ని చెప్ప‌డం ద్వారా జేఏసీ ప్ర‌య‌త్నాల‌కు గండికొట్ట‌డం మ‌రోవైపు కేంద్రం ఎలాంటి స‌హాయం చేయ‌డం లేద‌ని చెప్ప‌డం ద్వారా బీజేపీని ఇరుకున పడేస్తున్నారు. మొత్తంగా తెలంగాణ జేఏసీ - జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం ఇపుడు ఏం చేయాలో నిర్ణ‌యించుకోవాల్సిన ప‌రిస్థితి ప‌రోక్షంగా క‌ల్పించారు. త‌ద్వారా జేఏసీని క్రాస్‌ రోడ్స్‌ లో నిల‌బెట్టారు.
Tags:    

Similar News