కోదండం మాష్టారి పార్టీ డేట్ ఫిక్స్‌?

Update: 2018-02-14 05:33 GMT
తెలంగాణ రాష్ట్రంలో స‌రికొత్త రాజ‌కీయ పార్టీని తీసుకొచ్చేందుకు తెలంగాణ రాజ‌కీయ జేఏసీ ఛైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండరాం రెఢీ అవుతున్నారు. ఇప్ప‌టికే ఉన్న పార్టీలు స‌రిపోవ‌న్న‌ట్లు కొత్త పార్టీని తీసుకురావ‌టంపై తెలంగాణకు చెందిన ప‌లువురు నేత‌లు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్న‌వేళ‌.. వారి వాద‌న‌ల‌కు భిన్నంగా మాష్టారు మాత్రం త‌న‌దైన రాజ‌కీయ వేదిక‌ను తెర మీద‌కు తెచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

కేసీఆర్ లాంటి బ‌ల‌మైన నేత‌ను ఎదుర్కొన‌టానికి అన్ని రాజ‌కీయ పార్టీలు సంఘ‌టితం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న మాట వినిపిస్తుంటే.. అందుకు భిన్నంగా మాష్టారు త‌న ప్ర‌య‌త్నాల్లో తాను ఉన్న‌ట్లు చెబుతున్నారు. గ‌డిచిన కొన్ని నెల‌లుగా రాజ‌కీయ‌పార్టీ ఏర్పాటు దిశ‌గా కోదండం మాష్టారు ప్లాన్ చేస్తున్నారు. ఆ విష‌యాన్ని గుర్తించిన వివిధ రాజ‌కీయ ప‌క్షాల‌కు చెందిన నేత‌లు మాష్టార్ని వ్య‌క్తిగ‌తంగా క‌లిసి.. కొత్త పార్టీ పెట్టే ఆలోచ‌న వ‌ద్ద‌ని వారించిన‌ట్లు చెబుతారు.

ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన కొంద‌రు ముఖ్య‌నేత‌లైతే మాష్టారిని వ్య‌క్తిగ‌తంగా క‌లిసి కొత్త పార్టీ ఏర్పాటు చేయొద్ద‌ని.. అలా చేస్తే.. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఓట్లు చీలి అంతిమంగా కేసీఆర్‌కు లాభం చేకూరుతుంద‌న్న మాట‌ను చెప్పిన‌ట్లుగా స‌మాచారం. అయితే.. వీరి వాద‌న‌ను ప‌ట్టించుకోని మాష్టారు.. తాను రాజ‌కీయ పార్టీ పెట్టాల‌న్న దానిపై క‌చ్ఛితంగా ఉన్న‌ట్లు చెబుతారు. దీనికి త‌గ్గ‌ట్లే తాజాగా కొత్త పార్టీకి సంబంధించిన కీల‌కాంశాల్ని పూర్తి అయిన‌ట్లుగా తెలుస్తోంది.  

ఇప్ప‌టికే తాను పెట్టే పార్టీ పేరును ఫిక్స్ చేసిన కోదండ‌రాం.. ముందుజాగ్ర‌త్త‌గా మ‌రో మూడు పేర్ల‌ను ఆప్ష‌న్ గా పెట్టుకున్న‌ట్లు తెలుస్తోంది. అంతేకాదు.. తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో కీల‌క ఘ‌ట్టంగా అభివ‌ర్ణించే మిలియ‌న్ మార్చ్ నిర్వ‌హించిన మార్చి 10న భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేసి త‌న రాజ‌కీయ‌పార్టీని ఘ‌నంగా ప్ర‌క‌టించాల‌ని భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

మిలియ‌న్ మార్చ్ తో స‌మైక్య రాష్ట్ర ప్ర‌భుత్వంపై పోరాడిన‌ట్లే.. తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అద్దం ప‌ట్టేలా పున‌రంకితం కావాలంటూ ఆ రోజే త‌న పార్టీకి సంబంధించిన కీల‌కాంశాల్ని ప్ర‌క‌టించాల‌ని కోదండం భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. వాస్త‌వానికి ఈ నెల రెండో వారంలో కోదండం మాష్టారి రాజ‌కీయ పార్టీని ప్ర‌క‌టించాల‌ని ముందు అనుకున్నా.. భావోద్వేగాన్ని ర‌గిలించేలా పార్టీ ప్ర‌క‌ట‌న డేట్ ఉండాల‌న్న ఉద్దేశంతో మార్చి 10ని నిర్ణ‌యించిన‌ట్లుగా తెలుస్తోంది.

ఇప్ప‌టివ‌ర‌కూ అందిన స‌మాచారం ప్ర‌కారం మాష్టారి పార్టీ పేరు విష‌యంలో తెలంగాణ జ‌న‌స‌మితి పేరిట ఖ‌రారు చేసిన‌ట్లు చెబుతున్నారు. ఈ పేరుకు సంబంధించి సాంకేతిక అంశాలు.. ఇత‌ర స‌మ‌స్య‌లు వ‌చ్చిన ప‌క్షంలో మ‌రో మూడు పేర్ల‌ను సిద్ధంగా ఉంచారు. తెలంగాణ స‌క‌ల జ‌నుల పార్టీ.. తెలంగాణ ప్ర‌జా పార్టీ.. ప్ర‌జా తెలంగాణ పార్టీ పేరిట మ‌రో మూడు పేర్ల‌ను రిజిస్ట్రేష‌న్ చేయిస్తున్నారు. పార్టీ విధివిధానాల‌పై జోరుగా చ‌ర్చ‌లు సాగుతున్నాయి. పార్టీ ఆవిర్భావ స‌మావేశంలో పార్టీ ఏర్పాటు వెనుక ఉద్దేశం.. ల‌క్ష్యాల్ని మాష్టారు వివ‌రించ‌నున్నారు.

ఇక‌.. పార్టీ ప్ర‌క‌ట‌న ఎక్క‌డ చేయాల‌న్న అంశంపై క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. హైద‌రాబాద్ లో భారీ స‌భ ఏర్పాటు చేసి.. పార్టీ ఆవిర్భావ ప్ర‌క‌ట‌న చేయాలా?  లేక‌.. జిల్లాల్లో భారీ స‌భ ఏర్పాటు చేయాల‌న్న అంశంపై జేఏసీలో భారీ చ‌ర్చ జ‌రుగుతోంది.  హైద‌రాబాద్ కాని ప‌క్షంలో వ‌రంగ‌ల్ అయితే బాగుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.  పార్టీ ఆవిర్భావ స‌భ‌కు హైద‌రాబాద్ ఫ‌స్ట్ ఆప్ష‌న్ అయితే.. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క భూమిక పోషించిన వ‌రంగ‌ల్ సెకండ్ ఆప్ష‌న్ గా చెబుతున్నారు. పార్టీ ఆవిర్భావ ప్ర‌క‌ట‌న మీడియాలో ప్ర‌ముఖంగా క‌వ‌ర్ కావాలంటే హైద‌రాబాదే బెట‌ర‌న్న ఆలోచ‌న‌లో  కోదండం అండ్ కో ఉన్న‌ట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News