సమాజంలో విలువలతో కూడిన రాజకీయ పార్టీలు అవసరమని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ విలువల కోసం జేఏసీ పోరాడుతుందని తెలిపారు. రాజకీయ పార్టీ పెట్టే సందర్భం, అవసరం వస్తే పెడుతమని స్పష్టం చేశారు. పార్టీ పెట్టిన జేఏసీ మాత్రం కొనసాగాలని, కొనసాగుతుందని ప్రకటించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులు నిర్వహించిన మీట్ ది ప్రెస్ కు కోదండరాం హాజరయిన సందర్భంగా పలు ప్రశ్నలకు స్పందించారు. ఫిబ్రవరి 22 న నిరుద్యోగుల నిరసన ర్యాలీ నిర్వహిస్తామని కోదండరాం పునరుద్ఘాటించారు. ర్యాలీ కోసం పర్మిషన్ అడిగామని, డీసీపీ దగ్గర పెండింగ్ లో ఉండటంతో ఇంకా పర్మిషన్ రాలేదని తెలిపారు. పర్మిషన్ ఇచ్చిన ఇవ్వకపోయినా ర్యాలీ నిర్వహించి తీరుతామని, కొన్ని వర్గాలు గొడవలు చేసేందుకు సిద్దమైన్నట్లు తమ వరకు వార్తలు వచ్చాయని కోదండరాం తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు కోదండరాం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా నైనా సీఎం నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వ్యాఖ్యానించారు.
ఈ నెల 22 న నిరుద్యోగ నిరసన ర్యాలీలో భాగంగా ఉదయం 10 గంటలకు సుందరయ్య పార్కు నుంచి ఇందిరాపార్క్ వరకు ప్రదర్శన ఉంటుందని కోదండరాం తెలిపారు. ర్యాలీకి విద్యార్థులు, యువకులు స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు. ర్యాలీ చాలా శాంతియుతంగా నిర్వహించాలని పాల్గొనే వారందరినీ కోరారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని, జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కమలనాథన్ కమిటీ రాష్ట్ర స్థాయి ఉద్యోగాలకే పరిమితమని, ఆ పరిధిలో 9వేల 50 ఉద్యోగులకు మాత్రమే వస్తాయని తెలిపారు. 2014 లెక్కల ప్రకారం ఒక లక్ష 7 వేల ఖాళీలు ఉన్నాయని, దీనికి కమలనాథన్ కమిటీకి సంబంధం లేదని పేర్కొన్నారు. 2016 లెక్కల ప్రకారం లక్ష 30 వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని ఇందులో నుంచి ఇప్పటివరకు 4295 ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వం భర్తీ చేసిందని తెలిపారు. ఉద్యోగాల విషయం లో ఒక క్యాలెండరు రూపొందించాలని తద్వారా ఎన్ని ఖాళీలు ఉన్నాయి...ఎన్ని భర్తీ చేస్తామనేది తెలుస్తుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు డీఎస్సీ నోటిఫికేషన్ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోచింగ్ పేరుతో విద్యార్థుల జేబులు ఖాళీ అవుతున్నాయి కానీ నోటిఫికేషన్స్ మాత్రం రావడం లేదని అన్నారు. ప్రైవేట్ సంస్థలో కూడా స్థానికులకు రిజర్వేషన్ కల్పించాలని, ఉపాధి కల్పనా పై ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని కోదండరాం డిమాండ్ చేశారు.
ప్రభుత్వానికి ఇష్టమైనప్పుడు నోటిఫికేషన్ జారీ చేయడం ఇకపై చెల్లదని కోదండరాం స్పష్టం చేశారు. హిమాచల్ ప్రదేశ్ తరహాలో ప్రైవేటు సంస్థల్లో స్థానికులకు ఉద్యోగాలు, ఉపాదికల్పన కల్పించాలన్నారు. దీనికోసం కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలన్నారు. తమ ర్యాలీపై ప్రభుత్వం అసహనం ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఎన్నికలకు... ఎన్నికలకు మధ్య ఉద్యమాలు క్రియాశీలకంగా వ్యవహరించాలన్న అంబేద్కర్ మాటల్ని స్ఫూర్తిగా తీసుకుంటున్నామని తెలిపారు.ఈ సారి కచ్చితంగా ర్యాలీ నిర్వహిస్తామని బోధించు, సమీకరించు, ఉద్యమించు... అన్న అంబేద్కర్ లక్ష్యానికి అనుగుణంగా ఐకాస పనిచేస్తోందని తెలిపారు. నిరుద్యోగం చాలా తీవ్రమైన సమస్య అని, యువకులు పనిలేకుండా ఉంటే సమాజంలోని ఆర్థిక వ్యవస్థలో లోపం ఉన్నట్లు భావించాలని కోదండరాం వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ నిరుద్యోగుల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తోందని, అందుకే ఐకాస వారి ఆకాంక్షల మేరకు ఉద్యమిస్తోందని చెప్పారు. ఉద్యమ కాలంలో విద్యార్థులు, యువకులు నమోదైన కేసులన్నీ ప్రభుత్వం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జేఏసీ స్వతంత్ర సంస్థ అని పేర్కొంటూ ప్రజాసమస్యలపై రాజకీయ పార్టీలతో కలిసి పని చేస్తామని ఆయన ప్రకటించారు. ఆచార్య జయశంకర్ సూచించిన మార్గంలో ముందుకెళ్తామన్నారు. 40 ఏళ్లపాటు బాలగోపాల్, సిద్ధార్థ ఫెర్నాండెజ్, స్వామి అగ్నివేష్ వంటి వారితో కలిసి పనిచేశానని ఆ అనుభవంతో వ్యవహరిస్తున్నానని కోదండరాం చెప్పారు. తనను అవమానిస్తే ఫర్వాలేదు కానీ... ఉద్యమాలను కించపర్చొద్దని తెలిపారు.
పార్టీ ఫిరాయింపులు మంచివి కావని కోదండరాం అభిప్రాయపడ్డారు. రాజకీయాలు, నేరాలు కలిసిపోయాాయని, నయీం ఉదంతంతో ఈ లక్షణం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ప్రజాస్వామిక విలువలను కాపాడే రాజకీయ వేదిక అవసరమన్న చర్చ జరుగుతోందని అన్నారు. తాను రాజకీయ పార్టీలో చేయాలన్న విషయంపై నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఐకాస లక్ష్యానికి అనుగుణంగా పనిచేసే వారిని కులాలు, మతాలకు అతీతంగా కలుపుకుపోతామని కోదండరాం అన్నారు. ఉద్యమ నినాదాలైన... నీళ్లపై ప్రభుత్వం పోరాడాల్సి ఉంది. నిధులు సహజంగానే రాష్ట్రానికి చేరుతాయి. నియామకాల కోసం ఐకాస పోరాడుతోందని తెలిపారు. జోనల్ వ్యవస్థ కొనసాగించాలని, అవసరమైతే కొన్ని జోన్ల సవరించాలని ఇంకొన్ని జోన్లు పెంచాలని అన్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పరస్పరం చర్చించుకుని సొంత రాష్ట్రానికి స్వచ్ఛందంగా వెళ్లే వారికి అవకాశం కల్పించాలని సూచించారు. ప్రభుత్వరంగ సంస్థలు, ఉద్యోగుల విభజనను ప్రభుత్వం వేగంగా పూర్తి చేయాలని కోరారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/