కోదండ‌రాంను 'గుర్తు' ప‌ట్టేది ఎవ‌రు?!

Update: 2018-10-20 13:52 GMT
తెలంగాణ జ‌న‌స‌మితి నేత‌ - మాజీ ఫ్రొఫెస‌ర్ కోదండ‌రాం అనూహ్య రీతిలో ఇర‌కాటంలో ప‌డిపోతున్నారు. అనూహ్య‌రీతిలో వ‌చ్చిప‌డిన‌ ముంద‌స్తు ఎన్నిక‌ల‌తో రాజ‌కీయ వ్యూహంలో బిజీబిజీ కావాల్సి ఉండ‌గా...దానికి భిన్నంగా ఊమించ‌ని స‌మ‌స్య‌ల‌తో ఆయ‌న పార్టీకి సంబంధించిన వ్య‌వ‌హారాల్లో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని చ‌ర్చ జ‌రుగుతోంది. టీఆర్ ఎస్‌ కు వ్య‌తిరేకంగా మ‌హాకూట‌మి పేరుతో కాంగ్రెస్ పార్టీతో జ‌ట్టుక‌ట్టిన టీజేఎస్ ఆ త‌దుప‌రి ప్ర‌క్రియ‌లో అడుగు ముందుకుప‌డ‌కుండా ఉన్న సంగ‌తి తెలిసిందే. మహాకూటమి సీట్ల సర్దుబాటు వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాకపోవ‌డం ఆ పార్టీ నేత‌ల్ని ఇర‌కాటంలో ప‌డేస్తోంది.

మ‌హాకూట‌మి సీట్ల సర్దుబాటులో భాగంగా తెలంగాణ జన సమితి తరఫున పోటీచేసే అభ్యర్థులు సైతం కాంగ్రెస్ ఎన్నికల చిహ్నం పైనే పోటీ చేయాలనే ష‌రతును హ‌స్తం పార్టీ పెట్టిన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ హ‌స్తం గుర్తు ప్ర‌జ‌లకు సుప‌రిచితం అయినందున, ఈ రీతిలో బ‌రిలో దిగాల‌ని కోరింది. ఈ ప‌రిణామం టీజేఎస్ వ‌ర్గాల‌ను షాక్‌ కు గురిచేసింది. తాజాగా ఈ ఊహాగానాల గురించి పాత్రికేయులు కోదండరాంను ప్రశ్నించగా - ‘ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ హస్తం గుర్తుపై పోటీచేసే ప్రసక్తే లేదు. మా పార్టీ అభ్యర్థులు మా పార్టీ గుర్తు పైనే పోటీ చేస్తారు` అని వెల్ల‌డించారు.

అయితే, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి  పార్టీకి ఎన్నికల చిహ్నం లభించడంలో క్లారిటీ రాలేద‌ని స‌మాచారం. టార్చ్‌ లైట్‌ - క‌త్తెర‌ - విజిల్ వంటి సింబ‌ల్స్ కోదండ‌రాం ముందర ఉంచిన‌ట్లు స‌మాచారం. ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనుందని టీజేఎస్ వ‌ర్గాలు న‌మ్ముతున్నాయి. అయితే, ఈ ప్ర‌క్రియ‌లో జాప్యం జ‌రుగుతుండ‌టంపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. స్వ‌ల్ప‌ స‌మ‌యంలో గుర్తును ప్ర‌జ‌ల్లోకి ఎలా తీసుకువెళ్లాలి?  కాంగ్రెస్ పెడుతున్న ష‌ర‌తులు ఎదుర్కోవ‌డం ఎలా అనే అంశాలు కోదండ‌రాం బృందంలో క‌ల‌క‌లం రేకెత్తిస్తున్న‌ట్లు స‌మాచారం. కాగా, పొత్తులో భాగంగా 15 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తే విజయం సాధిస్తామని కోదండరామ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News