కోదండ‌రాం రాజ‌కీయ పార్టీ రెడీ...గుర్తు కూడా!

Update: 2018-02-04 09:01 GMT
తెలంగాణ రాజ‌కీయ య‌వ‌నిక‌పై మ‌రో పార్టీ ఏర్పాటు కానుందని దాదాపుగా ఖరారైపోయింది. స్వ‌రాష్ట్ర ఉద్య‌మంలో కీల‌కంగా ప‌నిచేసిన జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం నేతృత్వంలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధ‌మైందని, ఏకంగా ముహూర్తం ఖ‌రారైందని జేఏసీ వ‌ర్గాలు మీడియా మిత్రుల‌తో వెల్ల‌డిస్తున్నాయి. ఢిల్లీలో ఇందుకు త‌గిన ప్ర‌క్రియ జ‌రుగుతోందని స‌మాచారం. తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం నేతృత్వంలో ఏర్పాటుకానున్న పార్టీ పేరు తెలంగాణ జనసమితి (టీజేఎస్‌) అని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం.

తెలంగాణ‌ జేఏసీలోని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ కొలిక్కివ‌చ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ గురించి జేఏసీలోని కొందరు ముఖ్యనేతలు ఢిల్లీకి వెళ్లి ఇందుకు స‌మ‌ర్పించిన ప‌త్రాలు స‌మ‌ర్పించిన‌ట్లు స‌మాచారం. తెలంగాణ సకల జనుల పార్టీ - తెలంగాణ ప్రజా సమితి వంటి పేర్లు ప్ర‌తిపాద‌న‌లోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ...తెలంగాణ జ‌న‌స‌మితి పేరును ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది.

జేఏసీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ ఏర్పాటు గురించి కోదండరాం అధికారిక ప్రకటన చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. పార్టీ విధివిధానాలు - లక్ష్యం - మార్గం తదితరాలపై కసరత్తు  దాదాపు పూర్తయిందని, రైతు నాగలి గుర్తు ఉంటుంద‌ని స‌మాచారం. టీఆర్‌ ఎస్‌ ఆవిర్భవించాక 2001లో జరిగిన జిల్లా - మండల ప్రజా పరిషత్‌ ఎన్నికల్లో రైతు నాగలి గుర్తుతోనే పోరాడింది. ఈ గుర్తుతో టీఆర్‌ ఎస్‌ కు సానుకూల ఫలితాలు కూడా వచ్చాయని దీంతో పాటుగా...రైతు సమస్యలపై ఇప్పటికే పలు కార్యక్రమాలను జేఏసీ నిర్వహించింది కాబ‌ట్టి...అన్న‌దాత‌ల‌కు చేరువ అయేందుకు ఇది మ‌రింత ఉప‌యుక్తంగా ఉంటుంద‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. కాగా, తెలంగాణ జేఏసీ - రాజకీయ పార్టీ రెండూ వేర్వేరుగా కొనసాగాలని భావిస్తున్నారు.

ఇటీవ‌ల జ‌రిగిన స్టీరింగ్ కమిటీ సమావేశంలోనే పార్టీ పెడుతున్నట్టు జేఏసీ శ్రేణులకు కోదండరాం సంకేతాలు అందజేసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా జేఏసీ ప్రతినిధుల బృందం క్షేత్ర స్థాయి పరిస్థితులను అధ్యయనం చేశారు. ఇదే క్రమంలో రాజకీయ పార్టీ ఏర్పాటుపై కూడా చర్చ జరిగింది. వివిధ జిల్లాలోని కొందరు రాజకీయ ముఖ్యనేతలతో జేఏసీ ప్రతినిధులు చర్చించారు. ఎన్నికలకు గడువు దగ్గరపడడం, మరో వైపు పార్టీ ఏర్పాటుపై జేఏసీ శ్రేణులు, విద్యార్థి సంఘాల నుంచి కోదండరాంపై తీవ్ర ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయాలని ఆయన భావిస్తున్నారు.రాజకీయ పార్టీ విధి విధానాలు - తదితర అంశాలపై పలువురు ముఖ్యులతో ఆయన చర్చిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కొందరు నేతలు ఇది వరకే కోదండరాంతో చర్చలు జరిపారు.

రైతు సమస్యలు - నిరుద్యోగం - ఉపాధి కల్పన - భూ నిర్వాసితుల సమస్యలే పార్టీ ప్రధాన ఎజెండాగా ఉంబోతున్నట్లు జేఏసీ నేతలు చెబుతున్నారు. అధికార టీఆర్‌ ఎస్‌ కు చెందిన కొందరు అసంతృప్త నేతలు కూడా కోదండరాం ఏర్పాటు చేసే పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. క్రియాశీల రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న మ‌రికొంద‌రు నేత‌లు సైతం పార్టీలో చేరుతార‌ని అంటున్నారు.
Tags:    

Similar News