కోదండరాంకు కొత్త అస్త్రం దొరికింది

Update: 2017-01-23 05:40 GMT
టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ సార‌థ్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ త‌ప్పొప్పుల‌ను ఎండ‌గ‌డుతున్న తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం ఈ క్ర‌మంలో కొత్త అస్త్రాన్ని చేత‌బ‌ట్టారు. జేఏసీ చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌ను మీడియా స‌రిగా చేర‌వేయ‌డం లేద‌ని పేర్కొంటూ...సోష‌ల్ మీడియా ద్వారా ముందుకు పోవాల‌ని కోదండ‌రాం నిర్ణ‌యించారు. 'సోషల్‌ మీడియా నెట్‌ వర్క్‌'పై హైదరాబాద్‌ లో నిర్వహించిన సదస్సులో కోదండ‌రాం మాట్లాడారు. కొన్ని ప్రింట్‌ - ఎలక్ట్రానిక్‌ మీడియా సంస్థలు సమాచారాన్ని ఎడిట్‌ చేస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మీడియా సంస్థలు కొందరి చేతుల్లోనే ఉండటం వల్ల జేఏసీ కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో ప్రజలకు చేరడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్‌ మీడియా పట్ల నైపుణ్యాలను పెంపొందించుకుని త‌మ ల‌క్ష్యాలను ప్రజలకు చేరే వేస్తామని కోదండ రాం అన్నారు.

సోషల్‌ మీడియా ద్వారా జేఏసీ నిర్దేశించుకున్న లక్ష్యాలను వివరిస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని జేఏసీ ప్రతినిధులకు కోదండ‌రాం సూచించారు. సమాజంలో ప్రస్తుతం 35 నుంచి 40 శాతం వరకు సోషల్‌ మీడియాను ఉపయోగిస్తున్నారని, రాష్ట్రంలో కోటి మందికి పైగా సోషల్‌ మీడియాను నిత్యం వీక్షిస్తున్నారని కోదండ‌రాం తెలిపారు. ఈ మీడియా ప్రాధాన్యతను గుర్తించి జేఏసీ కార్యక్రమాలకు మరింత ప్రచారం కల్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు . ప్రస్తుతం వార్తా సంస్థలకంటే సోషల్‌ మీడియాలోనే సమాచారం వేగంగా ప్రజలకు చేరుతోంద‌ని కోదండ రాం అన్నారు. ఒకప్పుడు ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా మాత్రమే ఉండేదని, ఇప్పుడు సమాజంలో సోషల్‌ మీడియా ప్రధాన పాత్ర పోషిస్తున్నదన్నారు. వ్యక్తులుగాగానీ - సంస్థలుగాగానీ తలపెట్టిన కార్యక్రమాలు పూర్తిస్థాయిలో ప్రజలకు చేరాలంటే సోషల్‌ మీడియాను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సమస్యలే ఎజెండాగా పోరాడుతోన్న టీజేఏసీ కూడా సోషల్‌ మీడియా వినియోగంపై దృష్టి పెట్టిందని - ఫేస్‌ బుక్‌ - ట్విట్టర్‌ - యూ ట్యూబ్‌ - వాట్సప్‌ - బ్లాగ్‌ తదితర మాద్యమాలను ఉపయోగిం చుకుంటున్నదని కోదండ రాం తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి జిల్లా కన్వీనర్లు - ఛైర్మన్లు - కో చైర్మన్లు తదితరులు ఈ కార్య‌క్ర‌మంలో క్రియాశీలంగా ముందుకు సాగాల‌న్నారు.  కాగా...ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు ఫిబ్రవరి మూడో వారంలో తెలంగాణ నిరుద్యోగ ర్యాలీని పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్టు చైర్మెన్‌ కోదండరాం చెప్పారు. నిధులు, ఉద్యోగాల కోసమే తెలంగాణ ఉద్యమం నిర్వహించి రాష్ట్రాన్ని సాధించుకున్న విషయాన్ని ఆయ‌న‌ గుర్తు చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News