టీవీ ఇంటర్వ్యూ సాక్షిగా కోడెల బుక్ అయ్యారే

Update: 2016-06-21 05:57 GMT
కాలు జారినా ఫర్లేదు కానీ నోరు జారకూడదన్నది పాతకాలపు సామెత. ఇప్పటి కాలపు రాజకీయ నేతలు ఈ మాటను పూర్తిగా మర్చిపోయినట్లు కనిపిస్తోంది. తాజాగా ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ బుక్ అయిన తీరు ఇలాంటిదే. రాజకీయ నేతలు ఏదైతే చేయకూడదో అదే చేసిన ఆయన.. నోరు జారి టీవీ ఇంటర్వ్యూలో ఓపెన్ గా ఒప్పుకోవటం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల ఖర్చు రూ.28లక్షలకు మించరాదు. ఇది అధికారిక నిబంధన.

అందుకే తగ్గట్లే.. తాను ఖర్చుచేసినట్లుగా ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్లు జారీ చేసిన ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్.. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన తాజా ఎన్నికల ఖర్చు గురించి ఓపెన్ అయిపోవటం ఇప్పుడు పెను వివాదంగా మారింది. తాజా ఎన్నికల్లో తాను రూ.11.5కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందంటూ ఆయన పేర్కొనటం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర కలకలాన్ని రేపుతోంది. ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలకు కొన్ని వందల రెట్లు ఖర్చు ఎక్కువగా ఉండటం ఒకటైతే.. ఎన్నికల్లో కోడెల సమర్పించిన అపిడవిట్ ప్రాకారం ఆయన స్థిరచరాస్తులు కలిపి రూ.5.3కోట్లుగా చూపించారు.

అలాంటి కోడెల.. ఎన్నికల్లో రూ.11.5కోట్లు ఎలా ఖర్చు చేశారన్నది ఒక ప్రశ్నగా మారిందని చెప్పొచ్చు. ఒక టీవీ ఛానల్ చేసిన ఇంటర్వ్యూలో భాగంగా.. మారిన రాజకీయాల గురించి మాట్లాడుతూ.. 1983లో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు రూ.30 వేలు ఖర్చు అయ్యిందని.. అందులో కూడా గ్రామాల నుంచి.. వివిధ వర్గాల నుంచి చందాల రూపంలో వచ్చాయని చెప్పిన కోడెల..మొన్నటి ఎన్నికల్లో మాత్రం రూ.11.5కోట్లు ఖర్చు అయినట్లుగా చెప్పారు.

ఇంత ఖర్చు చేయాలంటే అవినీతి చేసే వారు కొందరైతే.. ఆస్తులు అమ్మేవారు మరికొంతమంది ఉన్నారని.. రాజకీయాల్లో డబ్బుకు ప్రాధాన్యం పెరిగిదంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇది ఏ మాత్రం ఆరోగ్యకరపరిణామం కాదని పేర్కొన్న కోడెల మాటలు ఇప్పుడు సంచలనంగా మారటంతో పాటు.. అంత భారీ మొత్తాన్ని ఖర్చు చేసి.. కెమేరా సాక్షిగా ఎలా చెప్పేశారన్న విస్మయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. పొరపాటున నోరు జారినందునే కోడెల నోటి నుంచి ఈ తరహా మాట వచ్చినట్లుగా భావిస్తున్నారు. ఏమైనా తన ఎన్నికల ఖర్చు గురించి తానే ఓపెన్ అయి.. లేని తలనొప్పులు తెచ్చుకున్నట్లుగా తాజా పరిస్థితి మారిందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News