కోడెల కొడుకు వీరంగం చూశారా?

Update: 2018-09-19 05:17 GMT
త‌ల్లిదండ్రులు ప్ర‌ముఖ స్థానాల్లో ఉన్న‌ప్పుడు వారి పిల్ల‌లు ఎంతో బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాలి. కానీ.. అవేమీ ప‌ట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే పుత్ర‌ర‌త్నాల‌కు కొద‌వ లేదు.  తాజాగా ఆ జాబితాలో చేరిపోయారు ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు కుమారుడు శివ‌రామ‌కృష్ణ‌.

త‌మ వ‌ర్గానికి చెందిన నేత‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నార‌న్న ఆగ్ర‌హంతో పోలీస్ స్టేష‌న్ లో అత‌గాడి వీరంగం సంచ‌ల‌నంగా మారింది. మీకెంత ధైర్యం ఉంటే మా వ్య‌క్తిని పోలీస్ స్టేష‌న్ కు తీసుకొచ్చారంటూ కోడెల కొడుకు దౌర్జ‌న్యం ఇప్పుడు వివాదంగా మారింది. అస‌లేం జ‌రిగిందంటే..

గుంటూరు జిల్లా రొంపిచ‌ర్ల మండ‌లంలోని ఎడ్వ‌ర్డు పేట‌లో వినాయ‌క నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల‌పై దాడి జ‌రిగింది. ఈ ఉదంతంలో టీడీపీ నేత కొలికొండ కొండ‌లును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేష‌న్ కు త‌మ వ‌ర్గానికి చెందిన నేత‌ను పోలీసులు తీసుకెళుతున్న స‌మాచారంతో స్పీక‌ర్ కోడెల కుమారుడు శివ‌రామ‌కృష్ణ రొంపిచ‌ర్ల పోలీస్ స్టేష‌న్ కు వ‌చ్చారు.

త‌మ పార్టీ నేత‌ను స్టేష‌న్ కు తీసుకురావ‌టంపై మండిపాటు ప్ర‌ద‌ర్శించారు. పోలీసుల తీరును తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. స్పీక‌ర్ కొడుకు తీరుతో టీడీపీ నేత‌లు మ‌రింత రెచ్చిపోయారు. ఒక‌ద‌శ‌లో పోలీస్ స్టేష‌న్ లో పోలీసుల‌కు.. టీడీపీ నేత‌ల‌కు మ‌ధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు అరెస్ట్ చేసిన టీడీపీ నేత‌ల‌ను వెంట‌నే త‌మ‌తో పంపాల‌ని ప‌ట్టుబ‌ట్టారు.

టీడీపీ నేత‌ల దౌర్జ‌న్యాన్ని త‌న ద‌గ్గ‌రి కెమెరా తో చిత్రీక‌రిస్తున్న ఒక పోలీస్ కానిస్టేబుల్ పై శివ‌రాం తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తూ.. అయ‌న కెమేరాను లాక్కునే ప్ర‌య‌త్నం చేశారు. ఈ ఉదంతంపై స‌మాచారం అందుకున్న ఉన్న‌తాధికారులు శివ‌రాంతో రెండు గంట‌ల పాటు చ‌ర్చ‌లు జ‌రిపారు. అనంత‌రం కొండ‌లును త‌ర్వాత వ‌దిలేస్తామ‌న్న హామీతో శాంతించిన శివ‌రాం వెళ్లిపోయిన‌ట్లుగా చెబుతున్నారు. స్పీక‌ర్ హోదాలో ఉన్న తండ్రిని ఇబ్బంది పెట్టేలా ఆయ‌న కుమారుడు శివ‌రాం తీరు ఉంద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.
Tags:    

Similar News