క్యూ కడుతున్న కోడెల బాధితులు.. ఆందోళనలో ఫ్యామిలీ

Update: 2019-06-10 13:22 GMT
తెలుగుదేశం పార్టీ తరపున 2014 ఎన్నికల్లో గెలిచి, శాసనసభ స్పీకర్‌గా బాధ్యతల నిర్వహించారు డాక్టర్ కోడెల శివప్రసాద్. అయితే, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఆయన సిట్టింగ్ స్థానమైన సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంబటి రాంబాబు చేతిలో ఘోరంగా ఓడిపోయారు. అంతేకాదు, ఆయన ప్రాతినిధ్యం వహించిన టీడీపీ కూడా భారీ ఓటమిని మూటగట్టుకుంది. దీంతో ఐదేళ్ల కాలంలో కోడెల శివప్రసాద్ కుటుంబ సభ్యులు చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీంతో వారిపై పోలీస్‌ స్టేషన్‌ లో కేసు కూడా నమోదైంది.
 
ఈ వ్యవహారంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ''ప్రజలు, వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు చేసిన కోడెల కుటుంబ సభ్యులెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరు. ‘కే’ ట్యాక్స్ పేరుతో వందల కోట్లు దోచుకున్నారు. దీనికి సహకరించిన అధికారులు కూడా దోషులే. నిర్బంధ వసూళ్ల మాఫియా అరాచకాలపై దర్యాప్తు జరుగుతుంది. బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలి'' అని ఆయన ట్వీట్ చేశారు. ఆయన మాత్రమే కాదు.. పోలీసులు కూడా బాధితులు బయటకు వస్తే, న్యాయం చేస్తామని బహిరంగంగానే ప్రకటించారు. దీంతో కోడెల బాధితులు పోలీస్‌ స్టేషన్ల కు క్యూ కడుతున్నారని తెలుస్తోంది. తమకు అన్యాయం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారని సమాచారం. అందరి నుంచి లిఖితపూర్వకండా ఫిర్యాదులు తీసుకుంటున్నారట పోలీసులు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో అపార్టుమెంట్ల అనుమతికి కోడెల తనయుడు శివరాం తన వద్ద అక్రమంగా డబ్బు వసూళ్లు చేశారని.. అలా చేయడమే కాకుండా ఇంకా తనను డబ్బులివ్వాలని ఇబ్బంది పెడుతున్నారంటూ మల్లికార్జునరావు అనే బిల్డర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈయన ఒక్కరే కాదు.. నియోజకవర్గంలో శివరాం ''కే ట్యాక్స్'' పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారంటూ చాలా మంది ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు. అయితే, అప్పుడు ప్రభుత్వం వాళ్ల పార్టీదే ఉండడంతో ఇది బయటకు రాకుండా చేశారు. ఇప్పుడు మాత్రం శివరాంపై కేసు నమోదు చేశారు పోలీసులు.

కేవలం శివరాం పైనే కాదు.. ఆయన సోదరి, కోడెల శివప్రసాద్ కుమార్తె పూనాటి విజయలక్ష్మి పై కూడా నరసరావుపేటలో ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో తాను కొనుగోలు చేసిన భూమికి అన్యాయంగా తనవద్ద డబ్బు వసూలు చేశారని సదరు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు, తాను అప్పట్లో డబ్బులు ఇచ్చినప్పటికీ ఇంకా ఇవ్వాలంటూ తనను వేధిస్తున్నారని అందులో జోడించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. ఈ రెండు కేసులు కోడెల కుటుంబాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి.

Tags:    

Similar News