అసలు కథ అప్పుడు తెలుస్తుందిలే కోడెల సారూ!

Update: 2019-04-17 04:30 GMT
'అంబటి రాంబాబు నాకు ప్రత్యర్థా.. చంద్రబాబుకు వైఎస్ జగన్ ప్రత్యర్థా..' అంటూ మాట్లాడారు తెలుగుదేశం నేత కోడెల శివప్రసాద రావు. పోలింగ్ బూత్ లోకి ప్రవేశించి - తలుపులు వేసుకోవడంపై తన కేసులు నమోదు అయిన నేఫథ్యంలో కోడెల స్పందించారు. అది కూడా అత్యంత తీవ్రంగా.

ఈ సందర్భంగా కోడెల చాలా ఆక్రోశంతో కూడా మాట్లాడారు. 'జగన్ జన్మలో సీఎం కాలేరు..' అని కూడా కోడెల అన్నారు. బహుశా శాపనార్థాలు పెట్టినట్టుగా ఉన్నారు ఈ తెలుగుదేశం నేత. ఇక తనకు పోటీగా నిలిచిన అంబటి రాంబాబు విషయంలో - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి విషయంలో కూడా కోడెల తీవ్ర వ్యాఖ్యానాలు చేశారు. వారికి తమతో పోటీ పడేంత స్థాయి లేదని ఆయన చెప్పుకొచ్చారు.

ఇలా ప్రత్యర్థుల విషయంలో 'స్థాయి'ల గురించి మాట్లాడటం మాత్రం కొంచెం విడ్డూరమే. ప్రజాస్వామ్యంలో- ఎన్నికల ప్రక్రియలో ఎవరికి ఎవరు పోటీనో చెప్పలేం! ఎన్టీఆర్ అంతటి మహానాయకుడే ఒక అనామకుడి చేతిలో ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఎన్టీఆర్ వీరాభిమాని అయిన కోడెలకు ఆ విషయం తెలిసే ఉండాలి.

అందులోనూ ఇదే అంబటి మీద గత ఎన్నికల్లో కోడెల నెగ్గింది మరీ భారీ మెజారిటీతో ఏమీ కాదు - స్వల్పమైన మెజారిటీతోనే నెగ్గారు. గత ఎన్నికల్లో జగన్ పార్టీకి - చంద్రబాబుకు కూటమికి మధ్య ఓట్ల తేడా కూడా పెద్దది ఏమీ కాదు. ఆ విషయాలన్నీ పక్కన పెట్టేసి కోడెల ఇలా 'స్థాయి'ల గురించి మాట్లాడారు.

అయినా ఆల్రెడీ జనాలు ఓట్లు వేసేశారు. ప్రజా తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తం అయిపోయింది. అలాంటప్పుడు ఇక ఇలాంటి మాటలతో ప్రయోజనం ఏమీ ఉండదు కదా!
Tags:    

Similar News