కోడెల చాలా పెద్ద తప్పు చేశారా?

Update: 2016-03-31 04:15 GMT
స్పీకర్ పదవిని చేపట్టే వారు తామరాకు మీద నీటిబొట్టులా ఉండాలని చెబుతారు. ఇప్పుడు రాజకీయ వాతావరణంలో అలాంటి స్పీకర్లు చాలా అరుదుగా కనిపిస్తారు. అధికారపక్షానికి అండగా ఉండాలనే తపనతో తప్పులు చేయకూడదు. స్పీకర్ కుర్చీకి మచ్చ తీసుకురాకూడదు. తనకున్న అధికారాలతో మంచి జరగకున్నా ఫర్లేదు కానీ.. చెడు సంప్రదాయాలకు తెర తీయకూడదు. కానీ.. తాజాగా ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఒక పెద్ద తప్పు చేశారన్న విమర్శ ఇప్పుడు వినిపిస్తోంది. సాపేక్షంగా చూస్తే.. ఆయన అలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుండేదన్న భావన పలువురు వ్యక్తం చేస్తున్నారు.

ద్రవ్య వినిమయ బిల్లుపై ఏపీ విపక్షం కోరినట్లుగా ఓటింగ్ నకు అనుమతించకుండా.. కోడెల వినిపించిన వాదన పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. పలువురు ఆయన నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. అధికారపక్షానికి మెజార్టీ ఉన్న నేపథ్యంలో డివిజన్ కు అవకాశం లేదని.. మూజువాణి ఓటింగ్ సరిపోతుందన్న ఆయన.. విపక్ష సభ్యుల నిరసనల్ని పట్టించుకోకుండా తన దారిన తాను లెక్కల్ని చకచకా చదివి.. సభను ముగించటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.

అసెంబ్లీలోని ఏ సభ్యుడైనా ఓటింగ్ పెట్టాలని కోరి హక్కు ఉంటుంది. అలాంటిది ఒక పార్టీ లేఖ ఇవ్వటం.. విప్ ను జారీ చేసిన తర్వాత ఓటింగ్ అక్కర్లేదంటూ తేల్చేసి.. హడావుడిగా సభను ముగించిన తీరు చూస్తే.. ఆయన తాజాగా స్టార్ట్ చేసిన సంప్రదాయం ఒక తప్పుగా మారటమే కాదు.. స్పీకర్ కుర్చీలో కూర్చున్న కోడెలకు ఒక మచ్చగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విపక్షం నుంచి జంప్ అయిన ఎమ్మెల్యేల ప్రయోజనాల్ని కాపాడేందుకే స్పీకర్ అలా వ్యవహరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి.. ఈ ఆరోపణలు.. విమర్శలపై కోడెల ఎలా రియాక్ట్ అవుతారో..?
Tags:    

Similar News