2వ టెస్టుకు కోహ్లి మిస్.. వందో టెస్టు మరింత ఆలస్యం.. ఇక వారిద్దరికీ చోటు కష్టమే

Update: 2022-01-03 11:30 GMT
దక్షిణాఫ్రికాతో టీమిండియా రెండో టెస్టుకు కెప్టెన్ విరాట్ కోహ్లి చివరి నిమిషంలో దూరమయ్యాడు. మైదానంలో టాస్ వేసేందుకు కేఎల్ రాహుల్ రావడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. చివరకు ఏం జరిగి ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే, కోహ్లి వెన్నునొప్పి కారణంగా ఈ మ్యాచ్ కు దూరమైనట్లు తెలిసింది. ఏడాది క్రితం వరకు జట్టులో చోటే కష్టమైన కేఎల్ రాహుల్ ఇప్పడు టెస్టు మ్యాచ్ కూ సారథ్యం వహిస్తున్నాడు. వన్డే రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు గాయం కావడంతో వన్డే సిరీస్ కూ ఇతడినే కెప్టెన్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరోవైపు అనూహ్యంగా ఇప్పుడు టెస్టు పగ్గాలు అందుకున్న రాహుల్.. ఏడాది నుంచి స్థిరంగా రాణిస్తున్నాడు. ఆ క్రమంలోనే వన్డే, టి20 వైస్ కెప్టెన్ అయ్యాడు. తాజాగా ఒకటే సిరీస్ లో టెస్టు , వన్డేలకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. మొత్తానికి భారత క్రికెట్ లో ఇప్పుడు కేఎల్ రాహుల్ శకం నడుస్తోంది. అందుకే పుజారా, రహానే వంటి సీనియర్లను కాదని అతడికి టెస్టు కెప్టెన్సీ అప్పగించారు.

కోహ్లికి అరుదైన అవకాశం ఆలస్యం కోహ్లి ఈ మ్యాచ్ లో బరిలో దిగి ఉంటే అతడికిది 99వ టెస్టు అయుండేది. కానీ,వెన్నునొప్పితో దూరం కావడంతో దక్షిణాఫ్రికా సిరీస్ లో చివరిది, మూడోది అయిన జనవరి 11 నుంచి జరిగే టెస్టు 99వది కానుంది. అంటే వందో టెస్టుకు కోహ్లి మరికొంత కాలం ఆగాల్సి ఉంటుంది.

మరో మూడు నెలల తర్వాత శ్రీలంక తో జరిగే టెస్టు సిరీస్ కోహ్లి వందో టెస్టుకు వేదిక కానుంది. ఇదే సమయంలో 26 నెలలుగా కోహ్లి ఏ ఫార్మాట్ లోనూ సెంచరీ చేయలేదు. అంటే.. వన్డేలు, టి20ల సంగతి వదిలేసి టెస్టు సెంచరీకి కోహ్లికి నాలుగు నెలలు పట్టేలా ఉంది. కాగా, కోహ్లి స్థానంలో తెలుగు ఆటగాడు హనుమ విహారికి చోటు దక్కింది.

పుజారా, రహానే ఇక కష్టమే జొహన్నెన్ బర్గ్ లో సోమవారం మొదలైన రెండో టెస్టులో టీమిండియా మొదట బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (26) దూకుడుగా ఆడినా త్వరగా ఔటయ్యాడు. అయితే, సీనియర్ బ్యాటర్లు చతేశ్వర్ పుజారా (3), అజింక్య రహనే (0) పూర్తిగా నిరాశపర్చారు.

పుజారా నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉండగా ఔటయ్యాడు. వైస్ కెప్టెన్ హోదా కోల్పోయి ఈ సిరీస్ ఆడుతున్న రహానే.. ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. పరిస్థితి చూస్తుంటే మూడో టెస్టులో వీరిద్దరికీ చోటు కష్టమే. అదే జరిగితే వీరిద్దరూ భారత్ కు తిరిగి వచ్చి రంజీ ట్రోఫీలో పాల్గొని ఫామ్ లోకి వచ్చే ప్రయత్నం చేయాలి. రహానే , పుజారా స్థానాలను భర్తీ చేయడానికి ఎలాగూ కుర్రాళ్లు విహారి, శ్రేయస్ అయ్యర్ సిద్ధంగా ఉన్నారు.




Tags:    

Similar News