కోహ్లి.. మూడేళ్లకు సెంచరీ మురిపెం.. అది కూడా టి20ల్లో

Update: 2022-09-09 07:09 GMT
2019 నవంబరు 23.. టీమిండియా కెప్టెన్ హోదాలో బంగ్లాదేశ్ తో గులాబీ టెస్టులో సెంచరీ.. 2022 సెప్టెంబరు 8.. సాధారణ టి20 ఆటగాడిగా టి20ల్లో సెంచరీ.. ఇదీ విరాట్ కోహ్లి తాజా శతకం (122 నాటౌట్‌; 61 బంతుల్లో 12×4, 6×6)విశేషం. దాదాపు మూడేళ్లయింది అతడు మూడంకెల స్కోరును చేసి.. భారత అభిమానులు ఆ మురిపెంను చూసి.. కానీ, గురువారం నాటి మ్యాచ్ లో ఆ కల తీరింది. కోహ్లి మునుపటిలా సెంచరీ అభివాదం కోసం హెల్మెట్ ను తీశాడు. ఈ సన్నివేశంలో అందరూ గమనించింది ఏమంటే.. అతడు తనపై ఉన్న పెద్ద భారాన్ని తొలగించుకున్నట్లు కనిపించింది. మూడేళ్లుగా సెంచరీ లేకపోవడాన్ని కోహ్లి కూడా సీరియస్ గానే తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని ఫలితమే అఫ్గానిస్థాన్ తో మ్యాచ్ లో మూడంకెల మార్కును దాటాక అతడు ఉపశమనం పొందినట్లుగా స్పష్టమైంది.

ఓపెనర్ గా రావడం కలిసొచ్చింది గురువారం అఫ్గాన్ తో మ్యాచ్ కు కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉండడంతో కోహ్లి ఓపెనర్ గా వచ్చాడు. ఇదే అతడికి కలిసొచ్చిందని చెప్పొచ్చు. వాస్తవానికి కోహ్లిది వన్ డౌన్. ఓపెనింగ్ కు దీనికి పెద్దగా తేడా లేకున్నా, ఆడే బంతులు కొన్నయినా తగ్గుతాయి. అన్నిటికి మించి ఓపెనింగ్ రిథమ్ వేరు. నిన్నటి మ్యాచ్ లో కోహ్లి పరుగులు  చేసిన విధానం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 28 పరుగుల వద్ద క్యాచ్ వదిలేయడంతో కోహ్లికి లైఫ్ దక్కింది. దీన్ని అతడు సెంచరీకి సోపానంగా మలుచుకున్నాడు. అత్యంత సాధికారతతో ఆడుతూ దూసుకెళ్లాడు.

వాస్తవానికి శ్రీలంక కంటే రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీ, ముజిబుర్ తదితరులతో కూడిన అఫ్గాన్ బౌలింగ్ పదునైనదే. ఓవిధంగా చెప్పాలంటే టోర్నీలో అత్యుత్తమ బౌలింగ్ లైనప్ ఈ జట్టుదే. అలాంటి అఫ్గాన్ పైనే కోహ్లి సెంచరీ కొట్టాడంటే అతడు మునుపటి విరాట్ అనుకోవాల్సిందే.

సానుకూలంగా ఆడుతూ.. అఫ్గాన్ తో మ్యాచ్ లో కోహ్లి చాలా సానుకూలంగా కనిపించాడు. అతడు ఆడిన షాట్లను బట్టే ఈ విషయం చెప్పొచ్చు. శ్రీలంపై కీలకమైన మంగళవారం నాటి మ్యాచ్ లో కోహ్లి క్లీన్ బౌల్డయిన విధానం చూసి అభిమానులు షాక్ తిన్నారు. ఈ టోర్నీలో విరాట్ హాంకాంగ్, పాకిస్థాన్ పై హాఫ్ సెంచరీలు చేశాడు. అంతకుముందు లీగ్ దశలో పాకిస్థాన్ పై మంచి పరుగులే చేశాడు. అయితే, లంకపై డకౌట్ తో అవన్నీ పక్కకు పోయాయి. ఈ నేపథ్యంలో అఫ్గాన్ తో మ్యాచ్ లోనూ విఫలమై ఉంటే విమర్శలు ఎదుర్కొనేవాడు. కానీ, దానికి ఆస్కారం ఇవ్వకుండా విరాట్ చెలరేగాడు. మొత్తమ్మీద టోర్నీలో 5 మ్యాచ్‌ల్లో 92 సగటుతో 276 పరుగులు సాధించి.. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.

ఊపు కొనసాగితేనే..   2.0 కోహ్లీనే కాదు.. సచిన్, పాంటింగ్, లారా ఇలా అనేక మంది దిగ్గజ బ్యాట్స్ మెన్లు గడ్డు కాలం ఎదుర్కొన్నారు. కానీ, వాటిని అంతే దిగ్విజయంగా అభివర్ణించారు. సచిన్ తన కెరీర్ చివరి ఐదేళ్లలో అత్యంత సాధికారంగా పరుగులు సాధించాడు. ఇప్పుడు కోహ్లి కూడా అదే స్థితిలో ఉన్నాడు. అంటే.. 33 ఏళ్ల కోహ్లి రాబోయే ఐదేళ్లు మరింతగా చెలరేగే అవకాశాలు ఉన్నట్లే. 2014-2018 మధ్య టన్నుల కొద్దీ పరుగులు సాధించిన విరాట్ ను మనం చూడబోతున్నట్లే. అయితే, ఇక్కడొక చిన్న మెలిక. కోహ్లి ప్రస్తుత గడ్డు కాలం నుంచి పూర్తిగా బయటపడినట్లు ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. అతడు సాధించిన తాజా సెంచరీ టి20ల్లో. వన్డేల్లోనూ కోహ్లి మూడంకెలు అందుకుని.. టెస్టుల్లో కూడా సెంచరీ కొట్టినప్పడే విరాట్ 2.0 మొదలైందని చెప్పొచ్చు.

టెక్నిక్ ఇంకా ఇంకా మెరుగుపడాలి శ్రీలంకతో సూపర్- 4 మ్యాచ్ లో కోహ్లి ఔటైన తీరు చర్చనీయాంశమే. మంచి టెక్నిక్ ఉన్న కోహ్లి.. ఓ సాధారణ పేసర్ బంతికి ఔటైన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. అంటే.. కోహ్లి టెక్నిక్ లో  
ఇంకా లోపం ఉందన్నమాటే. ఫిట్ నెస్ తో పాటు టెక్నిక్ విషయంలో గతంలో ఇలాంటి పరిస్థితే ఎదురైన సందర్భంగా కోహ్లి తీవ్రంగా శ్రమించి సరిదిద్దుకున్నాడు. మళ్లీ అలా రీ కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News