WTC ఫైన‌ల్లో ఓడినా ఏమీ కాదుః కోహ్లీ.. ఈ మాట‌ల అర్థం అదేనా?

Update: 2021-06-18 07:30 GMT
మైదానంలో విరాట్ కోహ్లీ ఎలా ఉంటాడు? ప్రతీ క్రికెట్ అభిమానికీ ఈ విష‌యం తెలుసు. ఎంతో దూకుడుగా ఉంటాడు. విజ‌య‌మా? వీర స్వర్గమా? అన్న‌ట్టుగా ప్ర‌వ‌ర్తిస్తుంటాడు. అంతి ల‌క్ష్యం గెలుపే అన్న‌ట్టుగా ఆడుతుంటాడు. అలాంటి కోహ్లీ.. ప్ర‌పంచ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్లో ఎలా ఆడుతాడు? పైగా.. అత‌డు కెప్టెన్ అయిన ఐదేళ్ల‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక్క‌సారి కూడా ఐసీసీ ట్రోఫీని అందుకోలేదు. ఇప్పుడు ఈ సువ‌ర్ణావ‌కాశం వ‌చ్చింది. ఇలాంటి స‌మ‌యంలో ఇంకెలా ఉంటాడు? కానీ.. మీరు మనసులో అనుకున్నదానికి రివర్స్ లో మాట్లాడుతున్నాడు కోహ్లీ!

వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్ షిప్ ఓడిపోతే ప్ర‌పంచం ఆగిపోదు అని అంటున్నాడు. అంతేకాదు.. ఇది కూడా ఓ సాధార‌ణ మ్యాచ్ అనేశాడు. గ‌తంలో ఎన్నో జ‌ట్లు ఎన్నో మ్యాచుల్లో ఓడిపోయాయని, ఇది ఒక ఆట అని మాత్ర‌మే అంద‌రూ అర్థం చేసుకోవాలి అంటూ.. వేదాంతం మాట్లాడుతున్నాడు. కోహ్లీ నుంచి ఈ త‌ర‌హా మాట‌లు విన్న‌వారంతా అవాక్క‌వుతున్నారు. ఇదంతా మాట్లాడేది నిజంగా కోహ్లీనేనా? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

‘‘చ‌రిత్ర‌ను ఒక‌సారి ప‌రిశీలించండి. ఎంద‌రో ఎన్నో మ్యాచులు ఓడిపోయారు. దాన్ని బ‌ట్టి ఇదొక క్రీడ అని అర్థ‌మ‌వుతుంది. మేము ఈ ఫైన‌ల్ గెలిచినా.. ఓడినా.. మా క్రికెట్ ఇక్క‌డితో ఆగిపోదు. అందుకే.. ఈ ఫైన‌ల్ ను ప్ర‌త్యేకంగా చూడ‌ట్లేదు. ఇది మ‌రో మ్యాచ్ అంతే. బ‌య‌టి జ‌నాలే అతిగా ఆరాట ప‌డుతున్నారు. చావో రేవో అన్న‌ట్టు భావిస్తారు’’ అని అన్నాడు కోహ్లీ. అయినప్పటికీ.. పటిష్టమైన జట్టునే బరిలోకి దింపుతున్నామని, ఏం చేయాలో నిర్ణయించుకున్నామని చెప్పుకొచ్చాడు. అయితే.. గెలుపోటములను సమానంగా స్వీకరించాల్సి ఉందన్నాడు.

ప్ర‌పంచ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ ప్రారంభం వేళ కెప్టెన్ నుంచి ఇలాంటి మాట‌లు రావడం పట్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్య‌లు ఖచ్చితంగా జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న‌పై ప్ర‌భావం చూపుతాయ‌ని అభిప్రాయప‌డుత‌న్నారు. ఎల్ల‌ప్పుడూ దూకుడుగా ఉండే కోహ్లీనేనా ఇలా మాట్లాడేది? అని అంటున్నారు. ఇలా వ్యాఖ్యానించ‌డం ద్వారా.. ఈ ఫైన‌ల్లో ఇండియా ఓడిపోయే అవ‌కాశం ఉంద‌ని ఇండైరెక్ట్ గా చెబుతున్నాడా? అనే అనుమానం కూడా వ్య‌క్తం చేస్తున్నారు.

ఆస్ట్రేలియా సిరీస్ లో తొలి టెస్టు మ్యాచ్ లో దారుణ‌ ఓట‌మి అనంత‌రం కోహ్లీ ఇండియా తిరిగి వ‌చ్చేశాడు. ఆ త‌ర్వాత ప‌గ్గాలు అందుకున్న అజింక్యా ర‌హానే.. అద్భుతంగా జ‌ట్టును న‌డిపించి సిరీస్ సాధించి ప్ర‌పంచాన్ని ఆశ్చ‌ర్యంలో ముంచెత్తాడు. ఇప్పుడు వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ ఇంగ్లండ్ లో జ‌రుగుతోంది. ఒక వేళ ఓడిపోతే.. ఈ లెక్క‌ల‌తో మీద‌ప‌డిపోతారేమోన‌న్న భ‌యంతోనే కోహ్లీ ఇలా మాట్లాడుతున్నాడ‌ని, ముందుగానే ప‌రిస్థితిని కూల్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడ‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. దీనికి కెప్టెన్ కోహ్లీ ఏమంటాడో?
Tags:    

Similar News