వంగవీటికి గట్టి హామీ...టీడీపీలో పెద్ద బాధ్యతలు

Update: 2022-12-04 07:32 GMT
వంగవీటి రాధాక్రిష్ణ బెజవాడ రాజకీయాల్లో కీలకమైన నేత. తండ్రి వంగవీటి మోహన్ రంగారావు ఒక బలమైన కులానికి ఐకాన్. ఆరాధ్య నాయకుడు. ఆయన వారసుడిగా రాధా రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన కాంగ్రెస్ లో అరగేంట్రం చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత ప్రజారాజ్యం, వైసీపీ టీడీపీ ఇలా అన్ని పార్టీలను చుట్టేసినా రెండవమారు ఎమ్మెల్యే కాలేకపోతున్నారు.

ఇక 2024 ఎన్నికల్లో ఆయన జనసేనలోకి వెళ్ళి పోటీ చేస్తారు అని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఆయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నా కూడా సైలెంట్ గానే  ఉంటున్నారు. ఈ నేపధ్యంలో ఇన్నాళ్ళు రాధా వైపు పెద్దగా చూడని టీడీపీ అధినాయకత్వం ఇపుడు ఆయనను తమ వైపే ఉంచుకోవాలని గట్టిగా డిసైడ్ అయినట్లుగా ఉంది. ఈ నేపధ్యంలో చంద్రబాబు క్రిష్ణ జిల్లా టూర్ కి సంబంధించి వంగవీటికి కూడా కీలకమైన బాధ్యతలను అప్పగించారుట.

ఈ టూర్ లో మిగిలిన నేతలను అందరినీ కో ఆర్డినేట్ చేసుకునే బాధ్యతలను మాజీ మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, సీనియర్ నాయకులు బుద్ధా వెంకన్న, గద్దే రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరరావులకు అప్పగించారు.  ఇక ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి సంబంధించి వంగవీటికి కూడా బాధ్యతలు అప్పగించారు.

దాంతో ఆయనను మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తాజాగా కలిశారు. ఇది టీడీపీ రాజకీయాల్లో విశేష పరిణామంగానే చూస్తున్నారు. రవీంద్ర వంగవీటి భేటీలో అనేక అంశాలు ప్రస్థావనకు వచ్చాయని అంటున్నారు. ఎన్టీయార్ జిల్లాలో టీడీపీకి పూర్వ వైభవం తెచ్చేలా చంద్రబాబు టూర్ ఉంటుందని దీన్ని విజయవంతం చేయాలని రవీంద్ర వంగవీటిని కోరినట్లుగా చెబుతున్నారు.

అదే సమయంలో అధినాయకత్వం తరఫున ఆయనకు కొన్ని హామీలు కూడా ఇచ్చారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో రాధాకు టికెట్ కూడా కచ్చితంగా కంఫర్మ్ చేస్తారని మాజీ మంత్రి చెప్పినట్లుగా ప్రచారం అవుతోంది. వంగవీటి మరి ఏ నియోజకవర్గం కోరుకుంటున్నారు. ఆయనకు ఎక్కడ టికెట్ ఇస్తారు అన్నది ఇప్పటికైతే తేలదు కానీ ఆయనకు టికెట్ ఇవ్వాలీ అంటే విజయవాడ తూర్పు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ని కదల్చాలి. అది సాధ్యమవుతుందా అనంది తెలియదు

ఇంకో వైపు చూసుంటే విజయవాడ సెంట్రల్ మీదనే రాధా కన్ను ఉందని అంతా చెబుతున్నారు. వైసీపీలో కూడా ఆ సీటు దక్కకనే ఆయన టీడీపీలోకి 2019 ఎన్నికల్లో వచ్చారన్నది కూడా తెలిసిందే. ఇపుడు ఆ సీటు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ చేతిలో ఉంది. ఆయనే ఇంచార్జిగా ఉంటున్నారు. ఆయన్ని కాదని రాధాకు ఇచ్చే సీన్ ఉందా అనేది తెలియడంలేదు.

ఇలా తేలని లెక్కలు ఎన్నో ఉన్న కారణంగానే వంగవీటి జనసేనలోకి వెళ్ళి తాను కోరుకున్న చోట పోటీ చేయాలని చూస్తున్నారు. అయితే ఇన్నాళ్ళూ ఆయన కదలికల పట్ల మౌనంగా ఉన్న టీడీపీ అధినాయకత్వం ఇపుడు ఆయన వద్దకు రాయబేరాలు పంపడంలోని ఆంతర్యం ఏమిటి అన్న చర్చ వస్తోంది. రాధాను తమతో ఉంచుకోవాలని అవసరమైతే ఆయన కోరుకున్న విధంగా చేయడానికి సీటు ఇవ్వడానికి కూడా రెడీ అని సంకేతం పంపిస్తున్నారా అన్నదే చర్చగా ఉంది.

మరి ఆ విధంగా టీడీపీ మాటకు కట్టుబడి ఉంటే ఆ నమ్మకం రాధాలో కలిగితే కచ్చితంగా ఆయన టీడీపీని వీడిపోరు అనే అంటున్నారు. అయితే ఇది సాధ్యమా అన్నది కూడా చూడాలి. మరో వైపు జనసేనలో చేరేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్న రాధా ఈ టైం లో వెనక్కి వస్తారా అన్నది కూడా చూడాలి. ఒకనాడు ప్రజారాజ్యంలో కీలకమైన పాత్ర పోషించిన వారు ఇపుడు జనసేనను అధికారంలోకి తీసుకురావడానికి చూస్తున్నారు. అంతా ఒక్క చోటకు చేరుతున్నారు.

అలా చేరాలి అని ఒక బలమైన సామాజికవర్గం పెద్దలు కోరుకుంటున్న నేపధ్యంలో రాధా మీద టీడీపీ ఆశలు పెట్టుకుంది. మరి ఆయన ఏమంటారో. వంగవీటి అడుగులు ఆయన రాజకీయ కదలికలే ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో కీలకమైన మార్పులు తీసుకువస్తాయని అంటున్నారు.
Tags:    

Similar News