కోమ‌టిరెడ్డికి.. క‌విత‌క్క‌.. వార్నింగ్ లాంటి విన్న‌పం.. ఏంటంటే!

Update: 2022-12-21 10:30 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ క‌విత‌.. మాటల పుట్ట అనే సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. తండ్రిత‌గ్గ త‌న‌య కూడా. ఒక మాట ఎవ‌రైనా అంటే.. దానికి వంద మాట‌ల‌తో స‌మాధానం చెప్ప‌గ‌ల దిట్ట. అనుకూలురైనా.. ప్ర‌తికూలురైనా.. ఆమె మాట‌ల దాడి భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు ఇదే త‌ర‌హాలో.. బీజేపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌పై వార్నింగ్ లాంటి విన్న‌పాల‌తో విరుచుకుప‌డ్డారు.

తాజాగా ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో సీబీఐ అధికారులు.. న‌మోదు చేసిన‌చార్జి షీట్‌లో క‌విత పేరును కూడా జ‌త చేసిన విష‌యం తెలిసిందే. నిజానికి ఆమె పాత్ర‌పై ఆది నుంచి అనుమానాలు ఉన్నాయి. కానీ, ఆమెమాత్రం మొద‌టి నుంచి ఎదురు దాడి చేస్తూనే ఉన్నారు. త‌న పాత్ర లేద‌ని చెప్పారు. త‌ర్వాత‌.. పెడితే కేసులు పెట్టుకోమ‌న్నారు. జైలుకే క‌దా.. పంపిస్తార‌ని వ్యాఖ్యానించారు. ఈ క్ర‌మంలోనే తాజాగా 28 చోట్ల క‌విత పేరు పేర్కొంటూ.. సీబీఐ చార్జిషీటు రెడీ చేసింది.

సీబీఐ చార్జిషీటులో క‌విత పేరును ఉటంకిస్తూ.. రాజ‌గోపాల్‌రెడ్డి..  కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. "మ‌ద్యం వాస‌న తెలియ‌ని లిక్క‌ర్ క్వీన్‌" అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, సీబీఐ చార్జిషీటులో 28 సార్లు.. లిక్క‌ర్ క్వీన్ పేరు చేర్చార‌ని అయినా.. పాపం ఆమెకు ఏ పాపం తెలియ‌ద‌ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వీటిని బీజేపీ సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ చేసింది.

ఆ వెంట‌నే ఈ వ్యాఖ్య‌ల‌పై క‌విత రియాక్ట్ అయ్యారు. అయితే.. గ‌తంలో వేడి వేడిగా చేసిన హాట్ కామెంట్ల స్థానంలో చాలా చాలా కూల్‌గా స్పందించారు. అయితే.. ప‌దునైన  మాట‌లే  వాడారు. "రాజ‌గోపాల్ అన్నా తొంద‌ర ప‌డ‌కు. మాట జార‌కు. 28 సార్లు నా పేరు చేర్చినా.. 28 వేల సార్లు పేరు చేర్చినా.. అబ‌ద్ధం నిజం కాద‌న్నా. జ‌ర వెయిట్ చెయ్యి. ఎవ‌రు  దొంగ‌లో.. ఎవ‌రు దొర‌లో తేలుతుంది" అని కామెంట్ చేయ‌డం.. విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News